రగిలిన రైతన్న | Farmers Fires on Chandrababu govt at Vijayawada Dharna Chowk | Sakshi
Sakshi News home page

రగిలిన రైతన్న

Jul 1 2026 5:06 AM | Updated on Jul 1 2026 5:06 AM

Farmers Fires on Chandrababu govt at Vijayawada Dharna Chowk

విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద ర్యాలీగా వెళ్తున్న రైతులను అడ్డుకుంటున్న పోలీసులు

చంద్రబాబు సర్కారు దగాపై దద్దరిల్లిన విజయవాడ ధర్నాచౌక్‌

రెండేళ్ల రాక్షస పాలనపై రైతులు, కౌలు రైతులు, రైతు కూలీల తిరుగుబాటు 

రాష్ట్రం నలుమూల నుంచి పోటెత్తిన రైతన్నలు

సీఎం డౌన్‌ డౌన్‌.. అంటూ నినాదాలు 

ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదంటూ ఆవేదన 

పెట్టుబడి సాయం ఎగ్గొట్టారంటూ కౌలు రైతుల కన్నీళ్లు 

ఉచిత పంటల బీమాను ఎగరగొట్టి.. సున్నా వడ్డీ రాయితీ డబ్బులివ్వకుండా  చంద్రబాబు సర్కారు దారుణంగా వంచిస్తోందంటూ మండిపాటు 

ధర్నా చౌక్‌ నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి భారీ ర్యాలీ 

ఎక్కడికక్కడ బారికేడ్లతో అడ్డగించి బూటుకాళ్లతో తొక్కేసిన పోలీసులు 

బారికేడ్లను తోసుకుంటూ చల్లపల్లి బంగ్లా వైపు అన్నదాతల భారీ ర్యాలీ 

ఖాకీల పిడిగుద్దులు.. బూటుకాళ్లతో దాడి చేయడంతో పలువురు రైతులకు గాయాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెండేళ్లుగా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కకపోవడం.. సీజన్‌లో యూరియా, విత్తనాలు అందించకుండా యాప్‌ పేరుతో  ఇక్కట్లకు గురి చేయడం.. కౌలు రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం.. ఉచిత పంటల బీమాను ఎగరగొట్టడం.. సున్నా వడ్డీ రాయితీ పథకం డబ్బులివ్వకుండా రెండేళ్లుగా తొక్కిపెట్టటాన్ని నిరసిస్తూ రైతన్నలు చంద్రబాబు సర్కారుపై కదం తొక్కారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని, రైతుల పొట్టగొట్టిన ఈ రాక్షస పాలనను తుదముట్టించేంతవరకు విశ్రమించబో­మని గర్జించారు. ‘సీఎం డౌన్‌ డౌన్‌’... ‘రైతు వ్యతి­రే­క పాలన నశించాలి’.. ‘కష్టం రైతులది.. లాభం ద­ళా­­రులదా..!’ అంటూ పిడికిళ్లు బిగించారు. బాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతుల సంఘం ఆ­ధ్వ­ర్యంలో మంగళవారం చేపట్టిన ‘చలో విజ­యవాడ’ విజయవంతమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన రైతులు, కౌలు రైతు­లు, రైతు కూలీలతో విజయవాడ ధర్నాచౌక్‌ ప్రాంతం దద్దరిల్లింది. ధర్నాచౌక్‌ నుంచి సీఎం క్యాంపు కా­ర్యాలయం వైపు దూసుకెళ్లారు. మండుటెండను సైతం లెక్క­చేయకుండా అలంకార్‌ సెంటర్‌ మీదుగా ఏలూరు రోడ్డు వైపు కదం తొక్కారు. 

బూటుకాళ్లతో తొక్కుతూ.. పిడిగుద్దులు
ఎక్కడికక్కడ బారికేడ్లతో పోలీసులు అడ్డుకునేందు­కు యత్నించినా రైతన్నలు ఉద్యమ కెరటాల్లా ఎగసి­పడ్డారు. అలంకార్‌ సెంటర్‌ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి మూడు అంచెల బారి­కేడ్లతో దిగ్బంధించారు. పిడిగుద్దులు, బూటు­కాళ్లతో తొక్కుతూ వారిని నిరోధించేందుకు య­త్నిం­చారు. పలువురు రైతులను పోలీసులు ఈడ్చే­శారు. ధర్నా­చౌక్‌ నుంచి లెనిన్‌ సెంటర్‌ వైపు ర్యాలీగా తరలి వెళ్లిన అన్నదాతలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 

