చిత్తూరులో దారుణం.. బాధితురాలిపై పోలీసుల లైంగిక దాడి? | Chittoor Constables Incident On Victim Full Details | Sakshi
Sakshi News home page

చిత్తూరులో దారుణం.. బాధితురాలిపై పోలీసుల లైంగిక దాడి?

Sep 25 2025 10:55 AM | Updated on Sep 25 2025 11:11 AM

Chittoor Constables Incident On Victim Full Details

సాక్షి, పలమనేరు: ప్రజలను కాపాడాల్సిన పోలీసులే నిందితులుగా మారి ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది. పలమనేరు పట్టణంలోని గంటావూరు కాలనీకి చెందిన ఓ మహిళపై కానిస్టేబుల్‌ అడవిలో లైంగికదాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌, హోంగార్డు ప్రస్తుతం పరారీలో ఉండటంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే..
గంటావూరుకు చెందిన ఓ మహిళకు ముగ్గురు పిల్లలున్నారు. భర్త వేధింపులతో ఆమె నాలుగు నెలల క్రితం పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. బాధితురాలు అందంగా ఉందని సీఐ డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డు కిరణ్‌కుమార్‌.. ఆమెపై కన్నేసి ప్లాన్‌ చేశాడు. (కిరణ్‌ ప్రస్తుతం సోమలలో పనిచేస్తున్నాడు) ఫిర్యాదులోని ఫోన్‌ నంబరును తీసుకుని తాను న్యాయం చేస్తానంటూ బాధితురాలికి రాత్రుల్లో ఫోన్‌ చేయడం మొదలు పెట్టాడు. దీంతో బాధితురాలు తనకు తెలిసిన వారి ద్వారా పలమనేరులో పనిచేసే మరో హోంగార్డు ఉమాశంకర్‌కు (ఇప్పుడు పుంగనూరులో విధులు నిర్వహిస్తున్నాడు) తన బాధను తెలుపుకుంది.

దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ కానిస్టేబుల్‌ కూడా నేరుగా బాధితురాలి ఇంటికెళ్లి ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటానంటూ నమ్మబలికాడు. ఆపై అతడు కూడా రాత్రుల్లో ఫోన్‌లు చేయడం మొదలు పెట్టాడు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు దేవుడెరుగు ఆ ఇద్దరి వేధింపులతో ఏం చేయలేని బాధితురాలు తీవ్రంగా మనోవేదన అనుభవించింది.

ఎస్పీని కలిసి న్యాయం చేయాలని..
తనకు జరిగిన అన్యాయంపై స్థానిక పోలీసులు ఎలాగూ న్యాయం చేయరని భావించి తాజాగా జిల్లా ఎస్పీగా వచ్చిన తుషార్‌డూడిని ఇటీవలే కలిసి జరిగిన ఘోరంపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆయన వెంటనే దీనిపై విచారణ చేయాలని పలమనేరు సీఐ మురళీమోహన్‌కు అప్పజెప్పారు. సంఘటన జరిగింది తన పరిధి కాదని బంగారుపాళెం సీఐని కలవాలని ఆయన చెప్పారు. దీంతో బాధితురాలు బంగారుపాళెం సీఐని కలిసింది. ఆ కానిస్టేబుల్‌కు అధికార పార్టీ అండదండలు ఉండడం, నిందితుడు పోలీసు కావడంతో అప్పట్లో ఎఫ్‌ఐఆర్‌ వేయకుండా కాలయాపన చేశారు. ఎస్పీని కలిసినా న్యాయం జరగలేదని ఆవేదన చెందిన బాధితురాలు బుధవారం చిత్తూరులో ప్రెస్‌మీట్‌ పెట్టి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. విషయం మీడియాకు చేరడంతో వెంటనే స్పందించిన పోలీసులు బుధవారమే ఎఫ్‌ఐఆర్‌ వేశారు. 

బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవాలని..
భర్త వదిలేయడం, న్యాయం కోసం వెళ్తే ఇలా లైంగిక వేధింపులతో బతకడం ఇష్టంలేక రెండు నెలల కిందట మొగిలి సమీపంలోని దేవరకొండలో ఆలయం వద్ద ఆత్మహత్య చేసుకుందామని బాధితురాలు నిర్ణయించుకుంది. ఈ సమయంలో కొండపైకి గస్తీ కోసమెళ్లిన బంగారుపాళెం పీఎస్‌కు చెందిన ఇరువురు కానిస్టేబుళ్లు బాధితురాలిని చూసి అడవిలో ఎందుకున్నావని ఆరా తీశారు. తనది పలమనేరని చెప్పగా తెలిసినవారెవరైనా ఉన్నారా అనగానే.. ఆమెను వేధిస్తున్న కానిస్టేబుల్‌ నంబరు ఇచ్చింది.

దీంతో వారు అతడికి కాల్‌ చేయగా ఆమె తనకు తెలుసునని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. దీన్ని అదునుగా భావించిన ఆ కానిస్టేబుల్‌ ఓ కారులో ఇక్కడికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్‌ కాదని సముదాయించి పిల్లలతో పాటు బాధితురాలికి మద్యం కలిపిన కూల్‌డ్రింక్‌ బాటిళ్లను ఇచ్చి వారు మత్తులో ఉండగా పిల్లలను కారులో పడుకోబెట్టి బాధితురాలితో పాటు కొండపైనుంచి కిందికి వస్తూ అడవిలోని మరో దారిలోకి తీసుకెళ్లి అక్కడ బాధితురాలిపై లైంగిక దాడి చేసినట్టు తన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. జరిగిన విషయంపై ఎవరికై నా చెబితే ప్రాణాలతో ఉండరని బెదిరించడంతో బాధితురాలు ఏం చేయలేకపోయింది.

అయితే, బాధితురాలు మీడియా సమావేశానికి ముందే ఎందుకు కేసు నమోదు చేయలేదనే ప్రశ్న ఇప్పుడు అందరిలో వినిపిస్తోంది. పోలీసులకైతే ఓ న్యాయం సామాన్యులకైతే మరో న్యాయమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కొందరు కానిస్టేబుళ్ల కారణంగా మొత్తం పోలీసు వ్యవస్థకే ప్రజల్లో నమ్మకం లేకుండా పోతోంది. దీనిపై జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ అయినా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement