ఇసుకపై మళ్లీ ‘ఈనాడు’ తప్పుడు రాతలు.. | Sakshi
Sakshi News home page

ఇసుకపై మళ్లీ ‘ఈనాడు’ తప్పుడు రాతలు..

Published Wed, Jan 17 2024 6:41 PM

Eenadu Fake News Over Sand Tendors In AP - Sakshi

సాక్షి, అమ‌రావ‌తి: ఏపీలో అభివృద్ధి, సుపరిపాలనను చూసి తట్టుకోలేకపోతున్న పచ్చ మీడియా ‘ఈనాడు’ మరోసారి తప్పుడు రాతలు రాసుకొచ్చింది. ఇసుకపై చెత్త కథనాలను ప్రచురించింది. అబద్దపు రాతలతో వక్రీకరణ కథనాలను వడ్డించింది. పాదర్శకంగా ఉన్న ఇసుక టెండర్లపై అసత్యపు వార్తలు రాసింది. ఇందులో సంబంధంలేని వ్యక్తుల పేర్లను కూడా రాయడం గమనార్హం. దీంతో, తప్పుడు రాతపై గనుల శాఖ సీరియస్‌ అయ్యింది. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 

అసలు జరిగింది ఇది..
1) రాష్ట్రంలో ఇసుక ఆప‌రేష‌న్స్‌పై ‘ఈనాడు దిన‌ప‌త్రిక’.. ‘ఇసుకలో కొత్త తోడు దొంగలు’ అనే శీర్షికతో ప్రచురించిన క‌థ‌నం పూర్తి అవాస్త‌వాల‌తో రాసిన‌ద‌ని రాష్ట్ర గ‌నుల‌శాఖ సంచాల‌కులు వీజీ వెంక‌ట‌రెడ్డి ఒక ప్ర‌క‌ట‌న‌లో తీవ్రంగా ఖండించారు. సీఎం సోదరుడి ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు.. పర్యావరణ అనుమతులు లేకుండా తవ్వేస్తున్నారంటూ అర్థం లేని రాత‌లు రాయ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

2) ఉచిత ఇసుక విధానం పేరుతో గతంలో జరిగిన దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అత్యంత పారదర్శక విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారని అన్నారు. దాని ప్రకారం టెండర్లు నిర్వహించి ఇసుక ఆపరేషన్స్‌కు ఏజెన్సీలను ఖరారు చేసి, ఆపరేషన్స్ ప్రారంభించిన నేపథ్యంలో ఈనాడు పత్రిక ఓర్వలేనితనంతో అభూతకల్పనలను, అవాస్తవాలను పోగుచేసి పదేపదే ఇసుకపై అవాస్తవాలతో కూడిన కథనాలను ప్రచురిస్తోందని అన్నారు. 

3) రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ కోసం పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందిన మినీరత్న MSTC ద్వారా టెండర్లు నిర్వహించాం. దానిలో  ప్రతిమా ఇన్ఫాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్యాకేజీ -1, ప్యాకేజీ-3లోని 18 జిల్లాలకు, జిసికెసి ప్రాజెక్ట్స్ & వర్కర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్యాకేజీ-2లోని 8 జిల్లాల్లో ఇసుక ఆపరేషన్స్‌కు సక్సెస్ ఫుల్ బిడ్డర్‌లుగా ఎంపికయ్యాయి. 

4) ఈ టెండర్లలో సక్సెస్ ఫుల్ బిడ్డర్లుగా ఎంపికైన ఏజెన్సీలు ఇసుక ఆపరేషన్స్ ప్రారంభించాయి. పర్యావరణ అనుమతులు ఉన్న రీచ్‌ల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన లేదు. అలాగే సంబంధిత శాఖల అనుమతులతోనే రిజర్వాయర్‌లలో డీసిల్డింగ్ జరుగుతోంది.

5) ఇసుక ఆపరేషన్స్ అనేది గనులశాఖకు సంబంధించిన వ్యవహారం. రీచ్‌లకు లీజు అనుమతుల మంజూరు గనులశాఖ ద్వారా జరుగుతుందే తప్ప సీఎంవో నుంచి కాదు. సీఎం సోదరుడి ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అంటూ.. అదేమని ప్రశ్నించిన వారికి తమకు సీఎంవో నుంచి అనుమతులు ఉన్నాయంటూ చెబుతున్నారని ఈనాడు పత్రిక ఏ ఆధారాలతో తన కథనంలో ఆరోపించిందో స్పష్టం చేయాలి. రాష్ట్రంలో టెండర్ల ద్వారా ఇసుక ఆపరేషన్లకు ఎంపికైన సంస్థలు ఒకవైపు పని చేస్తుంటే, మరోవైపు బయటి వ్యక్తులు ఇసుక తవ్వకాలు చేస్తున్నారంటూ ఈనాడు తన కథనంలో ఆరోపించడం పచ్చి అబద్ధం. సీఎం సోదరుడికి, మరో వ్యక్తికి ఇసుక ఆపరేషన్ల తోటి ఎటువంటి సంబంధమూ లేదు. కావాలని ఇసుక ఆపరేషన్లను రాజకీయం చేయాలని దురుద్దేశంతో ఈనాడు పత్రిక తప్పుడు విమర్శలకు పాల్పడుతోంది.  నిరాధార అంశాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని పదేపదే ఇలాంటి కథనాలను ప్రచురిస్తోంది. 
 
6) ఇసుక అక్రమాలపై నిఘా కోసం ఎస్ఈబీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, గనులశాఖ అధికారులు కూడా తమకు ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ జిల్లాకు ఒక విజిలెన్స్ స్వ్కాడ్ కూడా గనులశాఖలో పనిచేస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర సరిహద్దులతో పాటు కీలకమైన ప్రాంతాల్లో చెక్ పోస్టులు నిర్వహిస్తున్నాం. ఈ విభాగాల పనితీరును కూడా ఈనాడు ఆక్షేపించడం దారుణం. అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని, దాడులకు సంబంధించిన సమాచారం ముందే లీక్ చేస్తున్నారంటూ ఈనాడు ఏ ఆధారాలతో అటువంటి తీవ్ర ఆరోపణలు చేస్తోంది?

7) ఇంత పకడ్భందీగా ఇసుకపై పర్యవేక్షణ జరుగుతుంటే, ఈనాడు పత్రికకు కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. కళ్ళముందు కనిపిస్తున్న దానిని చూడకుండా, ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకతతో, నిత్యం ఏదో ఒక రకంగా ప్రభుత్వంపై దుష్ర్పచారం చేయాలనే లక్ష్యంతోనే ఇసుకపై ఈనాడు పదేపదే ఒకే అంశంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వరుస కథనాలను ప్రచురితం చేస్తోంది. ఒకే అబద్దాన్ని ఎక్కువసార్లు చెప్పడం ద్వారా దానిని నిజంగా చిత్రీకరించాలనేది ఈనాడు తాపత్రేయం, కుట్రపూరిత విధానం అర్థమవుతోంది. ఇటువంటి తప్పుడు వార్తాకథనాలపై ఈనాడుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.

Advertisement
Advertisement