సాక్షి, చిత్తూరు జిల్లా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముసలిమడుగు పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. మహిళ కాలిపై నుంచి పవన్ కల్యాణ్ కారు దూసుకెళ్లింది. కనీస మానవత్వం మరిచిన.. పవన్ కల్యాణ్ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. బాధితురాలు హేమలతను స్థానికులు పలమనేరు ప్రభుత్వాసుప్రతికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ తీరుపై పలమనేరు వాసులు మండిపడుతున్నారు.
ఆదివారం.. పలమనేరులో పర్యటించిన పవన్ కళ్యాణ్ కుంకీ క్యాంపును పరిశీలించారు. అయితే, కుంకీల ఆపరేషన్ సర్కస్ ఫీట్లకే పరిమితమైంది. ఇంకా శిక్షణ, ట్రయల్ రన్‌తోనే సాగుతోంది. ఒకపక్క ఏనుగులు భీకర దాడులు చేస్తున్నా కట్టడి చేయలేని పరిస్థితి ఏర్పడింది. చేతికొచ్చిన పంటలు సర్వనాశనమవుతున్నా.. మనుషులను తొక్కి ప్రాణాలు తీస్తున్నా చూస్తూ మిన్నకుండిపోవాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన కుంకీల క్యాప్చరింగ్ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.


