టీచర్లపై ఇంతలా కక్షగడతారా? | YS Jagan Fires On CM Chandrababu over Red Book | Sakshi
Sakshi News home page

టీచర్లపై ఇంతలా కక్షగడతారా?

Aug 18 2026 2:17 AM | Updated on Aug 18 2026 2:17 AM

YS Jagan Fires On CM Chandrababu over Red Book

సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

మీ రెడ్‌బుక్‌ అరాచక జంగిల్‌రాజ్‌ చివరకు టీచర్లనూ వదిలిపెట్టడం లేదు 

టెట్‌ నిబంధన వల్ల లక్ష మందికి పైగా సీనియర్‌ టీచర్లు ఇబ్బంది పడుతున్నారు 

ఆ నిబంధన నుంచి తమను మినహాయించాలని వారు కోరడం తప్పా? 

వారికి మద్దతు ఇస్తున్న ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం నేరమా? 

దానికే సస్పెన్షన్‌ విధిస్తారా? మీరు చేయలేని పని చేయడానికి టీచర్లు ప్రయత్నించడం తప్పా? 

అసలు టెట్‌ నిబంధనను తొలగించాలని కేంద్రాన్నికోరాల్సింది మీరు కాదా? 

సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. టీచర్లకు రాజకీయాలు అంటగట్టడం దారుణం 

వెంటనే ఆ ఐదుగురు టీచర్లపై విధించిన సస్పెన్షన్లను ఎత్తివేయాలి 

వారికి క్షమాపణ చెప్పి తప్పును సరిదిద్దుకోకుంటే దీనిని సీరియస్‌గా తీసుకుంటాం 

సస్పెండయిన టీచర్లకు న్యాయపరంగా పూర్తిగా అండగా నిలుస్తాం 

అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకూ వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుంది.. మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా గాలికి వదిలేశారు 

ఐఆర్‌ లేదు.. పీఆర్‌సీ లేదు.. 5 డీఏలు పెండింగ్‌ 

సీపీఎస్‌/ఓపీఎస్‌ను పునఃసమీక్షిస్తామంటూ ఆశ చూపి ఉద్యోగులను త్రిశంకుస్వర్గంలో పెట్టారు 

వారికి రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల బకాయిలు పెట్టారు 

న్యాయంగా రావాల్సిన డబ్బుల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తుంటే సస్పెన్షన్లను బహుమానంగా ఇస్తున్నారు  

అధికారం ఉందనే అహంకారంతో మీరు చెలరేగిపోతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయుల విశాల ప్రయోజనాలను కాపాడటం కోసం పనిచేస్తున్న ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల టీచర్లను చంద్రబాబు సర్కార్‌ సస్పెండ్‌ చేయడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఉద్యోగంలో చేరే నాటికి లేని టెట్‌ ఇప్పుడు ఇన్ని సంవత్స­రాల తర్వాత రాయాలన్న నిబంధన వల్ల లక్ష మందికిపైగా సీనియర్‌ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని ఎత్తిచూపారు. ఆ నిబంధన నుంచి తమను మినహాయించాలని కోరుతూ, వారికి మద్దతు ఇస్తున్న ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడమే నేరమా? అంటూ సీఎం చంద్ర­బాబును నిలదీశారు. వెంటనే ఆ ఐదుగురు టీచర్లపై విధించిన సస్పెన్షన్లను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

వారికి క్షమాపణ చెప్పి చేసిన తప్పును సరిదిద్దుకోవాలంటూ సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. లేకపోతే ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ అన్యాయమైన సస్పెన్షన్లను సవాల్‌ చేసే కార్యక్రమంలో ఆ టీచర్లకు న్యాయపరంగా పూర్తిగా అండగా నిలుస్తామని... వారికి భరోసా ఇస్తామని.. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకూ వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని తేల్చిచెబుతూ ‘ఎక్స్‌’లో తన ఖాతాలో సోమవారం వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు.

ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..వినతిపత్రం ఇవ్వడమే నేరమా? ‘‘చంద్రబాబు గారూ.. ప్రభుత్వ ఉద్యోగులపై, అందులోనూ టీచర్లపై మరీ ఇంత కక్షగడతారా? మొదటి రోజు వైఎస్సార్‌ కడప, రెండో రోజు అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల టీచర్లను ఎందుకు సస్పెండ్‌ చేశారు? వారు ఏం నేరం చేశారు? వారు ఉద్యోగంలో చేరే నాటికి లేని టెట్‌ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత రాయాలి అన్న టెట్‌ నిబంధన వల్ల లక్ష మందికిపైగా సీనియర్‌ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆ నిబంధన నుంచి తమను మినహాయించాలని కోరుతూ, వారికి మద్దతు ఇస్తున్న ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడమే నేరమా? 

ఉద్యోగులకూ మోసం..
ఉద్యోగుల విషయంలో మీ మోసం కూడా ఇదే స్థాయిలో ఉంది. మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్‌ ప్రకటిస్తామన్నారు. మెరుగైన పీఆర్‌సీ ఇస్తామన్నారు. ప్రభుత్వం వచ్చి మూడో ఏడాది నడుస్తోంది ! ఐఆర్‌ లేదు! పీఆర్‌సీ లేదు! 5 డీఏలు పెండింగ్‌ ! సీపీఎస్‌/ఓపీఎస్‌ను పునఃసమీక్షిస్తామంటూ ఉద్యోగులకు ఆశ చూపారు. చివరకు సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా మేం ప్రకటించిన జీపీఎస్‌ను కూడా అమలు చేయకుండా ఉద్యోగులను త్రిశంకుస్వర్గంలో పెట్టారు. 

ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్‌సీ  బకాయిలు, పెండింగ్‌ డీఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్, సరెండర్‌ లీవ్స్‌ లేదా ఎన్‌క్యాష్‌మెంట్‌ లీవులు ఇలా దాదాపు రూ. 35వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల బకాయిలు పెట్టారు. తమకు న్యా­యంగా రావాల్సిన డబ్బుల కోసం ఉద్యోగులు ఎదురుచూ­స్తుంటే ఒక్క పైసా ఇవ్వరు. కానీ వారికి సస్పెన్షన్లను బహు­మానంగా ఇస్తున్నారు. ఇదేనా ఉద్యోగుల పట్ల మీ గౌరవం? ఇదేనా టీచర్ల పట్ల మీ బాధ్యత? అధికారం ఉందనే అహంకారంతో, నియంతృత్వ విధానాలతో మీరు చెలరేగిపోతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబుగారూ. 

చివరకు మీ నీడను కూడా మీరు భరించలేని స్థాయికి వెళ్లిపోయారు. వెంటనే ఆ ఐదుగురు టీచర్లపై విధించిన సస్పెన్షన్లను ఎత్తివేయండి. వారికి క్షమాపణ చెప్పి చేసిన తప్పును సరిదిద్దుకోండి. లేకపోతే ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంటాం. ఈ అన్యాయమైన సస్పెన్షన్లను సవాల్‌ చేసే కార్యక్రమంలో ఆ టీచర్లకు న్యాయపరంగా పూర్తిగా అండగా నిలుస్తాం. వారికి భరోసా ఇస్తాం. అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకూ వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుంది’’.

మీరు చేయలేని పని చేయడానికి వారు ప్రయత్నించడమే తప్పా?
మీ రెడ్‌బుక్‌ అరాచక జంగిల్‌రాజ్‌ చివరకు ప్రభుత్వ టీచర్లనూ వదిలిపెట్టడం లేదు. చంద్రబాబు గారూ అసలు ఈ టెట్‌ నిబంధనను తొలగించాలని కేంద్రాన్ని కోరాల్సింది మీరు కాదా? ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు? మీరు చేయాల్సిన పని చేయలేదు. సీనియర్‌ టీచర్ల సమస్యను గాలికి వదిలేశారు.

తమ సమస్యను మా పార్టీ ఎంపీల సహకారంతో తామే కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే మాత్రం వారిపై రాజకీయ ముద్ర వేస్తారా? సస్పెన్షన్లు విధిస్తారా? మీరు చేయలేని పని వారు చేయడానికి ప్రయత్నించడమే తప్పా? వినతిపత్రం ఇవ్వడమే నేరమా? దానికి సస్పెన్షన్‌ విధిస్తారా? ఒక సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, అదే సమస్యను రాజకీయ కోణంలో చూసి టీచర్లకు రాజకీయాలను అంటగట్టడం దారుణం. మరీ ఇంతగా దిగజారి వ్యవహరిస్తారా? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement