Fact Check: చిరుద్యోగులపై దొంగ ఏడుపులు

Expenditure on salaries of small workers has tripled - Sakshi

గత సర్కారుతో పోలిస్తే మూడు రెట్లు పెరిగిన చిరుద్యోగుల జీతాల వ్యయం.. ఠంచన్‌గా చెల్లింపులు.. ఏజెన్సీలు, దళారులే లేరు

పారదర్శకంగా ప్రత్యేక వ్యవస్థను తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

పథకాలకు ఆదాయ పరిమితిని రెట్టింపు చేసిందీ ఈ ప్రభుత్వమే

దగా చేసిందీ.. కమీషన్లు కాజేసింది టీడీపీ హయాంలోనే

చిరుద్యోగులకు గత సర్కారు హయాంలో జీతాల వ్యయం రూ.1,100 కోట్లు! మరిప్పుడు వారి జీతాల కోసం చెల్లిస్తున్న మొత్తం ఏకంగా రూ.3,300 కోట్లు!! ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చిరుద్యోగుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ అంగన్‌వాడీల నుంచి 108 డ్రైవర్ల దాకా పలు వర్గాల జీతాలను పెద్ద ఎత్తున పెంచింది.

జీతాల ఖర్చు మూడు రెట్లు పెరగడం కళ్లెదుటే కనిపిస్తున్నా చిరు­ద్యోగులకు దగా చేస్తున్నా­రంటూ కడుపు నొప్పితో కళ్లనీళ్లు పెట్టుకునే వారిని ఏమనాలి? మరిలాంటి దుష్ప్రచారం ఈనాడులో చేస్తున్నారు కాబట్టి రామోజీనే అను­కోవా­లేమో!! జీతాలు పెంచాలని చిరుద్యోగులు గత ప్రభుత్వ హయాంలో గగ్గోలు పెట్టిన విషయం ఆయనకు గుర్తున్నా తెలియనట్లే నటిస్తున్నారు!!– సాక్షి, అమరావతి

పారదర్శకంగా నియామకాలు, చెల్లింపులు
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామ­కాలు, జీతాల చెల్లింపుల్లో పూర్తి పార­దర్శకతను తీసుకొస్తూ దళారీ వ్యవస్థ నిర్మూలనకు ఆప్కాస్‌ కార్పొ­రేషన్‌ను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రారంభించింది.  లంచాల ప్రసక్తే లేకుండా శాశ్వత ఉద్యో­గుల కంటే ముందే ఠంచనుగా ప్రతి నెలా ఒకటో తేదీనే వారికి జీతాలిచ్చే పద్ధతిని తెచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగు­లందరికీ మినిమం టైం స్కేల్‌ను వర్తింప చేసింది.

దీనికి అనుగుణంగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యో­గుల జీతాలను కూడా పెంచారు. వీరికి గరిష్టంగా రూ.28 వేల వరకూ చెల్లిస్తున్నారు. మరి టీడీపీ సర్కారు ఇలాంటి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి చిరుద్యోగులను ఎందుకు ఆదుకో­లేదు? వారి పోస్టు­లకు తగ్గట్టుగా పూర్తి జీతాలను ఎందుకు ఇవ్వ­లేదు? ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పొట్టగొట్టి ఏజెన్సీ కమీషన్ల పేరుతో జీతాలను గుంజుకుంటే ఈనాడుకు కనపడలేదా?

మనసున్న ప్రభుత్వం ఎవరిది?
నాలుగున్నరేళ్ల పాటు చిరుద్యోగుల జీతాలను పెంచాలనే ఆలోచన కూడా చేయని చంద్రబాబు సర్కారు గత ఎన్ని­క­లకు ఆర్నెల్ల ముందు అరకొరగా పెంచిన జీతాలను కొంద­రికి మాత్రమే అమలు చేసింది. మరి కొందరికి పెంపు కాగి­తాల­పైనే పరి­మితమైంది. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలను మరింత పెంచి మొదటి రోజు నుంచే అమలు చేసింది.

