గ్లోబల్‌ టూరిజం హబ్‌గా భారత్‌  | Container Terminal Expansion Phase 2 was virtually inaugurated by Narendra Modi | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ టూరిజం హబ్‌గా భారత్‌ 

Published Wed, Oct 18 2023 5:25 AM | Last Updated on Wed, Oct 18 2023 5:25 AM

Container Terminal Expansion Phase 2 was virtually inaugurated by Narendra Modi - Sakshi

మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖపట్నం పోర్టు అథారిటీకి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అలాగే కంటైనర్‌ టెర్మినల్‌ విస్తరణ ఫేజ్‌–2ను జాతికి అంకితం చేశారు. ముంబై కేంద్రంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ మారిటైం ఇండియా సమ్మిట్‌–2023కు ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్‌ టూరిజం హబ్‌గా భారతదేశం ఎదిగేందుకు అవసరమైన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం, చెన్నైలో మోడ్రన్‌ క్రూయిజ్‌ హబ్‌లు తీసుకువచ్చామన్నారు. ముంబైలో కూడా త్వరలో ఇంటర్నేషనల్‌ క్రూయిజ్‌ హబ్‌ రాబోతోందని తెలిపారు. అలాగే రూ.655 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టు చేపట్టిన ఈక్యూ 7, డబ్ల్యూ క్యూ 6, 7, 8 బెర్తుల యాంత్రీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ.633 కోట్లతో పూర్తి చేసిన విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ రెండో విడత విస్తరణ ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుంచి పోర్టు ట్రస్ట్‌ చీఫ్‌ ఇంజనీరింగ్‌ విభాగం సలహాదారు వేణు ప్రసాద్, వీసీటీపీఎల్‌ ప్రతినిధి కెప్టెన్‌ జాలీ, జేఎం.బక్షి, బోత్రా తదితరులు పాల్గొన్నారు. 

పలు సంస్థలతో ఒప్పందాలు 
గ్లోబల్‌ మారిటైం ఇండియా సమ్మిట్‌లో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సమక్షంలో విశాఖ పోర్టు పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. పోర్టు చైర్మన్‌ డాక్టర్‌ ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్మన్‌ దుర్గేశ్‌కుమార్‌ దూబే.. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా తరఫున ఎం.కె.వాతోర్, నేవీ అడ్మిరల్‌ నెల్సన్‌ డిసౌజా, ట్రయాన్‌ సంస్థ తరఫున రజనీష్‌ మహాజన్‌ ఈ ఎంవోయూలపై సంతకాలు చేశారు. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ప్రస్తుతం విశాఖలోని కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి షీలానగర్‌ వరకు ఉన్న 4 లేన్ల రహదారిని 6 లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు.

ఇందుకోసం పోర్టు రూ.501 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే ఔటర్‌ హార్బర్‌లో పలు అభివృద్ధి పనులు చేసేందుకు భారత నౌకాదళంతో మరో ఒప్పందం కుదుర్చుకుంది. ట్రయాన్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో జరిగిన ఒప్పందంలో భాగంగా.. విశాఖ పోర్టు సాలగ్రామపురంలోని భూమిని ట్రయాన్‌ సంస్థకు దీర్ఘకాలిక లీజుకు ఇవ్వనుంది. ఈ ఒప్పందం విలువ రూ.900 కోట్లు. ఒప్పందంలో భాగంగా కన్వెన్షన్‌ సెంటర్లు, ఐటీ టవర్లు నిర్మించనున్నారు. కాగా, గ్లోబల్‌ మారిటైం సమ్మిట్‌లో విశాఖ పోర్టు ఏర్పాటు చేసిన స్టాల్‌ సందర్శకులను ఆకట్టుకుంది. విశాఖ పోర్టు అథారిటీ ఏపీ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసిన స్టేట్‌ సెషన్‌లో పోర్టు చైర్మన్‌ డాక్టర్‌ ఎం.అంగముత్తు, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement