సాక్షి, అనకాపల్లి: పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ్ ఎనర్జీ పరిశ్రమలో ఈ వేకువ జామున భారీ పేలుడు సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో ఇద్దరు కార్మికులు సజీవ దహనం అయ్యారు. మంటల్లో చిక్కుకున్న మరికొందరిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలువురికి తీవ్రగాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.
మృతి చెందినవాళ్లను.. వెంకటేశ్, త్రినాథ్‌లుగా గుర్తించారు. ఈ ఇద్దరూ అచ్యుతాపురం వాసులుగా తెలుస్తోంది. . ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న కార్మికులు తీవ్రంగా గాయపడగా, సహచరులు, అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. రెండు ఫైరింజన్లను మంటల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మంట్లలో మరికొందరు చిక్కుకుని ఉంటారని భావించి.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా? లేదంటే సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో ఫార్మాసిటీ పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.


