సోమిరెడ్డిపై కేసు నమోదు | Sakshi
Sakshi News home page

సోమిరెడ్డిపై కేసు నమోదు

Published Tue, May 28 2024 3:47 AM

Criminal Case Registered against Somireddy

ప్రలోభాలపై రిటర్నింగ్ అధికారి చినఓబులేసు ఫిర్యాదు

పొదలకూరు: ఎన్నికల వేళ ప్రచారంలో సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమి­రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మహిళలకు నగదు పంపిణీ చేసిన వ్యవహారంపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఈ విషయమై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అప్పట్లోనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయగా.. మానవతా దృక్పథంతో సాయం చేశారంటూ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి తోసిపుచ్చారు. వీడియో విజువల్స్‌లో స్పష్టంగా సోమిరెడ్డి మహిళలకు నోట్లు ఇవ్వడం కనిపిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు.

దీనిపై కాకాణి పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో మూడు రోజుల క్రితం కాకాణి మీడియా సమావేశం నిర్వహించి సోమిరెడ్డి ప్రలోభాల పర్వంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించారు. దీంతో ఎట్టకేలకు జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందిగా సర్వేపల్లి రిటర్నింగ్‌ అధికారి చినఓబులేసు  పొదలకూరు పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం  ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.

ఏప్రిల్‌ 12వ తేదీన శుక్రవారం సోమిరెడ్డి, ఆయన కుమారుడు రాజగోపాల్‌రెడ్డి పొదలకూరు మండలం చెర్లోపల్లి గిరిజన కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సోమిరెడ్డి గిరిజన మహిళలకు నగదు పంపిణీ చేశారు. సోమిరెడ్డి అనుచరులు దీనిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. అప్పట్లో ఎన్నికల అధికారులు దీనిపై మండలస్థాయి అధికారులతో విచారణ జరిపించి.. మానవతా దృక్పథంతో సోమిరెడ్డి గిరిజన మహిళలకు నగదు అందజేసినట్టు నివేదిక సమర్పించి మమ అనిపించారు. ఎట్టకేలకు కాకాణి హెచ్చరికలతో ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు సోమిరెడ్డిపై  ఐపీసీ 173–ఈ, ఆర్‌పీ యాక్ట్‌ 123 క్లాజ్‌–1 సెక్షన్ల కింద పోలీసులు సోమిరెడ్డిపై కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement