ఉత్సాహంగా టిడ్కో గృహ ప్రవేశాలు

enthusiastic tidco home entrance in andhra pradesh - Sakshi

కాకినాడలో 1,152 ఇళ్లు లబ్ధిదారులకు అందజేత 

పాల్గొన్న మంత్రి సురేష్, ఎంపీ, ఎమ్మెల్యేలు

కాకినాడ : టీడీపీ పాలనలో జరిగిన అసంపూర్ణ నిర్మాణాలు, లోపాలను సరిచేసి ప్రైవేటు లేఅవుట్లలో ఉండే బహుళ అంతస్తుల భవనాల తరహాలో రూపుదిద్దుకున్న టిడ్కో గృహాలను శుక్రవారం జిల్లా కేంద్రం కాకినాడలో లబ్ధిదారులకు అప్పగించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ముఖ్య అతిథిగా హాజరై తొలి విడత 1,152 మందికి ఇళ్ల పత్రాలు, తాళాలు అప్పగించారు. సకల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా నిర్మితమైన ఇళ్లను చూసుకుని లబ్ధిదారులు మురిసిపోయారు.

మంత్రి సురేష్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తీసుకున్న చొరవ వల్ల లబ్ధిదారుల సొంతింటి కల సాకారమైందన్నారు. ఎంపీ వంగా గీత, మాజీ మంత్రి, రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, టిడ్కో చైర్మన్‌ జె.ప్రసన్నకుమార్, ఎండీ శ్రీధర్, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.  ఇదిలా ఉండగా, రూ.6 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమకూర్చిన రెండు ఉచిత బస్సులను మంత్రి సురేష్‌ ప్రారంభించారు.

అవినీతిపరుడిని వెనుకేసుకొస్తున్న పవన్‌ 
టీడీపీ, జనసేన పొత్తుకు ఎలాంటి అజెండా లేదని, అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి కేసులో జైలుకెళ్లిన చంద్రబాబును పవన్‌కళ్యాణ్‌ వెనకేసుకురావడాన్ని మంత్రి తప్పుబట్టారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న చర్యలను గుర్తు చేశారు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలిస్తున్నట్టు చెప్పారు. అమ్మఒడి వంటి ప్రయోజనాలు కల్పించేందుకు సైతం చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top