నియామకాల కోసం నిబంధనలకే కత్తెర
ఏఈఈ పోస్టులకు అనుభవం ఎత్తివేత
ఇన్నాళ్లూ ‘ఏఎంఐఈ’ అర్హత తప్పనిసరి
ఇకపై ఏఐసీటీఈ గుర్తింపు డిగ్రీ ఉంటే చాలు
16 రోజుల్లోనే మాట మార్చిన ఏపీ ట్రాన్స్‌కో
తొలి ఆదేశాల్లో చెప్పిన అర్హతలన్నీ మాయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో)లో అసిస్టెంట్ ఎగ్జిక్యూ టివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల నియామక అర్హతలను తాజాగా సవరించారు. అయితే, సవరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. అత్యంత సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే పోస్టు లకు ఇప్పటి వరకు అమలులో ఉన్న అనుభవం, శిక్షణ వంటి కీలక అర్హతలను తొలగించడం వెనుక అసలు కారణాలేమిటన్న ప్రశ్నలు తలెత్తుతు న్నా యి. ఏపీ ట్రాన్స్‌కో ఈ నెల 21న జారీ చేసిన ఉత్త ర్వుల ద్వారా ఏఈఈ (ఎలక్ట్రికల్, టెలికమ్యూ నికేషన్స్) పోస్టుల అర్హతలను సవరించింది.
గతంలో ఈ పోస్టులకు డిగ్రీతోపాటు అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఏఎంఐఈ) అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉండేది. అయితే వారికి నాలుగేళ్ల ప్రాక్టికల్ అనుభవం, కనీసం ఏడాది ఫీల్డ్ అనుభవం, సర్వేయింగ్ శిక్షణ లేదా సివిల్ డిప్లొమా వంటి అదనపు అర్హతలు తప్పనిసరి. కానీ తాజా సవరణలతో ఈ నిబంధనలన్నింటినీ తొలగించారు.
ఇకపై ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) గుర్తింపు, యూజీసీ ఆమోదం పొందిన ఇంజినీరింగ్ డిగ్రీ ఉంటే సరిపోతుందని నిర్ణయించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆశ్చర్యకరమైన విష యం ఏమిటంటే, ఇదే అంశంపై జూన్ 5న ట్రాన్స్ కో ఉత్తర్వులు జారీ చేసి పాత నిబంధనలను కొన సాగించింది. కానీ, కేవలం 16 రోజుల వ్యవధిలోనే మరోసారి ఉత్తర్వులు జారీ చేసి అర్హతలను మార్చే సింది. ఇంత తక్కువ సమయంలో నిబంధనల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్న ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
అందుకే మార్చారా?
రాష్ట్ర విద్యుత్ వ్యవస్థలో ఏఈఈల పాత్ర అత్యంత కీలకం. 132 కేవీ, 220 కేవీ, 400 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్వహణ, సబ్‌స్టేషన్ పర్యవేక్షణ, గ్రిడ్ భద్రత, అత్యవసర మరమ్మతులు, విద్యుత్ అంతరాయాల నివారణ వంటి బాధ్యతలు వీరిపై ఉంటాయి. ఇలాంటి కీలక పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ పరిజ్ఞానం మాత్రమే సరిపోదని, విద్యుత్ ప్రసార వ్యవస్థల నిర్వహణ, హై వోల్టేజ్ పరికరాల పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల నిర్వహణ వంటి అంశాల్లో ఫీల్డ్ అనుభవం కీలకమని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అలాంటి అనుభవానికి ప్రాధాన్యం ఇచ్చే నిబంధనలను పూర్తిగా తొలగించడం వల్ల భవిష్యత్తులో సాంకేతిక నాణ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ట్రాన్స్‌కో, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లలో త్వరలో నియామకాలు చేపడతామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ మార్పులు జరగడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అర్హతలను సరళీకరించడం ద్వారా తమకు నచ్చిన అభ్యర్థులకు ఉద్యోగాలు లభించేలా పాలకులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే డైరెక్టర్ల నియామకాలు, ఉద్యోగుల బదిలీల్లో సిఫారసు లేఖలు ఇచ్చి సొమ్ములు దండుకున్న కూటమి నేతల నిర్వాకాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. రానున్న రోజుల్లో చేపట్టే ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు ఇప్పటి నుంచే నిబంధనలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలకు తాజా ఉత్తర్వులు బలం చేకూరుస్తున్నాయి.


