గుంటూరు కలెక్టరేట్‌లో నిరసన వ్యక్తం చేస్తున్నడోకిపర్రు రైతులు
ఓఆర్‌ఆర్ భూసేకరణ కోసం రైతులకు ప్రభుత్వం షాకులు
ముందస్తు సమాచారం ఇవ్వకుండా సర్కారు దొంగాట
సచివాలయాల్లో అతికించిన నోటీసులు చూసి రైతుల అవాక్కు
రూ.రెండు కోట్లకు పైగా ఉన్న ఎకరా భూమికి చాలా తక్కువ పరిహారంపై ఫైర్
గుంటూరు కలెక్టరేట్‌లో నిరసన.. కలెక్టర్‌కు వినతిపత్రం
తాడికొండ ఎమ్మెల్యే తీరుపైనా ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు వెస్ట్: అమరావతి చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిచ తలపెట్టిన ఓఆర్‌ఆర్ కోసం చంద్రబాబు సర్కారు రైతులకు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తోంది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామ రైతులకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి భూములు లాక్కునేందుకు ప్రయతి్నస్తోంది. కనీసం గ్రామసభలు కూడా నిర్వహించకుండా కేవలం సచివాలయాల్లో ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అతికించి వదిలేయడంతో రైతులు ఇది చూసి అవాక్కవుతున్నారు.
పాస్‌బుక్స్ తీసుకునేందుకు సచివాలయానికి వెళ్తే ఈ విషయం వెలుగుచూసింది. పేరేచర్ల–మేడికొండూరు మధ్యలో ఉన్న తమ గ్రామంలో 365 ఎకరాల భూమిని ఔటర్ రింగ్‌రోడ్డు కోసం సేకరిస్తున్నట్లు తెలుసుకున్న రైతులు శనివారం ఆగమేఘాల మీద గుంటూరు కలెక్టరేట్‌కు చేరుకుని నిరసన వ్యక్తంచేశారు. కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. ఏదో ఒరగబెడతారని అందరూ చంద్రబాబును గద్దెనెక్కిస్తే చివరికి మా నోటి దగ్గర కూడును లాక్కోవడం దారుణమని వారు ముక్తకంఠంతో మండిపడ్డారు. ఇటీవల గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం, నారాకోడూరు భూముల విషయంలోనూ రైతుల నుంచి ఇలాగే తీవ్ర వ్యతిరేకత వచి్చంది.
ఇంత తక్కువ నష్టపరిహారమా!?..
మరోవైపు.. భూమి కోల్పోతున్న రైతులకు కేవలం ఎకరం రూ.20–30 లక్షలతో నష్టపరిహారం సరిపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ, ఇక్కడ కమర్షియల్ భూమి విలువ రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల మధ్య పలుకుతోంది. ప్రభుత్వం ఇలా అతితక్కువ పరిహారం ఇస్తే ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించేదిలేదని రైతులు కుండబద్దలు కొడుతున్నారు. అవసరమైతే ఆందోళనలతో పాటు న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.
సుమారు 350 మంది రైతుల జీవితాలు రోడ్డునపడుతుంటే తనకేమి తెలీదని తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అంటున్నారని రైతులు దుమ్మెత్తిపోశారు. మొదటి విడత గెజిట్‌లో 70 మీటర్ల రోడ్డుగా నమోదుచేశారని.. దానిని 140 మీటర్లకు పెంచి ఇప్పుడు 250 మీటర్లుగా తేల్చడంపై వారు మండిపడుతున్నారు. ఇంత వెడల్పైన రోడ్డు రాష్ట్రంలో ఎక్కడాలేదని.. దీనిపై ఎమ్మెల్యే స్పందించకపోవడం ఏమిటని వారు రగిలిపోతున్నారు.


