‘సాంకేతిక విద్య’లో నిలిచిన డిప్యుటేషన్ల బాగోతం
మా సంగతి తేల్చాలంటున్న డబ్బులిచ్చిన లెక్చరర్లు, అధికారులు
డిప్యుటేషన్ బదిలీ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు వసూలు
‘సాక్షి’ కథనంతో ఆగిపోయిన స్థానచలనాలు
టీడీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన టెక్నికల్ ఎడ్యుకేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖలో లెక్చరర్లు, ఇతర అధికారుల డిప్యుటేషన్ పేరుతో అక్రమ బదిలీలకు బ్రేకులు పడ్డాయి. గత నెలలో 30 మందికి, నవంబర్‌లో 90 మందికి డిప్యుటేషన్లు వేసి బదిలీ చేసేందుకు ఆర్డర్లు సిద్ధంచేశారు. కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో జరుగుతున్న బదిలీల బాగోతంపై ఇటీవల ‘సాక్షి’ పత్రిక ‘బదిలీ మంత్రం.. వర్క్ అడ్జెస్ట్‌మెంట్ తంత్రం’ పేరుతో అక్కడ జరుగుతున్న వ్యవహారాలను వెలుగులోకి తెచ్చింది. దీంతో.. అప్పటికే పూర్తిచేసిన బదిలీలను అధికారులు నిలిపివేసి తాము తప్పుచేయలేదని తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
అలాగే, అక్టోబరులో కొందరు లెక్చరర్లను బదిలీ చేసినా వారి ఆర్డర్లను సైతం నిలిపివేశారు. ఈ క్రమంలో.. డబ్బులిచ్చిన అధికారులు, లెక్చరర్లు తమ సంగతి తేల్చాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. డెప్యుటేషన్ బదిలీ కోసం ఒక్కో లెక్చరర్ నుంచి రూ.2 లక్షలు వసూలుచేసినట్లు సమాచారం. ఇప్పుడీ అక్రమ బదిలీలు నిలిచిపోవడంతో తాము ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని లేదా చెప్పిన ప్రకారం ‘సర్వీస్’ బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే, ఈ బాగోతం ఇప్పటికే మీడియాకెక్కడంతో కొన్నాళ్లు ఆగాలని అధికారులు వారిని బుజ్జగిస్తున్నట్లు తెలిసింది.
సాంకేతిక విద్యాశాఖలో ఇష్టారాజ్యం..
నిజానికి.. 2014–19 మధ్య పాలిటెక్నిక్ విద్యను నాటి టీడీపీ ప్రభుత్వం అస్తవ్యస్థంగా మార్చేయడంతో విద్యార్థుల చేరికలు తగ్గిపోవడంతో పాటు ఉన్నవారికి సైతం సరైన ప్లేస్‌మెంట్లు లేవు. అయితే, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఈ విభాగానికి సమర్థులైన అధికారులను నియమించింది. పాలిటెక్నిక్ కోర్సులు చదివే విద్యార్థులకు ఉద్యోగాల కల్పనకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ విధానం అమలుచేసింది. ఈ కమ్రంలో దేశంలోనే ప్రముఖ సంస్థలను ఆయా కాలేజీలకు ఆహ్వానించింది. ఫలితంగా.. విద్యార్థులకు 98 శాతం ఉద్యోగావకాశాలు దక్కాయి. అయితే, 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యారంగాన్ని పూర్తిగా గాలికొదిలేసింది.
సాంకేతిక విద్యాశాఖలో అయితే కొందరు అధికారులు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతోంది. డెప్యుటేషన్లపై వచ్చి ఇక్కడే తిష్టవేసి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా.. కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీలు జోన్ పరిధిలోనే చేయాల్సి ఉండగా, ఏకంగా రీజియన్ పరిధి మార్చి వారిని 600 కి.మీ.కు పైగా దూరంలో పోస్టింగ్‌లు ఇచ్చి పంపించారు. వారు ఉద్యోగాన్ని వదులుకుంటే తమకు కావాల్సిన వారికి ఇచ్చుకునేందుకు కుట్రచేసినట్లు విమర్శలు వచ్చాయి.
కాసులిస్తే బదిలీలు, డిప్యుటేషన్లు..
ఇక జూన్‌లో సాధారణ బదిలీలు చేపట్టి ఖాళీలను చూపలేదు. అనంతరం ఆగస్టు, సెపె్టంబరు, అక్టోబరు నెలల్లో డబ్బులిచ్చిన వారికోసం డెప్యుటేషన్లు, బదిలీలు చేపట్టారు. దీనికి వర్క్ అడ్జెస్ట్‌మెంట్ అని పేరు పెట్టారు. అయితే, వాస్తవాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో ఆక్టోబరులో చేపట్టిన డెప్యుటేషన్లు నిలిపివేశారు. దీంతో.. డబ్బులిచ్చిన వారు ఒత్తిడి చేస్తుండడంతో బదిలీ ఆర్డర్ ఇవ్వలేక.. సమాధానం చెప్పలేక కీలక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది.


