ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి! | CM Chandrababu seeks progress report on the Electricity Department | Sakshi
Sakshi News home page

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

Jun 23 2026 5:52 AM | Updated on Jun 23 2026 5:52 AM

CM Chandrababu seeks progress report on the Electricity Department

విద్యుత్‌ శాఖపై ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఇమ్మని చెప్పిన సీఎం చంద్రబాబు

ఇదిగో ఇచ్చేస్తున్నామని ప్రకటించి.. వెనక్కి తగ్గిన ఇంధన శాఖ మంత్రి 

గడిచిన రెండేళ్లలో రాష్ట్ర ప్రజలపై రూ.20 వేల కోట్లకు పైగా చార్జీల భారం  

రెండేళ్లలో కొత్తగా పెరగని విద్యుదుత్పత్తి 

శ్వేతపత్రంలో ఏం చెప్పాలో తెలియక తలలు పట్టుకున్న అధికారులు 

గత ప్రభుత్వ హయాంలోనే అందుబాటులోకి 1,600 మెగావాట్ల థర్మల్‌  

సాక్షి, అమరావతి :  రెండేళ్లలో అంత చేశాం.. ఇంత చేశాం.. అని భారీగా ప్రచారం చేయాలని భావించి, ఏం చెప్పుకోవాలో తెలియక ఆదిలోనే చతికిల పడింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చాక సాధించిన ప్రగతిపై ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తొలి నివేదిక విద్యుత్‌ శాఖ నుంచి విడుదల చేస్తామన్నారు.  ఆయన చెప్పడమే తడవుగా రెండేళ్ల పాలనలో విద్యుత్‌ రంగ ప్రగతిపై ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఇస్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ మీడియా మొత్తాన్నీ రాష్ట్ర సచివాలయానికి సోమవారం ఆహ్వానించారు. కానీ అక్కడికి వెళ్లిన విలేకరులకు చుక్కెదురైంది.

ఎంత సేపటికీ మంత్రి రాలేదు. ‘అనివార్య కారణాల వల్ల విలేకరుల సమావేశాన్ని రద్దు చేస్తున్నాం’ అంటూ ఓ సంక్షిప్త సందేశాన్ని ప్రభుత్వ అధికారిక వాట్సప్‌ గ్రూపుల్లో పంపించారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. నివేదిక సిద్ధం కానప్పుడు విడుదల చేస్తున్నట్టు ఎందుకు ప్రకటించారు? అందరినీ ఎందుకు పిలిచారు? అని మంత్రి అనుచరులు, విద్యుత్‌ శాఖ అధికారులను మీడియా నిలదీసింది. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అక్కడి నుంచి నిరాశతో వెనుదిరిగింది.

అయితే విద్యుత్‌ శాఖపై ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించినప్పటికీ ఇంధన శాఖ మంత్రి సమావేశాన్ని ఆకస్మికంగా రద్దు చేయడం వెనుక అసలు కారణంపై చర్చ సాగుతోంది. గడిచిన రెండేళ్లలో రాష్ట్ర ప్రజలపై దాదాపు రూ.20 వేల కోట్లకు పైగా అదనపు చార్జీల భారం మోపిన ప్రభుత్వం, విద్యుత్‌ ఉత్పత్తి పెంపులో మాత్రం ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా ప్రారంభించలేకపోయిందన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో చెప్పుకోవడానికి ఏమీ లేదని భావించిన మంత్రి, అధికారులు అనుకూల నివేదికను ఎలా తయారు చేయాలో తెలియక తలలుపట్టుకుంటున్నారని తెలిసింది. శ్వేతపత్రం సిద్ధం కాకపోవడం వల్లనే మంత్రి సమావేశం రద్దయినట్టు సమాచారం.   

అవన్నీ వైఎస్సార్‌సీపీ హయాంలోనే..  
ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్‌ అవసరాలకు అత్యధిక విద్యుత్‌ను అందిస్తున్నాయి ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు. రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌లో దాదాపు 45 శాతం ఏపీజెన్‌కో థర్మల్‌ కేంద్రాల నుంచే సమకూరుతోంది. వీటిలో ప్రధానంగా కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లోని 800 మెగావాట్ల యూనిట్, విజయవాడ వీటీపీఎస్‌లోని మరో 800 మెగావాట్ల యూనిట్‌ ఉన్నాయి. అయితే ఇవి రెండూ గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన ప్రాజెక్టు­లు. వైఎస్సార్‌సీపీ పాలనలోనే మొత్తం 1600 మెగావాట్ల థర్మల్‌ సామర్థ్యం అందుబాటులోకి వచ్చిందనేది వాస్తవం. 

పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో భారీ పెట్టుబడులు, లక్షల ఉద్యోగాల హామీ­లు, లక్షల కోట్ల రూపాయల ఎంఓయూ­లు గత ప్రభుత్వంలోనే విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)లో జరిగాయి. దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు 42 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా సుమారు 1.80 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది.

ఈ ప్రభుత్వం వచ్చాక వాటికే మళ్లీ కొత్తగా ఒప్పందం చేసుకుని తామే ప్రాజెక్టులు తెచ్చామని చెప్పుకునే ప్రయత్నం చేసి ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే అభాసుపాలయ్యారు. కాబట్టి వాటిని మళ్లీ చెప్పుకోలేరు. ఇలా గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో హరిత, థర్మల్‌ విద్యుత్‌ రంగాల్లో నమోదైన ప్రగతి ఒకవైపు కనిపిస్తుండగా, మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే వివిధ రూపాల్లో ప్రజలపై రూ.20 వేల కోట్లకు పైగా భారం పడింది. పోనీ ఉత్పత్తి సామర్థ్య పెంపు లేదా కొత్త ప్రాజెక్టుల పురోగతి ఏమైనా ఉందా అంటే అదీ కనిపించడం లేదు.  

కొత్తగా సాధించిందేమీ లేకే..  
రాష్ట్రంలో రెండేళ్లుగా ఎండ, వాన కాలాలతో సంబంధం లేకుండా అమలు చేస్తున్న అప్రకటిత విద్యుత్‌ కోతలు వినియోగదారుల అసంతృప్తికి కారణమవుతున్నాయి. సరఫరా మెరుగ్గా ఉందని అబద్ధాలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. దీంతో విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, అందులో ప్రస్తావించేందుకు రెండేళ్లలో సాధించిన స్పష్టమైన పురోగతి కనిపించకపోవడం, కొత్త విజయాలు లేకపోవడం అధికారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌పై మంత్రి సమావేశం ఆకస్మికంగా రద్దు కావడం కూడా ఈ నేపథ్యంలో జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపాక, విద్యుత్‌ రంగంలో కొత్తగా సాధించింది ఏమిటనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. విద్యుదుత్పత్తి పెంపు లేకుండా, కొత్త ప్రాజెక్టులు లేకుండా, ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు తేల్చి చెప్పడంతో మంత్రి వెనకడుగు వేసినట్టు తెలిసింది. అయితే యూనిట్‌కు రూ.0.13 పైసలు ట్రూ డౌన్‌ చేశామన్నది హైలైట్‌ చేస్తూ.. విద్యుత్‌ కొనుగోలు ఖర్చులు తగ్గించి ఆర్థికంగా ఆదా చేశామనే అంశాలను ప్రధానంగా చూపించేలా ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ను తయారు చేయాలని మంత్రి, అధికారులకు సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement