సర్కారు అండతో ఖాకీల క్రౌర్యం | Government support for police brutality | Sakshi
Sakshi News home page

సర్కారు అండతో ఖాకీల క్రౌర్యం

Jun 19 2026 4:59 AM | Updated on Jun 19 2026 4:59 AM

Government support for police brutality

కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌లోనే కనుమరుగు 

దళిత యువకుడు క్రాంతికుమార్‌పై పోలీసుల కర్కశం.. థర్డ్‌ డిగ్రీ వేధింపులతో సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఆత్మహత్యకు పాల్పడిన క్రాంతికుమార్‌ 

విజయవాడ పోలీస్‌ బాస్‌ అండతోనే పోలీసుల అరాచకం.. బిగ్‌బాస్‌ వత్తాసు 

పోలీసు దారుణాలకు ప్రభుత్వ అండ 

ఐజీపై విచారణకు ఎస్పీ స్థాయి అధికారికి బాధ్యతలు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాపు, దళిత సంఘాలు

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో ఖాకీ కర్కశం వికట్టాహాసం చేస్తోంది. పోలీసు లాఠీ రాజ్యమేలుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పోలీసు థర్డ్‌ డిగ్రీ రాష్ట్రాన్ని శాసిస్తోంది. రక్షకభట నిలయాలు మానవ వథశాలలుగా మారుతున్నాయి. చంద్రబాబు అండదండలతో టీడీపీ వీరవిధేయ ఐపీఎస్‌లు రెచ్చిపోయి అరాచకం ప్రదర్శిస్తున్నారు. రోజులు, నెలల తరబడి యువకులను అక్రమంగా నిర్బంధించి.. చిత్రహింసలకు గురిచేస్తూ వారి పాలిట పోలీసులే యమకింకరులుగా మారుతున్నారు. అందుకు విజయవాడ కేంద్రబిందువుగా మారడం గమనార్హం. విజయవాడ పోలీస్‌ బాస్, బిగ్‌బాస్‌ కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌లోనే పోలీస్‌ థర్డ్‌ డిగ్రీ వికృత రూపం దాల్చింది. 

విజయవాడ పోలీసులు కాపు యువకుడు గాదె సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేసి ‘కనుమరుగు’ చేసిన ఉదంతం సంచలనంగా మారగా... అంతలోనే విజయవాడ పోలీసులు నెలల తరబడి చిత్రహింసలకు గురి చేయడంతో పోగు క్రాంతికుమార్‌ అనే దళిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఈ రెండు ఘటనలపైనా కాపు సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతుండగా.. దళిత సంఘాలు సైతం పోలీస్, ప్రభుత్వ తీరుపై ఆగ్రహోదగ్రమవుతున్నాయి. 

పోలీస్‌ దందాకు ఎదురు తిరగడంతో.. 
తాజా ఉదంతంలో విజయవాడకు చెందిన దళిత యువకుడు పోగు క్రాంతికుమార్‌ ఆత్మహత్య ముందు రికార్డు చేసిన మరణ వాంగ్మూలం సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. విజయవాడ పోలీసుల వేధింపులు తట్టుకోలేకే తాను పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని.. తన ఆత్మహత్యకు కృష్ణలంక సీఐ నాగరాజు బాధ్యుడని కూడా స్పష్టం చేస్తూ క్రాంతికుమార్‌ ఆత్మహత్యకు పాల్పడిన తీరు అందర్నీ కలచి వేస్తోంది. ఈ ఉదంతంతో క్రాంతికుమార్‌ను పోలీసులు ఎంత దారుణంగా చిత్రహింసలకు గురి చేశారన్నది వెలుగులోకి వచ్చింది.

మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు పోగు వెంకటేశ్వరరావు కుమారుడైన క్రాంతికుమార్‌ వివిధ పనులు చేసుకుంటూ జీవించేవారు. అతడిని కృష్ణలంక పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. తాము చెప్పిన పనులన్నీ చేయాలని వేధించారు. తమకు అనుకూలంగా నేరాలు చేసేలా.. తమ సెటిల్‌మెంట్లకు సహకరించేలా పోలీసులు ఆయన్ని వాడుకున్నట్టు తెలుస్తోంది. కొన్నాళ్ల తరువాత పోలీసుల దందాకు తాను సహకరించలేనని క్రాంతికుమార్‌ ఎదురుతిరిగారు. 

దాంతో పోలీసులు ఆయనను కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి లాఠీమార్కు వేధింపులకు గురి చేశారు. విచారణ పేరుతో రోజూ స్టేషన్‌కు పిలిపించి వేధించడమే కాకుండా ఆయనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. ఇలా మూడు నెలలపాటు పోలీసుల అరాచకం సాగింది. వేధింపులు తట్టుకోలేక.. పోలీసులు థర్డ్‌ డిగ్రీకి తన శరీరం ఇక ఏమాత్రం సహకరించదని భీతిల్లిన క్రాంతికుమార్‌ సెల్ఫీ వీడియో రికార్డు చేసి మే 21న ఆత్మహత్య చేసుకున్నారు. 

అసలు ట్విస్ట్‌ ఇదీ 
కాపు యువకుడు గాదె సాయికృష్ణను విజయవాడ పోలీసులు మే 9న అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో తీవ్రంగా చిత్రవథకు గురిచేశారు. కాళ్లూ చేతులూ కట్టేసి లాఠీలతో విరుచుకుపడుతుండటంతో సాయికృష్ణ హాహాకారాలు చేశాడు. పోలీసులు రోజుల తరబడి ఈ అరాచకం కొనసాగించారు. అదే సమయంలో దళిత యువకుడు క్రాంతికుమార్‌ను సైతం పోలీసులు కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారు. 

సాయికృష్ణపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంతో అతడు అచేతనంగా పడిపోయాడు. అనంతరం సాయికృష్ణను ఏం చేయాలనే దానిపై పోలీసులు మంతనాలు సాగించారు. పోలీస్‌ బాస్‌తోను, మరికొందరు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడటాన్ని క్రాంతికుమార్‌ గమనించారు. పక్కా పన్నాగంతోనే సాయికృష్ణను ‘కనుమరుగు’ చేయడాన్ని క్రాంతి ప్రత్యక్షంగా చూసినట్టు సమాచారం. 

తనను కూడా ఇదేవిధంగా చేస్తారని.. సాయికృష్ణలా కనుమరుగైపోతే.. కనీసం తన మృతదేహం కూడా తన కుటుంబ సభ్యులకు దక్కదని క్రాంతికుమార్‌ భావించారు. పోలీసుల చేతిలో చావుదెబ్బలు తింటూ ప్రాణాలు విడిచేకంటే ఆత్మహత్యకు పాల్పడితే మంచిదని నిర్ణయించుకున్నారు. తన మరణానికి కారణమేమిటనే దానిపై సెల్ఫీ వీడియో రికార్డు చేసి.. పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.  

కేసు పెడితే పోలీసు మార్క్‌ బెదిరింపులు 
పోలీసుల చిత్రహింసలు భరించలేక క్రాంతికుమార్‌ ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. తప్పనిసరి కావడంతో పోలీసులు మే 22న కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసు బాస్, ఇతర అధికారులు వెంకటేశ్వరరావుపై తమదైన శైలిలో ఒత్తిడి తెచ్చారు. ఈ కేసును పట్టించుకోవద్దని.. కాదని మొండికేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తమ మాట వింటే తృణమో ఫణమో ఇస్తామని కూడా ప్రలోభపెట్టారు. లేకపోతే క్రాంతికుమార్‌కు పట్టిన గతే ఇతరులకూ పడుతుందని హెచ్చరించారు. దాంతో వెంటేశ్వరరావు మౌనం వహించినట్టు తెలుస్తోంది. 

పోలీసులే దగ్గరుండి క్రాంతికుమార్‌ మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేయించారు. ఆ విధంగా తమ అరాచకాన్ని గుట్టుచప్పుడు కాకుండా కప్పిపుచ్చామని భావించారు. ఆ తరువాత సాయికృష్ణ లాకప్‌లోనే కనుమరుగైన విషయం వెలుగులోకి రాగా.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనివెనుక విజయవాడ పోలీస్‌ బాస్, బిగ్‌బాస్‌ సూత్రధారులనే విషయం బయటపడింది. దాంతో బాధిత కుటుంబం ధైర్యం చేసి క్రాంతికుమార్‌ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.  

