కోర్టును బురిడీ కొట్టించేందుకే బాబు కుట్ర | Drama of SIT searches at Vicat company | Sakshi
Sakshi News home page

కోర్టును బురిడీ కొట్టించేందుకే బాబు కుట్ర

Jul 27 2025 5:31 AM | Updated on Jul 27 2025 5:31 AM

Drama of SIT searches at Vicat company

హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్ప నివాసంలో సోదాలు చేస్తున్న సిట్‌ అధికారులు

చంద్రబాబు ప్రభుత్వ సరికొత్త కుతంత్రం 

సెన్సేషనల్‌ కోసం వికాట్‌ కంపెనీలో సిట్‌ సోదాల డ్రామా 

లేని కుంభకోణాన్ని ఉన్నట్లు చూపించలేక చేతులెత్తేసిన సిట్‌ 

బెడిసికొడుతున్న ఎల్లో మీడియా కట్టుకథలు 

3.58 లక్షల జీబీల డేటా ధ్వంసం అంటూ దుష్ప్రచారం 

సమాచార హక్కు చట్టం ద్వారా కూటమి కుట్రలు భగ్నం 

వికాట్‌ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప బెయిల్‌కు మార్గం సుగమం 

అందుకే సోదాల పేరుతో సరికొత్త పన్నాగం 

బాబు ముఠా అరాచకాలతో పారిశ్రామికవేత్తల బెంబేలు

సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో సోదాల పేరిట మరో ‘సెన్షేషన్‌’కు చంద్రబాబు సర్కారు తెరతీసింది. ఇంతకాలం ప్రపంచ ప్రఖ్యాత సంస్థ వికాట్‌ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు  ప్రవేశపెట్టలేకపోయిన కూటమి ప్రభుత్వం... ఇది అక్రమ కేసేనని స్పష్టమవుతుండడంతో ఇప్పుడు మరో కుట్రకు పాల్ప­డుతోంది. కేసును ‘సెన్సేషన్‌’ చేయడానికి కొత్త డ్రామాను రక్తి కట్టిస్తోంది. 

ఏకంగా న్యాయస్థానాలనే తప్పుదారి పట్టించేందుకు బరితెగిస్తోంది. ఆ పక్కా పన్నాగంతోనే... బాలాజీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా కోర్టును బురిడీ కొట్టించేందుకు హైదరా­బాద్‌లోని ఆయన కార్యాలయంలో సోదాల పే­రు­తో కొత్త పన్నాగం పన్నుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసేనని సిట్‌ దర్యాప్తు తీరే స్పష్టం చేస్తోంది. 

టీడీపీ బాస్‌లకు అన్నింట్లోనూ ‘ఎస్‌’ అనే పోలీస్‌ అధికారులతో ఏర్పాటైన సిట్‌ దర్యాప్తులో ఒక్క ఆధారాన్నీ సేకరించలేకపోయింది. బెదిరింపులు, వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు తప్ప సాధించినదేమీ లేదన్నది తేటతెల్లమైంది. ఎల్లో మీడియా ద్వారా సాగిస్తున్న దుష్ప్రచార కుతంత్రమూ బెడిసికొడుతోంది. అసలు లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పన్నిన పన్నాగం బెడిసికొడుతుండడంతో చంద్రబాబు ప్రభు­త్వం బెంబేలెత్తుతోంది.  దీంతో మరో కుతంత్రం రచించింది.  

బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్టు చేసి 75 రోజులైంది. ఎలాంటి ఆధారాలు లేకుండా నెలల పాటు దర్యాప్తు పేరిట రిమాండ్‌లో ఉంచడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. దీంతో బెయిల్‌ ఇవ్వాలని బాలాజీ గోవిందప్ప కోర్టులో పిటిషన్‌ వేశారు. బాలాజీ గోవిందప్ప తదితరులకు త్వరలో బెయిల్‌ ఖాయమని న్యాయ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. కాగా, కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని సిట్‌ అధికారులను కోర్టు నిలదీస్తోంది. అందుకని సాంకేతిక అంశాలతో కోర్టును తప్పుదారి పట్టించేందుకు సిట్‌ కొత్త ఎత్తుగడ వేసింది. 

ఇటీవల సమర్పించిన ప్రాథమిక చార్జ్‌షీట్‌లో బాలాజీ గోవిందప్ప, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తదితరుల పేర్లను ప్రస్తావించలేదు. ఈ క్రమంలోనే బెయిల్‌ను అడ్డుకునేందుకు సిట్‌ కొత్త పన్నాగం పన్నింది. వికాట్‌ గ్రూప్‌నకు చెందిన ప్రధాన కార్యాలయం, బాలాజీ గోవిందప్ప నివాసంలో హఠాత్తుగా సోదాల డ్రామాకు తెరతీసింది. కోర్టు అనుమతి లేకుండానే 20 మందితో కూడిన సిట్‌ బృందం వికాట్‌ కంపెనీ కార్యాలయం వద్ద హంగామా చేసింది. సోదాలపై కోర్టు అనుమతి పత్రం చూపించాలన్న వికాట్‌ ఉద్యోగులతో సిట్‌ అధికారులు దురు­సుగా ప్రవర్తించారు. బలవంతంగా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పోలీస్‌ మార్క్‌ గూండాగిరితో భయపెట్టేందుకు ప్రయత్నించారు.

బాలాజీ గోవిందప్ప డైరెక్టర్‌గా ఉన్న వికాట్‌ కంపెనీ కార్యాలయంలో సిట్‌ సోదాలు పక్కా పన్నాగమే. ఎందుకంటే, మే 13న అక్రమంగా అరెస్టు చేసే సమయంలోనూ ఇదే రీతిలో ఆయన నివాసంలో సిట్‌ అధికారులు రోజంతా సోదాలు చేశారు. ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో బాలాజీ గోవిందప్ప కుమారుడి ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్లను జప్తు చేసి సిట్‌ తన దిగజారుడుతనాన్ని ప్రదర్శించింది. ఆ వస్తువులు తనవి కావని బాలాజీ గోవిందప్ప కోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. 

సీజ్‌ చేసిన వస్తువులు తిరిగి అప్పగించాలని, సంబంధిత వ్యక్తులకు ఇచ్చేస్తామని కోరారు. ఇక ఆయన నివాసంలో గానీ, జప్తు చేసినట్టు ప్రకటించిన ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో గానీ సిట్‌ ఆధారాలు చూపలేకపోయింది. దాంతో సిట్‌ పన్నాగం ఫలించలేదు. 75 రోజులు రిమాండ్‌లో ఉన్నా సరే దర్యాప్తులో కనీస పురోగతి సాధించలేదు. 

కుంభకోణం జరిగితేనే కదా?
లేని కుంభకోణం ఉన్నట్టు చూపించాలన్న సీఎం చంద్రబాబు కుట్ర క్షేత్రస్థాయిలో బెడిసికొడుతోంది. ఈ పరిణామాలన్నీ సిట్‌ దర్యాప్తు డొల్లతనాన్ని బట్టబయలు చేస్తు­న్నాయి. దాంతో బాలాజీ గోవిందప్ప బెయి­ల్‌ను అడ్డుకునేందుకు సిట్‌  వికాట్‌ కార్యాల­­యంలో సోదాలకు దిగింది. తద్వారా ఈ కేసు ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని చెబు­తూ కోర్టును తప్పుదారి పట్టించాలన్నది సిట్‌ పన్నాగం. ఆ నెపంతో బాలా­జీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకోవాలన్నది లక్ష్యం.

చెదిరిపోతున్న చంద్రబాబు కుట్రలు
రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌లో 3.58 లక్షల జీబీల డేటాను వైఎస్సార్‌సీపీ వర్గీయులు నాశనం చేశారని... 375 పేజీల డేటాను డిలీట్‌ చేశారని ఈనాడు సహా ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. దీనిపై ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేశారు. ‘‘అసలు మా వద్ద అలాంటి డేటానే ఏనాడూ లేదు. మేం ఎలాంటి డేటాను డిలీట్‌ చేయలేదు’’ అంటూ స్వయంగా టీడీపీ కూటమి ప్రభుత్వంలోని బెవరేజెస్‌ కార్పొరేషనే లిఖితపూర్వకంగా తెలిపింది. 

