
సాక్షి, గుంటూరు: గుంటూరు(guntur) జిల్లాలో కలరా(Cholera) విజృంభిస్తోంది. కలరా కేసులు కలకలం రేపుతున్నాయి. ఏడు కేసులు నమోదు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వారికి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.
వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాలో మరో ఏడుగురికి కలరా సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, గుంటూరులో ఇప్పటికే ముగ్గురికి కలరా సోకగా.. మంగళగిరి, తెనాలి మండలం అంగలకుదురు నుంచి మిగిలిన బాధితులు ఉన్నారు. వీరికి గుంటూరు ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు.
గుంటూరులో డయేరియాతో బాధపడుతూ ఇప్పటికే 114 మంది జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో.. కలరా కేసులు నమోదైన ప్రాంతంతోపాటు డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో 34 సర్వేలైన్స్ బృందాలతో ఇంటింటి సర్వేకు కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. డయేరియా లక్షణాలు ఉన్న వారిని అర్బన్ హెల్త్ సెంటర్‌కు పంపాలని.. అక్కడ సీరియస్‌గా ఉంటే జీజీహెచ్‌కు పంపాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటి వరకూ గుంటూరు నగరంలో 146 డయేరియా కేసులు నమోదైనట్లు అధికారికంగా ప్రకటించారు. నగరంలో కలరా కేసులతోపాటు, 8 ఈ–కోలి కేసులూ నమోదైనట్లు కలెక్టర్ చెప్పారు. వ్యాధుల ప్రభావిత ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు.
సోమవారం వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ గుంటూరు చేరుకుని అధికారులతో సమీక్షించారు. ఇదిలా ఉంటే గుంటూరు నగరంలో డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామని గొప్పగా చెబుతున్న అధికారులు ఎక్కడా అలాంటి ఏర్పాట్లు చేయకపోవడం గమనార్హం. కొన్ని అర్బన్‌హెల్త్ సెంటర్లు మూసివేసి ఉంటున్నాయి. మరికొన్నింట్లో సిబ్బంది ఉన్నా.. డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు కలరా!
తెనాలి మండలం అంగలకుదురుకు చెందిన 33 ఏళ్ల యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. అక్కడ డెంగీ, టైఫాయిడ్ బారిన పడిన ఆమె అక్కడే చికిత్స పొంది ఈనెల 14న స్వగ్రామం వచ్చింది. ఈనెల 18న డయేరియా లక్షణాలతో బాధపడుతూ తెనాలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు వెళ్లగా మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ వైద్యశాలకు వెళ్లాలని వైద్యులు సూచించడంతో తాడేపల్లిలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరింది. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా 19న కలరా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.