శ్రీకాకుళం క్రైం: ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కార్యక్రమంలో స్వీకరించే ప్రతీ ప్రజా అర్జీను త్వరితగతిన పరిష్కరించి, ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ (పబ్లిక్ గ్రీవెన్స్)ను సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 62 ఫిర్యాదులను స్వీకరించారు. పౌర సంబంధాలు, కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, మోసపూరిత కేసులు తదితర అంశాలకు సంబంధించిన మొత్తం 62 ఫిర్యాదులు అందాయి. ఆయా ఫిర్యాదులపై సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను జిల్లా పోలీసు కార్యాలయానికి సమ
ర్పించాలని ఆదేశించారు.
న్యాయం చేయండి
అవసరాల నిమిత్తం డబ్బు అప్పు కోసం తనకున్న 33 సెంట్ల భూమిని హామీగా తనఖాకు పెడితే నగదుతో పాటు తన నిరక్షరాస్యతను అడ్డంపెట్టుకుని భూమిని సైతం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఎస్పీ గ్రీవెన్సులో ఒక వ్యక్తి సోమవారం ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రణస్థలం మండలం వేల్పూరుకు చెందిన జి.అప్పారావు కోష్టకు చెందిన కరిమిజ్జి చిన్నంనాయుడు వద్ద కొన్నాళ్ల క్రితం అప్పు తీసుకున్నారు. దానికి సంబంధించి ప్రతినెలా రూ.6,200లు వడ్డీ కడుతూనే.. ఇటీవల రూ.6 లక్షలు అసలు తీర్చాడు. అయితే నిరక్షరాస్యుడైన తన వద్ద చిన్నంనాయుడు తనఖాకు భూమి హామీపత్రం రాయకుండా, ఆ భూమి విక్రయించినట్లు రాయడాన్ని ఆలస్యంగా తెలుసుకున్న అప్పారావు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
నీలగిరి తోటల ధ్వంసంపై ఫిర్యాదు
కోర్టు దావాలో ఉన్న నీలగిరి తోటలను నరికి ధ్వంసం చేయడమే కాకుండా, అడ్డుకోవడానికి వెళ్లిన తనపైనా కొందరు వ్యక్తులు దాడి చేశారని ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామానికి చెందిన పొందూరు చంద్రరావు ఎస్పీ గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. షేర్‌మహ్మద్‌పురం రెవెన్యూలోని సర్వే నంబర్ 597–2లో కొంతభూమి కోర్టు దావాలో నడుస్తోందని, ఆ భూమిలో నీలగిరి తోటలను కొందరు వ్యక్తులు నరికివేసే విషయమై ఎచ్చెర్ల ఎస్‌ఐ లక్ష్మణరావు వద్ద ఫిర్యాదు చేయగా, ఆ సమయంలో వారిని ఆపివేసినా.. తర్వాత తనకు పైనుంచి ఫోన్లు వస్తున్నాయంటూ మాపై కోపాన్ని ప్రదర్శించారని ఎస్పీకిచ్చిన ఫిర్యాదులో చంద్రరావు వాపోయాడు.


