14వ విడత సాయం.. పీఎం కిసాన్‌కు ఈ–కేవైసీ తప్పనిసరి

E KYC is mandatory for PM Kisan - Sakshi

ఈ నెలాఖరులోగా పెండింగ్‌లో ఉన్న 6.47 లక్షల రికార్డులకు ఈ–కేవైసీ పూర్తిచేయండి

14వ విడత పీఎం కిసాన్‌కు ఈ–కేవైసీ తప్పనిసరి చేసిన కేంద్రం 

ఈ–కేవైసీ పూర్తిచేయడానికి మూడు పద్ధతులు

వృద్ధుల కోసం మొబైల్‌ యాప్‌

సాక్షి, అమరావతి: ప్రతి విడతకు ఈ–కేవైసీ ఉంటేనే పీఎం కిసాన్‌ పథకం కింద రైతులకు నిధులు జమచేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 14వ విడత పీఎం కిసాన్‌ పథకానికి రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ ప్రామాణీకరణ తప్పనిసరని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ ప్రామాణీకరణను పూర్తిచేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె.ఎస్‌.జవహర్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.

వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు పురోగతిపై ఆయన గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ–కేవైసీ ప్రామాణీకరణ ఉద్దేశం వారి వాస్తవికతను ధ్రువీకరించుకోవడమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో అర్హులైన లబి్ధదారుల ఈ–కేవైసీ ప్రామాణీకరణను ఈ నెలాఖరులోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ–కేవైసీ పూర్తిచేయడానికి మూడు పద్ధతులకు కేంద్రం అనుమతించినట్లు తెలిపారు. ఆధార్‌ లింక్‌ అయిన మొబైల్‌ ఓటీపీ లేదా బయోమెట్రిక్‌ ద్వారా ఈ–కేవైసీ పూర్తిచేయాలని సూచించారు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఫేస్‌ అథెంటికేషన్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ–కేవైసీ పూర్తిచేయాలని చెప్పారు.

ఇప్పటికే ఫేస్‌ అథెంటికేషన్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా 45,636 మంది ఈ–కేవైసీ పూర్తిచేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 39,48,002 రికార్డులకు ఈ–కేవైసీ పూర్తిచేశారని, ఇంకా 6,47,068 రికార్డులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వాటన్నింటిని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top