పోలీసుల దాష్టీకం
బారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగేందుకు యత్నించిన రైతులపై పోలీసులు బల ప్రయోగానికి దిగారు. దాదాపు గంటకుపైగా పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసుల దాష్టీకానికి పలువురు రైతులకు కాలి వేళ్లు చితికిపోయి రక్తపు గాయాలయ్యాయి. రక్తమోడుతున్నా లెక్క చేయకుండా కొదమ సింహాల మాదిరిగా బారికేడ్లను తోసుకుంటూ ఏలూరు రోడ్డులోని చల్లపల్లి బంగ్లా వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. దారిపొడవునా రైతు­లను అడ్డగిస్తూ బలవంతంగా ఈడ్చి పారేయగా, మరి కొంత మంది రైతులను పోలీసులు బూటుకాళ్లతో అడ్డగించే యత్నం చేశారు. అలంకార్‌ సెంటర్‌లో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య బ్యారికేడ్ల పైకి ఎక్కి ఆందోళనకు దిగారు. రైతుల న్యాయమైన డిమాండ్లను వినకుండా ప్రభుత్వం పోలీసు బలగా­లను ప్రయోగించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. సీఎం అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తామని పోలీసు ఉన్నతా­ధికారులు బుజ్జగించడంతో రైతులు కొద్దిగా శాంతించారు. అంతకుముందు ధర్నాచౌక్‌ వద్ద 2 గంటల పాటు ధర్నా చేశారు. రైతులు ప్లకా­ర్డులు, డిమాండ్లతో కూడిన బ్యానర్లు చేతబట్టి తలపై ఆకుపచ్చ కండువాలు కట్టుకుని ముందుకు సాగారు. 

ధర్నా చౌక్‌ వద్ద బారికేడ్లు పెట్టి రైతులను అడ్డుకుంటున్న పోలీసులు 

ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు..
చంద్రబాబు పాలనలో ఏ ఒక్క రైతు కూడా సంతో­షంగా లేడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.­రామకృష్ణ ధ్వజమెత్తారు. ఒక్కరైనా సంతృప్తికరంగా ఉన్నారని నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమని సవాల్‌ చేశారు. వ్యవసాయ రంగాన్ని అన్ని విధా­లుగా సంక్షోభంలో కూరుకుపోయేలా చంద్రబాబు చేశారని ఆరో­పించారు. ధర్నా­చౌక్‌లో జరిగిన సభలో ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య తదితరులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహ­రించుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామ­చంద్రయ్య, ఏపీ, కౌలు రైతుల సంఘ కార్య ని­ర్వాహ­క అధ్యక్షుడు ఏ.కాటమయ్య, ఉపాధ్యక్షుడు ఏ.రామానాయుడు, తదితరులు పాల్గొన్నారు.

రైతుల పరిస్థితి దారుణం
400 ఎకరాల్లో మొక్కజొన్న వేశాం. కొనేవారు లేరు.. ఐదుసార్లు కలెక్టర్‌ చుట్టూ తిరిగాం. పట్టించుకోలేదు. ఎమ్మెల్యేల వెంటపడ్డాం. పట్టించుకోలేదు. చేసేది లేక క్వింటాల్‌ రూ.1,600కు తెగనమ్ముకున్నాం. రెండేళ్లుగా ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. 
    – డి.మల్లిఖార్జునరెడ్డి, వీరపునాయనపల్లి, వైఎస్సార్‌ కడప జిల్లా

ఏ పంటకూ మద్దతు ధరలేదు
ఐదెకరాల్లో వరి, మొక్కజొన్న, జొన్న, మినుము సాగు చేశా. ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కలేదు. మొక్క­జొన్న క్వింటాల్‌ రూ.1,600కు అమ్ముకుంటే.. ధాన్యం 75 కేజీల బస్తా రూ.1,350కు అమ్ముకున్నాం. జొన్న క్వింటాల్‌కు రూ.1,800 మాత్రమే దక్కితే మినుము పూర్తిగా దెబ్బతింది. ఐదెకరాలకు రూ.3 లక్షల మేర నష్టపోయా.     
– కూరపాటి శింగయ్య, చిర్రావూరు, గుంటూరు జిల్లా 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement