గర్భిణి ఆపరేషన్‌ చిత్రాలు వాట్సాప్‌లో ప్రచారం | Operation Theatre Photos Leaked Social Media | Sakshi
Sakshi News home page

గర్భిణి ఆపరేషన్‌ చిత్రాలు వాట్సాప్‌లో ప్రచారం

Aug 20 2026 1:36 PM | Updated on Aug 20 2026 1:40 PM

Operation Theatre Photos Leaked Social Media

కాకినాడ: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం గర్భిణికి వైద్యులు చేస్తున్న శస్త్రచికిత్స ఫొటోలు వాట్సాప్‌లో హల్‌చల్‌ చేయడం కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. చాగల్లు మండలం చంద్రవరానికి చెందిన 25 ఏళ్ల గర్భిణి మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. రాత్రి 2 గంటల సమయంలో గైనకాలజిస్టు ప్రమీల, అనస్తీషియా వైద్యుడు త్రినాథ్, స్టాఫ్‌నర్సు సారమ్మతో పాటు ఇతర సిబ్బంది ఆమెకు ఆపరేషన్‌ చేశారు.

 తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నారు. అయితే, వైద్యులు ఆపరేషన్‌ చేస్తున్న ఫొటోలు, ప్రసవ సమయంలో బిడ్డను బయటకు తీసిన ఫొటోలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న నిడదవోలు న్యూస్‌ పేరిట ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేశారు. దీంతో, పట్టణంలో బుధవారం కలకలం రేగింది. వైద్య నియమ, నిబంధనలను అతిక్రమించి వాట్సాప్‌ గ్రూపులకు ఈ ఫొటోలు పంపించి, ఆసుపత్రిలో అత్యవసర సేవలు కూడా చేస్తున్నారనే కలరింగ్‌ ఇచ్చారు. అసలు ఈ ఫొటోలు ఎవరు తీశారు, అవి వాట్సాప్‌ గ్రూపులకు ఎవరు పంపించారంటూ రోగి బంధువులు, సామాజికవేత్తలు ఆసుపత్రికి వెళ్లి నిలదీశారు. 

దీనికి వైద్యాధికారులు పొంతన లేని సమాధానం చెబుతూ ఈ అంశాన్ని దాటవేసే ప్రయత్నం చేయడంతో గర్భిణి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన వారిపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ ఫయాజ్‌ అన్సారీను వివరణ కోరగా.. అవి ‘ఆరోగ్యశ్రీ కోసం తీసిన ఫొటోలు. సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తే మీకొచ్చిన నష్టమేంటి’ అంటూ విలేకర్లపై దురుసుగా ప్రవర్తించారు. వెంటనే ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement