● అనుమానాస్పదంగా వసతి గృహ విద్యార్థి మృతి
● కురుడు బీసీ బాలురు హాస్టల్‌లో ఘటన
వసతి గృహానికి ఆనుకుని ఉన్న చెరువులో లభ్యమైన దుర్గాప్రసాద్ మృతదేహాన్ని వెలికితీస్తున్న గ్రామస్తులు
టెక్కలి: కోటబొమ్మాళి మండలం కురుడు బీసీ బాలుర వసతి గృహానికి చెందిన 6వ తరగతి విద్యార్థి ముద్దాడ దుర్గాప్రసాద్ (11) అనుమానాస్పదంగా మృతి చెందాడు. ముందు రోజు నుంచి విద్యార్థి వసతి గృహం నుంచి అదృశ్యమైనా హాస్ట ల్ వార్డెన్‌కు విషయం తెలియకపోవడం గమనార్హం. ముందు రోజు వసతి గృహంలో అదృశ్యమైన విద్యార్థి మరుసటి రోజు వసతి గృహానికి ఆనుకుని ఉన్న చెరువులో మృతదేహమై తేలడం సంచలనమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కోటబొమ్మాళి మండలం మాసాహెబ్‌పేట పంచాయతీ కమలనాభపురం గ్రామానికి చెందిన ముద్దాడ జయరాం, భార్య భవానీలు హైదరాబాద్‌లో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి దుర్గాప్రసాద్, అన్విత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదే మండలం సరియాపల్లి గ్రామానికి చెందిన అమ్మమ్మ, తాతయ్య ఇంటి వద్ద వీరిని అప్పగించారు. పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్‌ను కురుడు బీసీ బాలుర వసతి గృహంలో చేర్పించారు. బాలుడు ఇదే ప్రాంగణంలో ఉన్న పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు.
ఆదివారం సాయంత్రం దుర్గాప్రసాద్ వసతి గృహం నుంచి బయటకు వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం సరియాపల్లి గ్రామానికి చెందిన యువకుడు కూరాకుల దశరథ వసతి గృహానికి వచ్చి తమ గ్రామానికి చెందిన విద్యార్థులతో మాట్లాడుతూ.. దుర్గాప్రసాద్ కోసం ఆరా తీయగా దుర్గాప్రసాద్ హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లాడని తోటి విద్యార్థులు చెప్పారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కానీ విద్యార్థి కమలనాభపురం, సరియాపల్లి గ్రామాలకు వెళ్లకపోవడంతో తాతయ్య సింహాచలం, అమమ్మ అప్పలమ్మ తదితరులు హాస్టల్‌కు వచ్చి తమ మనవడి కోసం సిబ్బందిని అడిగారు. దీంతో విషయం బయటకు పొక్కింది. మధ్యాహ్న సమయంలో హాస్టల్ వార్డెన్ కోటబొమ్మాళి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ వి.సత్యనారాయణ తన సిబ్బందితో హాస్టల్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. మరో వైపు కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభించారు. వసతి గృహానికి ఆనుకుని ఉన్న చెరువులో విద్యార్థి దుర్గాప్రసాద్‌కు చెందిన చెప్పులు కనిపించడంతో అనుమానం వ్యక్తం చేశారు. తాడు సాయంతో వెతకగా విద్యార్థి దుర్గాప్రసాద్ మృతదేహం లభ్యమైంది. ఇదే సమయంలో వర్షం పడడంతో మృతదేహాన్ని విగత జీవిగా వదిలేయడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముందు రోజు సాయంత్రం నుంచి విద్యార్థి కనిపించకపోయినప్పటికీ తక్షణ చర్యల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తమ బిడ్డ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. ఈ సంఘటన పై కోటబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాన్ని కోటబొమ్మాళి ఆస్పత్రికి తరలించారు.