అంటే, అక్రమ కేసుపై ఎల్లో మీడియా చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని నిర్ధారణ అయింది. చంద్రబాబు, లోకేశ్‌ సిట్‌ను అడ్డుపెట్టుకుని కట్టుకథలు అల్లుతూ... వందల కొద్దీ ఎల్లో యూట్యూబ్‌ చానళ్లను సృష్టించి, టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్టులను నిపుణులు, పాత్రికేయులుగా నమ్మిస్తూ భారీగా డబ్బులు ఎరవేసి విష ప్రచారం సాగిస్తున్నారని స్పష్టమైంది.

పచ్చ గ్యాంగ్‌ దాదాగిరీ... పరిశ్రమలు పరార్‌
రాజకీయ కుట్రలు, కక్షసాధింపు కుతంత్రాలు, పారిశ్రామికవేత్తల నుంచి భారీ వసూళ్లు, దీనికోసం పరిశ్రమలపై దాడులు... ఇలా చంద్రబాబు ముఠా అరాచకాల కారణంగా రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం ధ్వంసమైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలకు వేధింపులు తీవ్రమయ్యాయి. భారీగా ముడుపులు, కాంట్రాక్టుల కోసం పారిశ్రామికవేత్తలను చంద్రబాబు గ్యాంగ్‌ వేధిస్తోంది. దీంతో పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తి వెళ్లిపోతున్నారు. 

» వలపు వల వేసి బడాబాబులను బురిడీ కొట్టించే కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకుని.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన జిందాల్‌ స్టీల్స్‌ను చంద్రబాబు ప్రభుత్వం వేధించింది. ఇది తట్టుకోలేక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టాలని నిర్ణయించిన రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆ కంపెనీ మహారాష్ట్రకు తరలించింది.
» సిమెంట్‌ దిగ్గజం వికాట్‌ గ్రూప్‌ యూరప్‌లో టాప్‌ కంపెనీల్లో ఒకటి. అంతటి ప్రతిష్ఠాత్మకఅంతర్జాతీయ కంపెనీలో బాలాజీ గోవిందప్ప పూర్తిస్థాయి డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయనకు ఏపీతో గానీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో గానీ ఏమాత్రం సంబంధం లేదు. కేవలం రాజకీయ కుట్రతోనే వికాట్‌ కంపెనీని, బాలాజీ గోవిందప్పను చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు.
» కాకినాడ సీ పోర్టులో వాటాలు వదిలేసుకోవాలని అరబిందో గ్రూప్‌ను కూటమి ప్రభుత్వ పెద్దలు బెదిరించారు. లేదంటే అక్రమ కేసులు పెట్టి వేధిస్తామని సీఐడీనీ రంగంలోకి దించారు. దీంతో అరబిందో గ్రూప్‌ కాకినాడ సీ పోర్టులోని మెజారిటీ వాటాను వదిలేసుకోవాల్సి వచ్చింది.
» అల్ట్రాటెక్‌ పరిశ్రమకు కర్ణాటక నుంచి ఎర్రమట్టి సరఫరా కాంట్రాక్టు కోసం ఏకంగా మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి, టీడీపీ సీనియర్‌ నేత  జేసీ ప్రభాకర్‌ రెడ్డి వర్గాలు పరస్పరం దాడులకు దిగి బెంబేలెత్తించాయి. దాంతో ఆ పరిశ్రమ యాజమాన్యం బెదిరిపోయింది.
» పల్నాడులో భవ్య, చెట్టినాడ్‌ సిమెంట్‌ కంపెనీలు ఉత్పత్తి చేసే ప్రతి బస్తాకు ఇంత అని కప్పం కట్టాలని గూండాగిరీకి తెగబడ్డారు. దీనికి ఒప్పుకోకపోవడంతో ఓ కంపెనీ ఉత్పత్తిని 50 రోజలు, మరో కంపెనీని 30 రోజులు అడ్డుకున్నారు.
» శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ డీజీఎం, సిబ్బందిపై సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి దాడి చేసి బెంబేలెత్తించారు. 
» రామాయపట్నం పోర్టు నిర్మాణంలో తనకు వాటా ఇవ్వాలని కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వేధించారు. ఆ కంపెనీకి నిర్మాణ సామగ్రి సరఫరాను అడ్డుకున్నారు. 
» శ్రీకాకుళం జిల్లాలోని యూబీ బీర్ల ఫ్యాక్టరీపై కూటమి నేతలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. తనకు   నెలనెలా కప్పం కడితేనే బీరు ఉత్పత్తుల లోడ్‌ లారీలను బయటకు అనుమతిస్తానని బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తేల్చి చెప్పారు. 
» సత్తెనపల్లి నియోజకవర్గం మీదుగా ప్రయాణించే గ్రానైట్‌ లారీల నుంచి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ వర్గీయులు కప్పం వసూలు చేస్తున్నారు. షాడో ఎమ్మెల్యేగా పేరు పొందిన ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో కేడీ ట్యాక్స్‌ పేరుతో భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. 
» శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కియా భూములను కొల్లగొట్టేందుకు ఆ జిల్లా మంత్రి, అక్కడి టీడీపీ ఎమ్మెల్యే వర్గాలు కొట్లాటకు దిగాయి.
» రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్య నేత కుమారుడు పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య వర్గాల నుంచి వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు.  
» నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రామ్‌కో సిమెంట్‌ ఫ్యాక్టరీ రెండో ప్లాంట్‌ పనుల్లో తమ నీటి ట్యాంకర్లను పెట్టుకోవడం లేదని టీడీపీ నేతలు దాడి చేశారు. 

హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్పనివాసంలో సిట్‌ సోదాలు
వికాట్‌ కార్యాలయాల్లో కూడా..
2 ప్రత్యేక బృందాలతో ఐదున్నర గంటల పాటు సోదాలు  
సాక్షి, సిటీబ్యూరో: మద్యం అక్రమ కేసులో సిట్‌ అధికారులు ఏఎస్పీ స్నేహిత నేతృత్వంలో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని వికాట్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప నివాసంలో శనివారం సోదాలు నిర్వహించారు. సిట్‌ గతంలోనూ సుదీర్ఘంగా సోదాలు చేసినా.. ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ కోర్టులో ప్రవేశ పెట్టలేకపోయింది. మరోవైపు ఏసీబీ కోర్టులో బాలాజీ గోవిందప్ప వేసిన బెయిల్‌ పిటిషన్‌ ఈ నెల 29న విచారణకు రానుందని, దానిని అడ్డుకునేందుకే సోదాల పేరుతో సిట్‌ అధికారులు కొత్త నాటకానికి తెరలేపారని గోవిందప్ప న్యాయవాదులు అంటున్నారు. 

బంజారాహిల్స్‌లోని వికాట్‌ కార్యాలయాల్లో సిట్‌ సోదాలు నిర్వహించింది. డీఎస్పీ శ్రీనివాస్, ఆరుగురు పోలీసుల బృందంతో కలిసి సుమారు ఐదున్నర గంటలు సోదాలు చేశారు. బాలాజీ గోవిందప్ప చాంబర్లు, పరిసర ప్రాంతాలను సోదా చేసినట్లు తెలిపారు. కొన్ని డిజిటల్‌ డివైజ్‌లను సీజ్‌ చేశామని, వాటిలో ఏముందనేది విచారణలో తేలుస్తామని డీఎస్పీ చెప్పారు. 

కాగా, సోదాలు నిర్వహించేందుకు వస్తున్నామని సిట్‌ అధికారులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ముందస్తు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఎవరు సోదాలు నిర్వహిస్తున్నారనేది బంజారాహిల్స్‌ ఠాణా రికార్డులో పేర్కొనలేదని తెలిసింది. కేవలం ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు మాత్రమే... బాలాజీ గోవిందప్ప నివాసం, వికాట్‌ ప్రధాన కార్యాలయంలో సోదాకు వస్తున్నట్లు రికార్డులో పేర్కొన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement