సాక్షి, తూర్పుగోదావరి: డాక్టర్ ప్రియాంక హత్య కేసులో నిందితుల పోలీస్ కస్టడీ విచారణ రెండో రోజూ కొనసాగుతోంది. దీంతో నిందితులు దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్‌ను పోలీసులు విచారిస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్, ఏఎస్పీ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయంలో ఈ విచారణ కొనసాగుతోంది.
16 ప్రశ్నల్లో 6 పూర్తి..
ఈ కేసుకు సంబంధించి పోలీసులు మొత్తం 16 కీలక ప్రశ్నలను సిద్ధం చేయగా.. ఇప్పటివరకు 6 ప్రశ్నలకు సంబంధించిన విచారణ పూర్తయినట్లు సమాచారం. నిందితులు ఇచ్చే సమాధానాలను అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. హత్యకు దారి తీసిన పరిస్థితులు, ఘటనకు ముందు చోటుచేసుకున్న పరిణామాలు, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఇతర కీలక అంశాలపై పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. అయితే, పోలీస్ కస్టడీ విచారణలో భాగంగా ప్రకాష్‌నగర్ సీఐ బాజీ లాల్‌ను ఉన్నతాధికారులు తప్పించారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలోనే ఈ నిందితులను విచారిస్తున్నట్లుగా ఏఎస్పీ దేవరాజ్ తెలిపారు.
రేపు ఉదయం కస్టడీ పూర్తి..
ప్రస్తుతం రెండవరోజు కొనసాగుతున్న నిందితుల పోలీస్ కస్టడీ గడువు రేపు ఉదయం 11 గంటలకు ముగియనుంది. దీంతో కస్టడీ విచారణ పూర్తయిన అనంతరం దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్‌ను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.


