సాయికృష్ణను చిత్రహింసలు పెట్టి చంపేశారంటున్న కుటుంబ సభ్యులు
కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌సిబ్బందే మాకు ఆ విషయం చెప్పారు
రాజీ చేసుకోవాలనిడబ్బులు కూడా ఆశ చూపారు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో సంచలనంగా మారిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఏపీలో పోలీసుల పనితీరు, దారుణంగా క్షీణించిన శాంతి భద్రతల దుస్థితిని బట్టబయలు చేస్తోంది. సాయికృష్ణను చిత్ర హింసలకు గురిచేసి కటకటాల వెనకే కనుమరుగు చేశారా? అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. పోలీసులు చంపేశారయ్యా..! శవాన్ని అయినా ఇప్పించండయ్యా..! అంటూ సాయికృష్ణ తల్లి, మేనమామ ప్రాథేయపడటం దీనికి బలం చేకూరుస్తోంది. పోలీసులు తన కుమారుడిని తీసుకొచ్చారని సాయికృష్ణ తల్లి కన్నీరు మున్నీరు అవుతున్నా.. తమ ముందు వెంటనే హాజరు పరచాలని న్యాయస్థానం ఆదేశించినా.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ కేసును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. కేసు వాపసు తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అక్రమ కేసుల్లో ఇరికిస్తామని హెచ్చరిస్తున్నట్లు సాయికృష్ణ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణ ఎక్కడ ఉన్నారనేది మిస్టరీగా మారింది. అయితే సాయికృష్ణ లాకప్ డెత్‌కు గురైనట్లు అత్యధికులు భావిస్తున్నారు. చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్ పాలనలో పోలీసుల అరాచకానికి సాయికృష్ణ ఉదంతం తాజా తార్కాణంగా నిలుస్తోందని పేర్కొంటున్నారు.
2025 డిసెంబరు 3 తరువాత కేసులు ఏవీ లేకున్నా పోలీసులు ఎలా అదుపులోకి తీసుకున్నారు? దీని వెనుక కుట్రదాగి ఉందనే అనుమానం వ్యక్తం అవుతోంది. సాయికృష్ణను పోలీసులు ఏ విధంగా తీసుకెళ్లారు? ఎంతగా చిత్రహింసలు పెట్టారు? అనేది అతడి మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు ‘సాక్షి’ చానల్‌లో బహిర్గతం చేశారు. ఆయన ఏమన్నారంటే..
కూటమి ఎక్కడికి పోయింది?
సాయికృష్ణ వంద శాతం లేడు. హ్యూమన్ రైట్స్ లాయర్లు, బార్ కౌన్సిల్ ద్వారా తొమ్మిది మందిని వెంట పెట్టుకుని మార్కాపురం వెళితే.. అయ్యా అరెస్టు చేసిన మాట వాస్తవమే. ఫలానా వ్యక్తి ఇలా ఉన్నాడు. ఫలానా పేర్లు ఇవీ..! ఇలా మాట్లాడుకున్నారు. చేతులు వెనక్కి కట్టి జంతువుల కన్నా హీనంగా తీసుకువచ్చారన్నారు. నా మేనల్లుడు నాకు కావాలి. ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. 45 రోజులుగా ఈ పార్టీలన్నీ ఏమై పోయాయి? కూటమి ఎక్కడికిపోయింది?మాకు మా బిడ్డ కావాలి. ఆ నాగరాజు మీద కేసు కూడా వద్దండీ. మాకు ఆఫర్ చేసిన రూపాయి కూడా వద్దు. ఈ రూపాయి ఎవరెవరు ఆఫర్ చేశారో, వాళ్లకు తెలుసు!
తగలబెట్టే అధికారం ఎవరిచ్చారు..?
పిల్లవాడ్ని చంపే అధికారం ఎవరిచ్చారండి? తగలబెట్టే అధికారం ఎవరిచ్చారండి? మీరు అరెస్టు చేశారు.. కోర్టుకు ప్రొడ్యూస్ చేయండి.. బెయిల్ పెట్టుకుని బయటకు తెచ్చుకుంటాం. అనేక సంవత్సరాలుగా అరెస్టు వారెంట్లు రీకాల్ చేసుకునే వారున్నారు. వాడేమైనా కసబ్.. బర్మా నుంచి వచ్చిన కాందిశీకుడా? ఐఎస్‌ఐ తీవ్రవాదా?
మావాడి బాడీ ఇవ్వాలి.. లేదంటే బూడిద ఇవ్వండి
మాకు సపోర్ట్ చేస్తున్న లాయర్లను కూడా భయపెడుతున్నారు. మేం చావుకైనా సిద్ధమే! మా మేనల్లుడి చావు బతుకులు గురించి తెలియాలి. మావాడి బాడీ ఇవ్వాలి. లేదంటే బూడిద ఇవ్వండి.. లేదా డేట్ చెప్పండి.. కర్మకాండలు చేసుకుంటాం. మాకు కేసులు, కులాలు, పార్టీలు కాదు కావాల్సింది. అన్నీ వదిలేసి ప్రశాంతంగా బతుకుతున్నా. మమ్మల్ని కెలికారు. ఈ విషయంలో ఎక్కడికైనా వెళతా. సుప్రీం కోర్టు, హ్యూమన్ రైట్స్‌కు వెళతా. సీబీఐ వద్దకు వెళతా. వదిలే సమస్యే లేదు.
ఆ ఏడుగుర్ని సస్పెండ్ చేయకపోతే..
ఈయన కొట్టుడు మొదలుపెడితే ఆగడండి..! గోళ్లు పీకే అవసరం ఎవరికి ఉందండి? గోళ్లు పీకాల్సిన పని ఏంటండి? ఎంత మంది పిల్లల గోళ్లు పీకేశాడండి..! అదే డాక్టరు వచ్చి పట్టకారు పెట్టి గోళ్లు పీకేయటం.. మళ్లీ కట్టుకట్టడం..! ఈయన సెటిల్‌మెంట్లు, యవ్వారాలు విజయవాడలో నాయకులకు తెలియదా? మా ఆవేదన ఆలోచించండి. మాకు పోలీస్ డిపార్ట్‌మెంట్ మీద కక్ష లేదు. తప్పు చేసిన ఆ ఏడుగురు మినహాయించి పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటే మాకు గౌరవం. ఆ ఏడుగుర్ని సస్పెండ్ చేయకపోతే డిపార్ట్‌మెంట్ మీద పోరాటం చేస్తాం. కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి నేను ఎలాంటి వెనుకడుగు వేయను.

అమ్మా.. లేడమ్మా..!
‘అమ్మా.. లేడమ్మా! ఆయనకు మేం చెప్పలేం.. ఆయన మామూలుగా కొట్టలేదు. అమ్మా.. మామీద పెట్టమాకమ్మా.. మీ పిల్లోడు లేడమ్మా.. చచ్చిపోయాడు... అమ్మా ఏమనుకోవద్దమ్మా.. నన్ను మాత్రం ఇరికించవద్దమ్మా..’ అని ఆ స్టాఫే మాకు మొత్తం చెప్పారు. గోళ్లు తీసిన దగ్గర నుంచి.. కొట్టి పారేసిన దగ్గర నుంచి.. చంపి బాత్‌రూమ్‌లో పడేసిన దగ్గర నుంచి.. మొత్తం సమాచారం ఉంది. బాడీ తీసుకువెళ్లిన విధానం అంతా ఉంది.
సాయికృష్ణ మిస్సింగ్‌పై విచారణాధికారిగా ఏసీపీ దుర్గారావు..
సాయికృష్ణ మిస్సింగ్‌పై విచారణ నిమిత్తం ప్రత్యేక అధికారిగా పశ్చిమ ఏసీపీ ఎన్.వి దుర్గారావును నియమిస్తూ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు ఉత్తర్వులు జారీ చేశారు. మిస్సింగ్‌పై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
గోళ్లు పీకింది.. చంపింది వాస్తవం..!
మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవు. ఇప్పుడు కూడా సీఐ నాగరాజు అంటే మాకు గౌరవమే. మాకు మా పిల్లాడి బాడీ కావాలి. అతడిని చంపింది వాస్తవం. కొట్టింది వాస్తవం. ఆస్పత్రికి తీసుకెళ్లి ఆర్‌ఎంపీతో గోళ్లు పీకించింది వాస్తవం. ఇంకా నేను చెప్పకూడదు. ఈ కేసుకు సంబంధించిన రహస్యాలు ఉన్నాయి. మీడియాలో పెట్టలేను. పార్టీలకు అతీతంగా వాస్తవాన్ని మాట్లాడా. ఇదే కూటమికి సపోర్ట్ చేశా. ఇదే కూటమి ఇప్పుడు ఏం చేస్తుందా? అని ఎదురు చూస్తున్నా.
నీ కొడుకుకు దండ వేసుకో.. ఫొటో రెడీ చేసుకో.. చంపేస్తున్నా..!
మా బాబును తీసుకెళ్లే ముందు తల్లి వద్దనున్న ఫోన్ తీసుకున్నారు. ఫోన్ ట్యాప్ చేసి మార్కాపురంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారు. మా చెల్లికి అనుమానం వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్లు వెళ్లటం లేదు. మీ అబ్బాయిని అరెస్టు చేశారని, కృష్ణలంక స్టేషన్‌లో లాకప్‌లో ఉన్నాడని మా ప్రాంతానికి చెందిన వ్యక్తులు చెబితే అక్కడకు వెళ్లాం. కానీ కృష్ణను చూపించలేదు. ఫోన్ ఇవ్వలేదు. 24 సంవత్సరాల కుర్రాడు.
వాయిదాకు రాలేదని ఇంత చేయటం అవసరమా? మీరు కొడుతున్నారని భయపడి ఎక్కడికో పారిపోయి బతుకుతుంటే వాడి వల్ల సమస్య ఏమైనా ఉందా? వారెంట్ పెండింగ్ ఒక్కటే కదా.. కొత్త కేసులు ఏమైనా ఉన్నాయా? బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చాడు కదా.. ఎందుకయ్యా వాడిని ఇలా చేస్తున్నారని అడిగితే సీఐ దుర్భాషలాడారు. నీ కొడుకుకు దండ వేసుకో.. ఫొటో రెడీ చేసుకో.. నీ కొడుకుని చంపేస్తున్నా..! అని అన్నారు.


