ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్రేడింగ్ అసమతుల్యత, జోనల్ విభజనలో లోపాలు
రీ–కేటగిరైజేషన్ కాకుండానే స్థానిక కేడర్ కేటాయింపులు
దీంతో అల్లూరి, అనకాపల్లి జిల్లాల పంచాయతీ సెక్రటరీలకు తీరని అన్యాయం
400 మంది సొంత జిల్లాలకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి
ఈ విషయంలో ప్రభుత్వ జీవో సరిగా అమలుకాలేదని ఉద్యోగుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఉద్యమం తప్పదంటూ హెచ్చరికలు
సాక్షి, అనకాపల్లి: ఉమ్మడి విశాఖ జిల్లాలో పంచాయతీ సెక్రటరీల స్థానిక కేడర్ కేటాయింపుల ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. గ్రేడింగ్ విధానంలో దొర్లిన తీవ్ర అసమతుల్యతలు, జోనల్ విభజన లోపాల కారణంగా ఏజెన్సీలో ఉన్న సచివాలయ గ్రేడ్–5 కార్యదర్శులకు, మైదాన ప్రాంతంలో ఉన్న గ్రేడ్–4 కార్యదర్శులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. సీనియారిటీ ఉన్నప్పటికీ అల్లూరి, అనకాపల్లి జిల్లాలో దాదాపు 400 మంది పంచాయతీ సెక్రటరీలు తమ సొంత జిల్లాలకు శాశ్వతంగా దూరమై... స్థానికతను కోల్పోయి.. తమ కుటుంబాలకు వందల కిలోమీటర్ల దూరంలో నివసించాల్సిన పరిస్థితి తలెత్తింది. గ్రేడ్–4, గ్రేడ్–5లో సచివాలయ కార్యదర్శులు మాత్రమే ఉండడడంతో, తాజా వ్యవహారం వీరిపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగానే పరిగణించడం జరుగుతుందని సంబంధిత వర్గాలు విమర్శిస్తున్నాయి.
అసలు సమస్య ఏమిటి?
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకారం స్థానిక కేడర్ కేటాయింపులు జరపాల్సిఉంది. అంటే ఉద్యోగి భవిష్యత్తులో ఏ జిల్లాలో, ఏ జోన్‌లో సేవ చేయాలో ఇప్పుడే నిర్ణయించడం జరుగుతుంది . ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ఐదు గ్రేడ్లు (1,2,3,4,5) ఉన్నాయి. ఈ గ్రేడ్లకు అనుగుణంగా పంచాయతీ కార్యదర్శుల పోస్టులు కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వం కొత్తగా 4 కేటగిరీలను ప్రతిపాదించింది. ఇందులో ఒకటి స్పెషల్ గ్రేడ్ (10,000 కంటే ఎక్కువ జనాభా లేదా రూ.1 కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న పంచాయతీలు)కాగా, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నాయి. మొదటి 4, 5 గ్రేడ్లను కొత్తగా తీసుకువచ్చి గ్రేడ్–3లో విలీనం చేయాలి. అయితే ఈ ప్రక్రియలో ముందుగా చేయాల్సిన.. గ్రామ పంచాయతీల రీ–కేటగిరైజేషన్ (నాలుగుగా) చేయకుండా, పాత గ్రేడింగ్ ఆధారంగానే (ఐదు గ్రేడింగ్‌ల ప్రాతిపదికనే) కేటాయింపులు జరుగుతున్నాయని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. దీనివల్ల లోకల్ క్యాడర్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ విషయంలో భారీ అసమానతలు వస్తున్నాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అనకాపల్లికి సంబంధించి 180 మంది, అల్లూరికి సంబంధించి 228 మంది.. మొత్తం 400 మంది పంచాయతీ సెక్రటరీలు దీనివల్ల తీవ్ర ప్రతికూల ప్రభావానికి గురవుతారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇంత జరుగుతున్నా.. డిప్యూటీ సీఎం, ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమకు న్యాయం చేయకుంటే ఉద్యమం తప్పదంటూ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.
జోన్ల విధానంతో పరస్పర బదిలీలకూ సమస్య
ఉమ్మడి విశాఖ జిల్లా విడిపోయి విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా మారాయి. కానీ గ్రేడింగ్ తగిన విధంగా జరగలేదు. ఈ నేపథ్యంలో అల్లూరి జిల్లాకు చెందిన ఉద్యోగులు అనకాపల్లిలో పనిచేస్తున్నారు. అనకాపల్లి జిల్లాకు చెందిన ఉద్యోగులు అల్లూరిలో పనిచేస్తున్నారు. రీ–కేటగిరైజేషన్ లేకుండా లోకల్ కేడర్ ఫిక్స్ చేస్తే ఈ పోస్టింగులే శాశ్వతం అవుతాయన్నది సంబంధిత 400 మంది పంచాయతీ కార్యదర్శుల ఆవేదన. ఇక రెండు ప్రాంతాలూ వేర్వేరు జోనల్ పరిధిలోకి చేరడం వల్ల పరస్పర బదిలీలూ కష్టతరమవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జోన్–1లో విశాఖ, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం ఉండగా, జోన్–2లోకి అల్లూరి, తూర్పుగోదావరి, పోలవరం ప్రాంతం ఉండడం గమనార్హం. పైగా గతంలో గిరిజన ప్రాంతంలో 2 సంవత్సరాలు పనిచేస్తే తిరిగి మైదాన ప్రాంతానికి వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు లోకల్ కేడర్ ఫిక్స్ అయితే.. చాలామంది ఉద్యోగ జీవితమంతా ఏజెన్సీ ప్రాంతంలోనే ఉండాల్సి రావచ్చని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
జూలై 5 వరకూ గడువిచ్చినా.. ప్రయోజనమేది?
ప్రభుత్వ జీవో ప్రకారం ముందుగా గ్రామ పంచాయతీలను కొత్త గ్రేడ్లలోనికి మార్చాలి. తర్వాత పోస్టులను తిరిగి వర్గీకరించాలి. అనంతరం స్థానిక కేడర్‌కి కేటాయించాలి. అయితే ఈ మూడు దశల్లో మొదటి దశ పూర్తి కాకుండానే మూడో దశకు ప్రభుత్వం వెళ్లిందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. నిజానికి ఉద్యోగ సంఘాల ఒత్తిడితో ఆప్షన్లు నమోదు చేసే గడువును జూలై 5 వరకు పెంచడం జరిగింది. అయితే అసలు సమస్య.. రీ–కేటగిరైజేషన్, జోన్‌లకు సంబంధించిన లోపాలు, గ్రేడింగ్ అసమానతలు సరిచేయకుండా.. ఆప్షన్ల ఎంపికకు గడువు పొడిగించినా ప్రయోజనం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు
– ముందుగా గ్రామ పంచాయతీల రీ–కేటగిరైజేషన్ పూర్తి చేయాలి.
– పాత గ్రేడింగ్ ఆధారంగా లోకల్ కేడర్‌ను ఖరారు చేయకూడదు.
– జోనల్ విభజనలోని లోపాలను తొలుత సవరించాలి.
– ఉద్యోగులు తమ సొంత జిల్లాల్లో పనిచేసేలా అవకాశం కల్పించాలి.
– తుది స్థానిక కేడర్ కేటాయింపులను.. రీ–కేటగిరైజేషన్ తర్వాత మాత్రమే చేపట్టాలి.
– ముందుగా రీ–కేటగిరైజేషన్ చేస్తే పాత గ్రేడ్–4, గ్రేడ్–5 మధ్య ఉన్న అసమానత తొలగిపోతుంది. వీటిలోని అందరూ కొత్తగా గ్రేడ్–3 లోకి వస్తారు.
– దీంతో పోస్టుల పంపిణీ సమానంగా జరిగి లోకల్ కేడర్ కేటాయింపులు మరింత న్యాయంగా జరిగే అవకాశం ఉంటుంది.
– జిల్లాల మధ్య సమతుల్యత ఏర్పడి ఆయా ఉద్యోగులు సొంత జిల్లాలకు వెళ్లే అవకాశాలు పెరుగుతాయి.