అంగన్‌­వాడీలు, ఆశావర్కర్లు, వీఏవోలు, మెప్మా రిసోర్స్‌ పర్సన్లు, శానిటేషన్‌ వర్కర్లు, గిరి­జన కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు, హోంగార్డులు, మధ్యాహ్న భోజన పథకం ఆయాలు లాంటి చిరుద్యోగుల విష­య­ంలో సీఎం జగన్‌ మనసు పెట్టి జీతాలు పెంచారు. గత సర్కారు హయాంలో రూ.1,100 కోట్లు మాత్రమే ఉన్న వారి జీతాల వ్యయం ఇప్పుడు ఏకంగా రూ.3,300 కోట్లకు పెరగడమే అందుకు తిరుగులేని నిదర్శనం.

ఉదారంగా అర్హతల సడలింపు
ప్రభుత్వ పథకాల అమలులో అర్హతలను సడలిస్తూ వైఎస్సా­ర్‌­సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వక్రీక­రిస్తూ ఈనాడు దుష్ప్రచారం చేస్తోంది. పథకా­లను మరింత మందికి అందజేయాలనే ఉద్దేశంతో ఆదాయం, భూమి, కరెంటు విని­యోగం తదితర అంశాలలో ఉదారంగా వ్యవ­హరిస్తూ లబ్ధిదారులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాల­పై ప్రజ­లను తప్పుదోవ పట్టిస్తోంది. గత ప్రభుత్వంలో పథ­కా­లను పొందేందుకు గ్రామాల్లో నెలకు కనీస ఆదా­య పరి­మితి  రూ.5 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6 వేలుగా ఉండేది.

ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్ట­ణ ప్రాంతాల్లో రూ.12 వేలను నెలవారీ ఆదాయ పరి­మితిగా నిర్ణ­యించి ప్రభుత్వం మరింత మంది లబ్ధిదారులకు ప్రయోజ­నం చేకూ­ర్చింది. కరెంట్‌ వినియోగంపై గతంలో 200 యూనిట్ల పరి­మితి విధించగా ఇప్పుడు 300 యూని­ట్లకు పెంచారు. వివా­హాల అనంతరం వేరుగా ఉంటున్న వారిని విడి కుటుంబాలు­గా పరిగణిస్తున్నారు. ఆ మేరకు వారికి విడిగా రేషన్‌ కార్డు­లను జారీ చేస్తూ వివిధ పథకాలకు అర్హత కల్పిస్తు­న్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో వేల సంఖ్యలో అందిన ఇలాంటి దరఖాస్తులను ప్రభు­త్వం వెంటనే పరిష్క­రించింది.

చిరుద్యోగులకు సీఎం జగన్‌వేతనాలను పెంచారిలా..
అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు వరకూ రూ.7వేలు ఉంటే ఇప్పుడు రూ.11,500కు పెంచారు. హెల్పర్ల జీతాలు రూ.4 వేల నుంచి రూ.7 వేలకు పెరిగాయి.
 గ్రామ సంఘాల సహాయకులు, యానిమేటర్స్‌ జీతా­ల­ను రూ.2 వేల నుంచి ఏకంగా రూ.10 వేలకు పెంచారు. 
 మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు తీసుకుని వెళ్లారు.
 ఆశావర్కర్ల జీతాలను రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. 
♦ గిరిజన సంక్షేమశాఖ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల జీతాలను రూ.400 నుంచి ఏకంగా రూ.4 వేలకు పెంచి అండగా నిలిచారు. 
 పోలీస్‌ శాఖలో పనిచేసే హోంగార్డుల జీతాలను రూ.18 వేల నుంచి రూ.21,300కు పెంచారు. 
♦ పాఠశాల విద్యాశాఖలో కుక్‌ కం హెల్పర్లకు చెల్లించే రూ.వెయ్యి గౌరవ వేతనాన్ని రూ.3 వేలకు పెంచారు.
 108 డ్రైవర్ల జీతాలను రూ.13 వేల నుంచి రూ.28 వేలకు పెంచారు. ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్ల జీతాలను రూ.17,500 నుంచి రూ.20 వేలకు తీసుకుని వెళ్లారు. 
♦ 104 డ్రైవర్ల జీతాలను రూ.26 వేలకు పెంచారు. 
ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.8 వేల నుంచి రూ.16 వేలకు పెంచారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top