సీజ్‌ ద కంపెనీ.. | Coalition MLA orders concrete mix company | Sakshi
Sakshi News home page

సీజ్‌ ద కంపెనీ..

May 31 2025 3:48 AM | Updated on May 31 2025 3:48 AM

Coalition MLA orders concrete mix company

శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో కాంక్రీట్‌ మిక్స్‌ కంపెనీపై కూటమి ఎమ్మెల్యే కక్షసాధింపు

తన స్కూల్‌ శ్లాబ్‌ కోసం రూ.15 లక్షల విలువైన కాంక్రీట్‌ ఫ్రీగా వేయాలని హుకుం

ఉచితంగా వేయలేరా? నేను డబ్బులు కట్టాలా అంటూ చిందులు

ఒప్పుకోని కంపెనీ యాజమాన్యం

దీంతో అధికారుల ద్వారా వేధింపులు

రూ.21 లక్షల పైచిలుకు పన్ను చెల్లించాలని నోటీసు 

సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: ఆ మధ్య ‘సీజ్‌ ద షిప్‌’ అని కూటమిలోని ఓ కీలక నేత ఆదేశాలపట్ల స్ఫూర్తి పొందారో ఏమో.. శ్రీకాకుళం జిల్లాలో కూటమి ఎమ్మెల్యే ఒకరు ‘సీజ్‌ ద కంపెనీ’ అంటూ చెలరేగిపోతున్నారు. తన స్కూల్‌కు ఇటీవల ఓ కాంట్ట్రాక్టు సంస్థకు చెందిన వాహనాలతో గ్రావెల్‌ను అక్రమంగా తరలించుకుపోవడమే కాక.. ఇప్పుడదే ఎమ్మెల్యే ఏకంగా తన స్కూల్‌ శ్లాబ్‌ కోసం రూ.15 లక్షల విలువైన కాంక్రీట్‌ను ఉచితంగా వేయాలని ఒక కంపెనీని డిమాండ్‌ చేశారు. 

అంత చేయలేమని ఆ సంస్థ సున్నితంగా చెప్పడంతో సదరు ప్రజాప్రతినిధి అధికారుల ద్వారా కక్షసాధింపు చర్యలకు తెగబడ్డారు. ‘ఆ కంపెనీని మూస్తారా లేదా.. మీకు పనిచేయడం చేతకాదా..’ అంటూ చిందులు తొక్కడంతో అధికారులు బిక్కుబిక్కుమంటూ చర్యలకు ఉపక్రమించారు.

ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలోని పైడిభీమవరం పారిశ్రామికవాడలో శర్వాణీ కాంక్రీట్‌ రెడీమిక్సింగ్‌ పరిశ్రమ ఉంది. ఇటీవల ఓ కూటమి ఎమ్మెల్యేకి తన స్కూల్‌ పైఅంతస్తులో శ్లాబ్‌ వేసేందుకు కాంక్రీట్‌ అవసరమైంది. పైడిభీమవరంలోని స్థానిక కూటమి నాయకులకు విషయం చెప్పగా వారు శర్వాణి కాంక్రీట్‌ పరిశ్రమ యాజమాన్యాన్ని సంప్రదించారు. క్యూబిక్‌ మీటర్‌కు రూ.4,900లు అవుతుందని.. 300 క్యూబిక్‌ మీటర్లు సుమారు రూ.15 లక్షలు అవుతుందని యాజమాన్యం చెప్పింది. 

ఈ సమాచారాన్ని స్థానిక నాయకులు ఆ ఎమ్మెల్యేకి చెప్పగానే.. ‘ఆఫ్ట్రాల్‌ 300 క్యూబిక్‌ మీటర్లు ఉచితంగా వేయలేరా? నేను డబ్బులు కట్టాలా’.. అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. దీంతో పరిశ్రమ యాజమాన్యంతో స్థానిక నేతలు మరోమారు సంప్రదించగా.. ఎమ్మెల్యేకు కాబట్టి తగ్గిస్తాం తప్ప ఉచితంగా వేయలేమని చెప్పారు. ఇదంతా రెండు నెలల క్రితం జరిగింది. దీన్ని మనసులో పెట్టుకున్న సదరు ఎమ్మెల్యే అప్పటి నుంచి ఆ పరిశ్రమ యాజమాన్యానికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. 

నిత్యం పంచాయతీ, కాలుష్య నియంత్రణ, రెవెన్యూ, విద్యుత్‌ శాఖాధికారులను పంపించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 2024–25కు గాను పంచాయతీ పన్ను ఏకంగా రూ.21 లక్షలు పైచిలుకు కట్టాలని నోటీసు పంపించారు. ఇలా వారం రోజులుగా ఆయా శాఖల అధికారులు చేస్తున్న హడావుడితో శర్వాణి ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. 

మరోవైపు.. పరిశ్రమ వర్గాలు కూటమి నేతల తీరును తీవ్రంగా నిరసిస్తున్నాయి. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న తమపై ఈ తరహా ఒత్తిళ్లకు గురిచేస్తే వెళ్లిపోవడం తప్ప మరో మార్గంలేదని వాటి యాజమాన్యాలు కుండబద్దలు కొడుతున్నాయి.

ఆ ఎమ్మెల్యే మామూలుగా ఇబ్బంది పెట్టడంలేదు..
ఎమ్మెల్యే అయి ఉండి కూడా కాంక్రీట్‌ ఫ్రీగా వేయమంటారు. మాకేమీ అర్థంకావట్లేదు. కాలుష్య నియంత్రణ, ఎంపీడీఓ, తహసీల్దార్‌ ఇలా ఇష్టమొచ్చిన వాళ్లను పంపిస్తున్నాడు. 300 క్యూబిక్‌ మీటర్లు అడిగారు. రూ.15 లక్షలు విలువ ఉంటుంది. ఎమ్మెల్యే ఒత్తిడితో నిత్యం అధికారులు వస్తున్నారు. వాళ్లు కూడా బాధపడుతున్నారు. ఎమ్మెల్యే మామూలుగా ఇబ్బంది పెట్టడంలేదు. – శర్వాణి పరిశ్రమ యాజమాన్యం 

పన్ను కట్టాలని నోటీసు ఇచ్చాం..
పైడిభీమవరం పారిశ్రామికవాడలోని అన్నీ పరిశ్రమలకు పన్ను చెల్లించాలని నోటీసు ఇచ్చాం. అందులో భాగంగానే శర్వాణి పరిశ్రమకూ అందించాం, ఇప్పటికే రెండుమార్లు ఇచ్చాం.– ఎం. ఈశ్వరరావు, ఎంపీడీఓ, రణస్థలం 

పరిశ్రమను సందర్శించాం..
శర్వాణి పరిశ్రమను ఇటీవల సందర్శించి నాలా కన్వర్షన్‌ జరిగిందా లేదా అని పరిశీలించాం. నాలా కన్వర్షన్‌ జరిగింది, మిగతా విషయాలను మండల పరిషత్‌ అధికారులే చూస్తున్నారు. – ఎన్‌. ప్రసాద్, రణస్థలం తహసీల్దార్‌ 

Advertisement
 
Advertisement
Advertisement