సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మొహన్ రెడ్డి పాదయాత్ర మొదలైతే..కూటమి అంతిమ యాత్ర మొదలైనట్లేనని మాజీ మంత్రి గుడివార అమర్నాథ్ స్పష్టం చేశారు. మేకప్ మంత్రి అంటూ తాను చేసిన కామెంట్స్‌కు మహిళా కమిషన్‌కు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. మంగళవారం మహిళా కమిషన్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
నేను మహిళలను అవమానించానని టీడీపీ నాపై తప్పుడు ప్రచారం చేసింది. నేను చేసిన కామెంట్ పొలిటికల్ సెటైర్ మాత్రమే. హోంమంత్రి అనిత మా పార్టీ నేతలపై అనేకసార్లు ఇష్టానుసారం మాట్లాడారు. వ్యవస్థలపై గౌరవంతోనే విచారణకు హాజరయ్యాను. నేను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని మహిళా కమిషన్‌కు చెప్పాను.టీడీపీ, కూటమి నేతలు ఊహించున్నవాటికి సమధానం చెప్పాల్సిన అవసరం లేదు.
రాజకీయంగా మీరు వంద అంటున్నారు.. మేం ఒక్కటంటే బాధ వచ్చిందా..?. రాష్ట్రంలో మహిళలు,చిన్నారులపై హత్యలు, అత్యాచారాలపై హోంశాఖ ఎందుకు మాట్లాడటం లేదు.
సాయికృష్ణ తల్లి బూడిద కోసం బాధపడుతుంటే ఎందుకు స్పందించరు. ఉప్పాల హారికపై దాడి జరిగితే ఎందుకు స్పందించరు?. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దారుణాలపై ఎందుకు మాట్లాడరు..?.డిప్యూటీ స్పీకర్ మాటలు చూస్తుంటే ఇప్పుడున్న హోంమంత్రి పనికి రారా అనిపిస్తోంది.
మహిళలపై దాడులు జరుగుతుంటే స్పందించని హోంమంత్రి పదవి ఉంటే ఎంత?.. ఊడితే ఎంత..? అని మండిపడ్డారు.మహిళలపై నాకు అపారమైన గౌరవం ఉంది. వైఎస్ జగన్ పాదయాత్ర మొదలైతే.. కూటమి అంతిమ యాత్ర మొదలైనట్లే.కూటమి నేతలకు మహిళలంటే గౌరవం లేదన్నారు.


