రైతులకు కావాల్సిన అన్ని సేవలు గ్రామంలోనే అందేవిధంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినూత్నమైన ఆలోచన చేశారు. దీనిలో భాగంగా గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మన జిల్లాలో మొత్తం 533 కియోస్క్ యంత్రాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిద్వారా ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు, అనుబంధ రంగ వస్తువులు రాయితీపై అందజేయడంతో పాటు సాగుకు సంబంధించి సూచనలు, సలహాలు అందించేవారు. ప్రతీ ఆర్‌బీకేలో కియోస్క్ యంత్రాలు ఏర్పాటు చేయడంతో రైతులే నేరుగా ఎరువులు, పురుగు మందులకు ఇండెంట్ పెట్టుకునేవారు. ప్రతిరోజూ రైతుల రాకపోకలతో రైతు భరోసా కేంద్రాలు కళకళలాడేవి. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత రెండేళ్లుగా రైతుసేవా కేంద్రాల్లోని డిజిటల్ కియో స్క్ యంత్రాలు నిరుపయోగంగా మారాయి. దీంతో రైతులకు వాటి వలన సేవలందక ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వంపై ఉన్న అక్కసుతో ఎంతో విలువైన కియోస్క్ యంత్రాలను కూటమి ప్రభుత్వం పక్కన పడేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని అన్నదాతలు కోరుతున్నారు. – బూర్జ
నిరుపయోగంగా కియోస్క్ యంత్రాలు
నిర్వహణ పట్టించుకోని ప్రభుత్వం
అన్నదాతకు తప్పని అవస్థలు
రైతులకు ఇబ్బందులు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కియోస్క్ యంత్రాలు ఉండడంతో తొందరగా ఆన్‌లైన్ పనులు జరిగేవి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఫోన్‌ల ద్వారా ఓటీపీలు సమయానికి రాకపోవడంతో రైతులు మండల కేంద్రానికి రోజులు తరబడి తిరుగుతున్నారు.
– చొక్కర కృష్ణమోహన్, బూర్జ గ్రామం
ఫోన్ ద్వారానే నమోదు
ప్రస్తుతం జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో ఆండ్రాయిడ్ ఫోన్‌ల ద్వారానే పనులు చేస్తున్నారు. కియోస్క్ యంత్రాలు లు పనిచేయడం లేదు. సిగ్నల్ అందడం లేదు. అండ్రాయిడ్ యాప్ ద్వారా వేగవంతంగానే పనులు జరుగుతున్నాయి.
– కె.త్రినాథస్వామి, జిల్లా వ్యవసాయశాఖాధికారి
త్వరగా పనులు జరిగేవి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కియోస్క్ యంత్రాలు ద్వారా త్వరగా అందజేసేవారు. ప్రస్తుతం అండ్రాయిడ్ ఫోన్‌లోనే అన్ని సేవలు అని చెబుతున్నారు. కానీ పనులు మాత్రం సక్రమంగా జరగక ఎరువు కోసం రోజూ తిరగాల్సి వస్తోంది. – వావిలపల్లి గోవిందరావు,
కొండపేట, బూర్జ మండలం