అన్ని వేళ్లూ బాస్‌.. బిగ్‌బాస్‌వైపే 
పోలీసుల చిత్రహింసలతో సాయికృష్ణ లాకప్‌లోనే కనుమరుగు కావడం, దళిత యువకుడు క్రాంతికుమార్‌ పోలీసుల థర్డ్‌ డిగ్రీ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతాలను పోలీసులు నిస్సిగ్గుగా కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం వారి దమనకాండకు పరాకాష్టగా నిలుస్తోంది. ఈ రెండు ఉదంతాలను సీఐ నాగరాజు వరకే పరిమితం చేసి ఉన్నతాధికారులను తప్పించేందుకు పోలీస్‌ శాఖ ప్రయత్నిస్తోంది. అయితే.. ఈ రెండు దారుణాల వెనుక అన్ని వేళ్లూ విజయవాడ పోలీస్‌ బాస్, బిగ్‌బాస్‌ వైపే చూపిస్తున్నాయి. 

ఎందుకంటే.. ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి అచేతనంగా మారిన తరువాత కనుమరుగు చేయడం అన్నది సీఐ స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదన్నది పోలీసు శాఖ వ్యవహారాల గురించి అవగాహన ఉన్న అందరికీ తెలిసిందే. పోలీస్‌ కమిషనరేట్‌కు అల్టిమేట్‌ బాస్‌ పోలీస్‌ కమిషనరే. ఆయనకు చెప్పకుండా సాయికృష్ణను కనుమరుగు చేయడం సాధ్యం కాదు. ఇక రాజధాని ప్రాంతంలో ఓ కాపు యువకుడిని పోలీసులే అదృశ్యం చేసిన విషయాన్ని నగర బాస్‌.. బిగ్‌ బాస్‌ దృష్టికి ముందుగా తీసుకువెళ్లకుండా ఉంటారా అంటే.. కచ్చితంగా కాదని స్పష్టం చేస్తున్నారు పోలీస్‌ శాఖలో పనిచేసి రిటైరైన అధికారులు. 

అంటే ఈ విషయాలపై బిగ్‌ బాస్‌కు  ముందుగానే తగిన సమాచారం ఉండి ఉంటుందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సీఎంవో అండదండలు ఉన్న పోలీస్‌ బాస్, బిగ్‌బాస్‌ స్వయంగా కథ  నడపించారు కాబట్టే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఎంతగా ఆవేదన వెళ్లగక్కినా, హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. పోలీసుల అరాచకాన్ని నిస్సిగ్గుగా వెనకేసుకువచ్చింది.  

ఐజీపై విచారణకు ఎస్పీనా?! 
సాయికృష్ణను లాకప్‌లో అదృశ్యం చేసిన దారుణాన్ని చాకచక్యంగా కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా కుట్రకు తెర తీసింది. ఈ ఉదంతాన్ని పక్కదారి పట్టించేందుకు కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్‌కు పంపించి సరిపెట్టాలని యత్నించింది. చివరకు ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఆయన్ని సస్పెండ్‌ చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అదే సమయంలో ఈ ఉదంతంపై విచారణకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డీఎన్‌ కిశోర్‌ను నియమించడం ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. 

ఎందుకంటే సాయికృష్ణ అదృశ్యం వెనుక కేవలం సీఐ నాగరాజు మాత్రమే కాదు.. విజయవాడ టాస్‌్కఫోర్స్‌ విభాగంలో ఇద్దరు ఎస్పీస్థాయి మహిళా అధికారులు, పోలీస్‌ బాస్‌ పాత్ర ఉందనేది స్పష్టమవుతోంది. ఈ వ్యవహారం తెలిసినా పోలీస్‌ బిగ్‌బాస్‌ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారన్నది కీలకంగా మారింది. అంటే సాయికృష్ణ కనుమరుగైపోయిన ఉదంతంపై విచారించాలంటే.. ప్రాథమికంగా కృష్ణలంక సీఐ నుంచి నగర బాస్‌ వరకు అధికారులను విచారించాలి. నగర బాస్‌ ఐజీ ర్యాంక్‌ అధికారి. ప్రభుత్వం మాత్రం ఎస్పీస్థాయి అధికారి డీఎన్‌ కిశోర్‌ను నియమించడం గమనార్హం. 

నిజానికి ఎస్పీస్థాయి అధికారి ఐజీ స్థాయి అధికారి చేసిన అరాచకం, అక్రమాలపై విచారించలేరు. అది పోలీస్‌  ప్రోటోకాల్‌ కూడా కాదు. అయినా సరే ప్రభుత్వం ఎస్పీస్థాయి అధికారినే విచారణాధికారిగా నియమించింది. అంటే విచారణ వ్యవహారాన్ని సీఐ వరకే పరిమితం చేయాలన్నది ప్రభుత్వ కుతంత్రమనే విషయం స్పష్టమవుతోంది. టీడీపీ వీరవిధేయ ఐపీఎస్‌గా రెడ్‌బుక్‌ కుట్రలను అమలు చేస్తున్న రాజశేఖరబాబుకు ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది.  

సీబీఐ విచారణతోనే న్యాయం: న్యాయ నిపుణులు 
‘సాయికృష్ణ ఉదంతంపై వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలి. ఎందుకంటే పోలీస్‌ అత్యున్నత అధికారుల పాత్ర ఉందని భావిస్తున్న ఈ కేసును దిగువస్థాయి అధికారి అయిన ఎస్పీ డీఎన్‌ కిశోర్‌ విచారించడం నిబంధనలకు విరుద్ధం. ఆయన నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించడం సాధ్యం కాదు’ అని న్యాయనిపుణులు, పౌర హక్కుల సంఘాల నేతలు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. అందుకే.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ డిమాండ్‌ చేశారు.  

‘తూత్తుకుడి’ తీర్పు రిపీట్‌ కావచ్చు 
సాయికృష్ణ ఉదంతం నేపథ్యంలో తమిళనాడులోని తూత్తుకుడి దారుణ ఉదంతాన్ని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. తూత్తుకుడి పోలీసులు తండ్రీకొడుకులను పోలీస్‌ స్టేషన్‌లో అత్యంత భయంకరంగా హింసించడంతో ఇద్దరూ మరణించారు. ఈ కేసును విచారించిన మధురై న్యాయస్థానం ఆ దారుణంలో భాగస్వాములైన 9 మంది పోలీసులకు  ఉరిశిక్ష విధిస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 6న సంచలన తీర్పునిచ్చింది. ప్రస్తుతం విజయవాడ పోలీసులు పాల్పడిన దారుణం కూడా అటువంటిదేనని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు.  

నేను ప్రత్యక్షంగా చూశా: మహంకాళి చందు 
గాదె సాయికృష్ణను పోలీసులు చిత్రహింసలకు గురి చేయడాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని మహంకాళి చందు అనే యువకుడు వీడియో విడుదల చేశారు. తనను కూడా పోలీసులు ఆ రోజు కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లారని ఆయన చెప్పాడు. ‘కృష్ణలంక పోలీసులు నన్నూ ఓ  కేసులో అదుపులోకి తీసుకుని లాకప్‌లో పెట్టారు. అదే లాకప్‌లో ఉన్న సాయికృష్ణపై పోలీసులు విచక్షణా రహితంగా థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. ఆయన్ని చిత్రహింసలకు గురిచేశారు. అవన్నీ నేను ప్రత్యక్షంగా చూశాను. పోలీసులు అంతటి దారుణానికి పాల్పడ్డారు. సాయికృష్ణ చేసిన నేరాన్ని ఒప్పుకున్నా.. చేయని ఇతర నేరాలు కూడా ఒప్పుకోవాలని పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి అతడిని వేధించారు’ అని ఆ వీడియోలో మహంకాళి వివరించాడు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement