‘అమ్మఒడి’ దొంగలు! | Entire Telugu community shocked by CM Chandrababu Comments | Sakshi
Sakshi News home page

‘నాడు – నేడు’ బడిలో.. తనయుడి ‘వందనం’! ‘అమ్మఒడి’ దొంగలు!

Jul 11 2025 5:11 AM | Updated on Jul 11 2025 10:11 AM

Entire Telugu community shocked by CM Chandrababu Comments

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అభివృద్ధి చేసిన శ్రీసత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ స్కూల్‌లో విద్యార్థులతో ఫొటోలకు పోజులిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌

లోకేశ్‌ ఆలోచనల నుంచి పుట్టిందే ‘తల్లికి వందనం’ పథకమన్న సీఎం చంద్రబాబు   

పిల్లలు, ఉపాధ్యాయుల ఎదుట నిస్సిగ్గుగా అబద్ధాలు

సీఎం వ్యాఖ్యలతో నిర్ఘాంతపోయిన యావత్‌ తెలుగు సమాజం 

తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తూ.. అమ్మ ఒడి మార్గదర్శకాల ప్రకారమే అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు  

అదే విషయాన్ని గుర్తు చేస్తున్న తల్లిదండ్రులు, నెటిజన్లు.. నాడు–నేడు కింద కొత్తచెరువు 

జెడ్పీ పాఠశాలను తీర్చిదిద్ది రూపురేఖలు మార్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 

అక్కడ కురీ్చలు, టేబుళ్లు, డిజిటల్‌ బోర్డులు, ఇతర సదుపాయాలు సమకూర్చింది 

గత ప్రభుత్వమే.. ఇప్పుడు అదే స్కూలుకు వెళ్లి సీఎం చంద్రబాబు అబద్ధాలు 

పేదరికం చదువులకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో 2019లో  ‘అమ్మ ఒడి’ పథకానికి శ్రీకారం చుట్టిన నాటి సీఎం వైఎస్‌ జగన్‌ 

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఏనాడైనా కనీసం ఇలాంటి ఆలోచననైనా చేశారా? అని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులు, విద్యావేత్తలు

మొన్నటి నిజం..
‘‘అమ్మ ఒడి పథకం మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేశాం.’’ 
– ‘తల్లికి వందనం’ పథకాన్ని జూన్‌ 12న ప్రారంభిస్తూ చంద్రబాబు చెప్పిన మాట
నేటి అబద్ధం..
‘తల్లికి వందనం’ పథకం లోకేశ్‌ ఆలోచనే..!! 
– కొత్తచెరువు జెడ్పీ స్కూల్లో చంద్రబాబు

సాక్షి, అమరావతి: పిల్లల ఎదుటే పచ్చి అబద్ధాలు..! ఓ రాష్ట్రానికి పెద్దరికం వహించే బాధ్యతలో ఉన్నాననే స్పృ­హలో లేకుండా నిస్సిగ్గుగా బుకాయింపు.. బడాయిలు!! రాష్ట్రంలో ఇప్పటిదాకా అసలు ‘‘అమ్మ ఒడి’’ లేనే లేదు..! ఈ పథకాన్ని తామే ఇచ్చామని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకోవటాన్ని చూసి యావత్‌ ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి నివ్వెరపోతోంది. 

ఇంత దివాళాకోరుతనమా? అబద్ధం అనే పదానికి డిక్షనరీ చూడాల్సిన అవసరం లేదు.. బాబు పేరు చెబితే చాలని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అది కూడా.. ఏకంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నాడు – నేడుతో తీర్చిదిద్దిన పాఠశాలలోనే కూర్చుని.. గత ప్రభుత్వం సమకూర్చిన డిజిటల్‌ తరగతి సాక్షిగా చంద్రబాబు అబద్ధాలాడటంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. 

శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘పీటీఎం’లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ‘అమ్మ ఒడి’ రూపశిల్పి తన తనయుడు నారా లోకేశ్‌నని కళ్లార్పకుండా బుకాయించారు. అయితే లోకేశ్‌ కూర్చున్న టేబుల్‌ మొదలుకుని చంద్రబాబు ఏ పుస్తకంలో చూసి పిల్లలకు పాఠాలు చెప్పారో... ఆ బైలింగ్యువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ను కూడా తీసుకొచ్చింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమేనని గుర్తు చేస్తున్నారు. 

మొన్న విశాఖలో యోగా పేరుతో డ్రామా నడపగా తాజాగా పీటీఎం.. గిన్నిస్‌ రికార్డులు అంటూ నాటకాన్ని రక్తి కట్టించారని వ్యాఖ్యానిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ చంద్రబాబు ఊహకు కూడా తట్టని విప్లవాత్మక సంస్కరణలను వైఎస్‌ జగన్‌ విద్యారంగంలో తెచ్చారని పేర్కొంటున్నారు. 

ప్రభుత్వ స్కూళ్లలో నాడు – నేడు, సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్‌ఈ, ఐబీ, టోఫెల్, పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్‌ తరగతులు, పౌష్టికాహారంతో నాణ్యమైన గోరుముద్ద లాంటివన్నీ గత ప్రభుత్వం కృషి వల్లే ప్రభుత్వ విద్యా రంగంలో సాకారమయ్యాయని పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కారు చేసిందల్లా.. స్కూళ్లను మూసివేయడం.. బొద్దింకల భోజనం.. 

ఇంగ్లీషు మీడియం ఎత్తివేత.. సీబీఎస్‌ఈ, ఐబీ రద్దు.. నాడు – నేడు నిలిపివేతతోపాటు టెన్త్‌ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించకలేకపోవడం.. మూల్యాకనంలో తప్పి­దాలు దొర్లటం.. ప్రభుత్వ స్కూళ్లకు ఏడాదిలో ఏకంగా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు దూరం చేయడం అని విద్యావేత్తలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రపంచంలో అబద్ధానికి బాబే బ్రాండ్‌ అంబాసిడర్‌ అనేందుకు ఇదో మరో తార్కాణమని పేర్కొంటున్నారు. 

నాడు ‘అమ్మ ఒడి’ మార్గదర్శకాల ప్రకారమేనన్న బాబు  
శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘పీటీఎం’ కార్యక్రమానికి తన తనయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో కలసి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు విద్యార్థులతో ముచ్చటిస్తూ.. ‘‘తల్లికి వందనం’’ పథకం మంత్రి నారా లోకేశ్‌ ఆలోచనల నుంచే పుట్టిందని చెప్పడంతో పిల్లలతోపాటు తల్లితండ్రులు, ఉపాధ్యాయులు నిర్ఘాంతపోయారు. 

ఇదే చంద్రబాబు ‘తల్లికి వందనం’ పథకాన్ని జూన్‌ 12న ప్రారంభిస్తూ.. ‘అమ్మ ఒడి’ పథకం మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేశామని చెప్పడాన్ని వారంతా గుర్తు చేసుకున్నారు. తల్లికి వందనం.. అమ్మ ఒడి పథకాలు రెండూ ఒకటేనని వల్లె వేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. పేదరికం వల్ల పిల్లలను బడికి పంపకుండా పనులకు పంపుతున్నారని, ఆ పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక రీతిలో ‘అమ్మ ఒడి’ పథకానికి రూపకల్పన చేయడం అందరికీ తెలిసిందే. 

వైఎస్‌ జగన్‌ ఆ పథకాన్ని నవరత్నాల్లో చేర్చి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశారు. నోరు తెరిస్తే చాలు.. తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవమని బడాయి చెప్పుకునే చంద్రబాబు ఏనాడూ అమ్మ ఒడి లాంటి విప్లవాత్మక పథకాన్ని అమలు చేయాలనే కనీస ఆలోచన కూడా చేయలేదని విద్యార్థుల తల్లితండ్రులు, ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు.  

సదుపాయాలన్నీ జగన్‌ సర్కారు సమకూర్చినవే..
వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా నాడు–నేడు పథకం కింద వైఎస్‌ జగన్‌ అభివృద్ధి చేశారు. కొత్తచెరువు జెడ్పీ పాఠశాలనూ అదే రీతిలో తీర్చిదిద్దారు. స్వయంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ విద్యార్థులతో కలసి కూర్చున్న కుర్చీలు, డబుల్‌ డెస్క్‌ బెంచీలు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సమకూర్చినవే. 

అది బహిర్గతమవుతుందనే భయంతో నాడు–నేడు పథకం పేరుపై స్టిక్కర్లు అతికించి మాయ చేశారు. అసలు ఆ పాఠశాలలో అమర్చిన ఫ్యాన్‌లు, లైట్లు, అధునాతన ఐఎఫ్‌పీలు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినవే కావడం గమనార్హం. 



వైఎస్‌ జగన్‌ హయాంలో కొత్తచెరువు జెడ్పీ స్కూల్‌కు సమకూర్చిన కుర్చీలపై కూర్చొని.. గత ప్రభుత్వం అందచేసిన అధునాతన ఐఎఫ్‌పీ స్క్రీన్‌ ముందు నిలబడి.. తల్లికి వందనం పథకం లోకేశ్‌ ఆలోచనల నుంచి పుట్టిందేనని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పడంతో విద్యార్థులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. 

సీఎం చంద్రబాబు ఇలా అబద్ధాలాడటం ఇదే మొదలు కాదు.. చివర కాదు అంటూ నెట్టింట, సోషల్‌ మీడియాలో చలోక్తులు విసురుతున్న పోస్టులు వైరల్‌ అయ్యాయి. హైదరాబాద్‌ను తానే నిరి్మంచానని.. సెల్‌ఫోన్, కంప్యూటర్‌ కనిపెట్టిందీ తానేనని తరచూ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకోవటాన్ని ప్రస్తావిస్తున్నారు.

