గజరాజులతో గస్తీ | Forest personnel going to Karnataka for training | Sakshi
Sakshi News home page

గజరాజులతో గస్తీ

Published Sun, Jun 23 2024 6:10 AM | Last Updated on Sun, Jun 23 2024 6:10 AM

Forest personnel going to Karnataka for training

మైసూర్‌ నుంచి నల్లమలకు రానున్న ఏనుగులు 

ఆంధ్రాకు 9 ఏనుగులను పంపేందుకు అనుమతి 

శిక్షణ కోసం కర్ణాటక వెళ్లనున్న అటవీ సిబ్బంది

పెద్దదోర్నాల: నల్లమల అడవుల పరిరక్షణకు ఏపీ అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అమూల్యమైన వృక్షసంపద అక్రమ రవాణాను అరికట్టేందుకు.. అరుదైన వన్య­ప్రాణులను సంరక్షించి వేసవిలో అగ్నికీలల నుంచి అటవీ ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఇప్పటికే బేస్‌ క్యాంప్‌లు, స్ట్రైకింగ్‌ ఫోర్స్, యాంటీ పోచింగ్‌ బృందాలను ఏర్పాటు చేసింది. దీంతోపాటు అభయారణ్యాల్లో ఇకపై గజరాజులతో గస్తీ చేప­ట్టాలని అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 

రెండు అభయారణ్యాల పరిధిలో..
మన రాష్ట్రంలోని ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో 3,727.82 చదరపు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించి ఉన్న అడవిని కేంద్ర ప్రభుత్వం 1983లో అభయారణ్యంగా ప్రక­టించింది. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం శిఖరం వరకు రాజీ­వ్‌­గాంధీ అభయారణ్యం.. మార్కాపురం, గిద్దలూరు, ఆత్మ­కూ­రు, నంద్యాల డివిజన్ల పరిధిలో గుండ్లబ్రహ్మేశ్వర అభ­యా­రణ్యం విస్తరించి ఉన్నాయి. వీటిలో పులులతో­పాటు చిరుత, ఎలుగుబంటి, జింకలు, దుప్పులు, హైనా, నెమళ్ల­తోపాటు 70 రకాల క్షీరదాలు, సరీసృపాలు, ఎన్నో­రకాల వృక్షాలు, ఔషధ మొక్కలు నల్లమల అభయారణ్యంలో ఉన్నా­యి. ఇవన్నీ మారుమూల లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తు­న్నాయి. దీంతో ఆయా ప్రాంతాలను సందర్శించి వాటిని సంరక్షించే బాధ్యత కత్తిమీద సాములా మారింది.

మూలమూలల్నీ జల్లెడ పట్టేలా..
మారుమూల ప్రాంతాల్లో సైతం వన్యప్రాణులు, వృక్షాలను సంరక్షించేందుకు వీలుగా అటవీ శాఖ ఉన్నతాధికారులు సుశిక్షితులైన సిబ్బంది నేతృత్వంలో ఏనుగులతో గస్తీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసు­కున్నారు. మారుమూల ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ నిర్వహించేందుకు తమకు శిక్షణ పొందిన 9 ఏనుగులు అవసర­మవుతాయని గుర్తించారు. తమకు అవసరమైన 9 ఏను­గులను ఇవ్వాల్సిందిగా ఏపీ అటవీ శాఖ అధికారులు కర్ణాటక అటవీ శాఖకు లేఖ రాశారు.

దీనిపై స్పందించిన కర్ణాటక అటవీ శాఖ అధికారులు శిక్షణ పొందిన ఏనుగు­లను ఆంధ్రప్రదేశ్‌కు పంపేందుకు ఆమోదం తెలిపారు. దీంతోపాటు ఏనుగులను కట్టడి చేసేందుకు మావటిలను తయారు చేసేందుకు అటవీశాఖ తమ సిబ్బందిని కర్ణాటక రాష్ట్రానికి పంపనుంది. రాష్ట్రానికి చెందిన సిబ్బంది అక్కడికి వెళ్లి గజరాజుల ఆహారపు అలవాట్లు, వాటి కదలికలు, వాటి ఇతర అలవాట్లను క్షుణ్ణంగా పరిశీలించి శిక్షణ పొందనున్నారు.

6 ఏనుగులను రాజీవ్‌గాంధీ వన్యప్రాణుల అభయారణ్యానికి, మరో మూడు ఏనుగులను గుండ్లబ్రహ్మేశ్వరం అడవులకు పంపేలా చర్యలు చేపట్టన్నారు. ఏనుగుల్ని తీసుకొస్తే పెద్ద పులులు ఎక్కువగా సంచరించే లోతట్టు ప్రాంతాలైన నెక్కంటి, రేగుమానుపెంట, తూము గుండాలు, ఆలాటం తదితర ప్రాంతాల్లో సైతం ధైర్యంగా పెట్రోలింగ్‌  చేపట్టవచ్చని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఏనుగులతో గస్తీ నిర్వహించేలా చర్యలు 
అభయారణ్యంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. నడక మార్గంలో సిబ్బంది కొంతమేర వరకు మా­త్రమే వెళ్లగలరు. అదే ఏనుగులతో అయితే సుదూర ప్రాంతాల్లో గస్తీ నిర్వహించవచ్చు. పులులు సంచరించే ప్రదేశాల్లో సైతం భయం లేకుండా పెట్రోలింగ్‌ నిర్వహించవచ్చు. మనం చేసిన విజ్ఞప్తికి కర్ణాటక అటవీ శాఖ సానుకూలంగా స్పందించింది. త్వరలో ఏనుగుల్ని నల్లమలకు రప్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.  – విశ్వేశ్వరరావు, ఫారెస్ట్‌ రేంజి అధికారి, పెద్దదోర్నాల 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement