
పోలీసుల అదుపులో సోషల్ మీడియా యాక్టివిస్ట్ భార్గవ్
సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారన్న కేసులో పోలీసులపై గుంటూరు సీబీసీఐడీ కోర్టు ఆగ్రహం
ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేశారు?
ఇది పోలీసుల విధి నిర్వహణలో నిర్లక్ష్యమే
వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఉత్తర్వులు
గుంటూరు లీగల్: సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారన్న నెపంతో అమాయకులను అరెస్ట్ చేయడంలో కూటమి ప్రభుత్వం, పోలీసుల అత్యుత్సాహం మరోసారి బహిర్గతమైంది. ఇలాంటి అరెస్ట్ విషయంలో గుంటూరు సీబీసీఐడీ కోర్టు నుంచి పోలీసులు తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొనాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యూరియాపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఫ్యాబ్రికేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని నమోదుచేసిన అక్రమ కేసులో ఆరో నిందితుడిగా చేర్చిన సాయిభార్గవ్‌ను గురువారం సీబీసీఐడీ కోర్టులో హాజరుపరిచారు.
పోలీసులు తనను తీవ్రంగా కొట్టినట్లు సాయిభార్గవ్ న్యాయమూర్తికి తెలిపారు. దీంతో సాయిభార్గవ్‌ను వైద్య పరీక్షలకు పంపాల్సిందిగా జడ్జి ఆదేశించారు. గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గురువారం అర్ధరాత్రి సీబీసీఐడీ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా సాయిభార్గవ్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. కేవలం సెల్‌ఫోన్ ఆధారంగా సాయిభార్గవ్‌ను నేరంలోకి లాగడం సరికాదన్నారు.
పోలీసులు ఆరోపించిన విధంగా నిందితునికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వాదనలు విన్న జడ్జి ఈ అరెస్ట్ విషయంలో పోలీసుల పనితీరును తీవ్రంగా తప్పు పట్టారు. సాయిభార్గవ్‌ను అరెస్ట్ చేసిన విధానంలో పోలీసుల విధి నిర్వహణ సక్రమంగా లేదన్నారు. పోలీసుల తప్పిదాన్ని ఎత్తి చూపిస్తూ, సాయిభార్గవ్‌ను ఏ విధంగా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. తగిన ఆధారం లేకుండా కేవలం అధికారంతో అమాయకులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు.
కేవలం సెల్‌ఫోన్ ఆధారంగా సాయిభార్గవ్‌ను నేరంలోకి ఎలా లాగుతారని నిలదీశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కారాదని హెచ్చరించారు. సాయిభార్గవ్‌ను రూ. 25 వేల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఉత్తర్వులు జారీచేశారు. అక్టోబర్ 8వ తేదీలోపు రూ. 25 వేలతో ఇద్దరి జామీను సమర్పించాలని ఆదేశించారు. అనంతరం సాయిభార్గవ్ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు. మంగళగిరిలో నమోదయిన ఇదే కేసులో సోషల్ మీడియా యాక్టివిస్ట్ వజ్రాల తారక్ ప్రతాప్ రెడ్డికి కోర్టు గురువారం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం తారక్‌ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.