విద్యా విప్లవాన్ని ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌
రాష్ట్రంలో విప్లవాత్మక సంస్కరణలతో విద్యా విప్లవాన్ని 2019లో నాటి సీఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చేసే పనులకు నడుం బిగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనను ప్రారంభించారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ నుంచి ఐబీ దాకా సర్కారు స్కూళ్ల ప్రయాణాన్ని ఆరంభించారు. 

మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌ విధానాన్ని అమలు చేసి బోధన, విద్యా ప్రమాణాలను సమున్నత స్థాయికి చేర్చారు. టోఫెల్‌ శిక్షణతో విద్యార్థులను ఆంగ్ల భాషా నైపుణ్యాలతో తీర్చిదిద్దారు. ప్రతి తరగతి గదికి ఐఎఫ్‌పీ స్క్రీన్లు, అధునాతన టీవీలు అందించి.. డిజిటల్‌ బోధనను చేరువ చేశారు. 

బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలు సమకూర్చారు. విద్యార్థులకు మూడు జతల నాణ్యమైన యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, టై, బెల్ట్, నోట్‌ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలతోపాటు బ్యాగ్‌ను స్కూలు ప్రారంభించిన మొదటి రోజే జగనన్న విద్యా కానుకగా అందించి తల్లితండ్రులకు చదువుల భారం లేకుండా చేశారు. 

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ ఐరాస వరకు వినిపించేలా వెన్నుతట్టి పిల్లలను ప్రోత్సహించారు. వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించిన విద్యా సంస్కరణలను చంద్రబాబు సర్కారు కక్షపూరితంగా అడ్డుకుని అంధకారంలోకి నెట్టేసిందని ఉపాధ్యాయవర్గాలే బాహాటంగా విమర్శిస్తుండటం గమనార్హం.  

ఈ విద్యా ప్రగతి మీది కాదు..
కూటమి పాలనలో ఈవెంట్‌ 
ఆర్గనైజర్లుగా ఉపాధ్యాయులు
మెగా పీటీఎంపై సోషల్‌ మీడియాలో విమర్శలు 

కూటమి పాలనలో ఉపాధ్యాయులు ఈవెంట్‌ ఆర్గనైజర్లుగా మారిపోయారని టీచర్లు వాపో­తున్నారు. విద్యార్థులకు చదువు చెప్పడం కంటే ఈవెంట్ల నిర్వహణలోనే గడుపుతున్నట్టు వాట్సాప్‌ గ్రూపుల్లో గురువారం మెసేజ్‌లు చక్కర్లు కొట్టాయి. ఏడాది పాలన­లో విద్యకు సంబంధించి ఒక్క మంచి పని చేయకుండా గొప్పలు చెప్పుకోవడం వీరికే చెల్లించదని, గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ అభివృద్ధి చేసిన పాఠశా­ల­లోనే ఇప్పుడు సీఎం చంద్రబాబు, లోకేశ్‌ కూర్చుని వేడుకలు చేసుకున్నా­రని సెటైర్లు వేశారు. 

‘సీఎం గారూ.. మీరు కూర్చున్న బెంచీలు మీ ప్రభుత్వం ఇచ్చి­నవి కాదు. మీకు ఎదురుగా ఉన్న ఐఎఫ్‌పీ ప్యానల్‌ మీరు ఇచ్చినది కాదు. తరగతి గదిలో ఉన్న ఫ్యాన్లు, లైట్లు మీరు అమర్చినవి కావు. ఆ గ్రీన్‌ చాక్‌ బోర్డ్స్‌ కూడా మీరు ఇచ్చినవి అంతకంటే కాదు. దయచేసి మీ మిగిలిన నాలుగేళ్లలో ఇకనైనా మా పాఠశాల­లకు మంచి చేయండి. రికార్డుల కోసం ఇలాంటి ఆర్భా­టపు పనికి­మా­లిన కార్యక్రమాలతో పిల్లలు, టీచర్ల కాలాన్ని వృధా చేయొద్దు. ఉపాధ్యా­యులను ఈవెంట్‌ ఆర్గనైజర్లుగా మార్చేశారు. 

16 ఏళ్లు సీఎంగా ఉన్న మీరు స్కూళ్లకు చేసిందేమిటో సెలవిస్తారా?’ అంటూ నిలదీ­శారు. మీ ‘పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌’ ఆదేశాలకు జడిసి బోధన, అడ్మిషన్లను పక్కనపెట్టాం. ఫలితంగా ఏ స్వీట్‌ షాప్‌లో, బుక్‌ షాప్‌లో, ఫ్లెక్సీ షాప్‌లో చూసినా అయ్య­వార్లే.. తుదకు మామిడాకుల కోసం, రంగు కాగితాలు, బ్యానర్లు, అట్టముక్కలు చింపడం, అతికించడం, అధి­కా­­రుల బాగోగులు చూడటం వల్ల మా జేబుకు చిల్లు పడింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement