‘మహా’ డ్రామాలో అధికారులు, ఉద్యోగులే సమిధలు | Chandrababu used by govt officials for party programs in Andhra pradesh | Sakshi
Sakshi News home page

‘మహా’ డ్రామాలో అధికారులు, ఉద్యోగులే సమిధలు

May 27 2025 4:06 AM | Updated on May 27 2025 4:06 AM

Chandrababu used by govt officials for party programs in Andhra pradesh

మహానాడు ప్రాంగణానికి బందోబస్తుకు వచ్చిన పోలీసులు

నేటినుంచి కడపలో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు

అడుగడుగునా అధికార దుర్వినియోగం

పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్న చంద్రబాబు

3 రోజులపాటు టీడీపీ సేవలోనే అధికారులు

సాక్షి, అమరావతి: టీడీపీ మహానాడు కోసం అధికార యంత్రాంగాన్ని ఇష్టానుసారం వాడుకుంటున్నారు. రాయలసీమ జిల్లాల్లోని అధికారులతోపాటు వైఎస్సార్‌ జిల్లా ఉద్యోగులను వారం రోజులుగా పూర్తిగా ఈ కార్యక్రమానికే ఉపయోగించుకుంటున్నారు. మంగళవారం నుంచి మూడు రోజులపాటు కడపలో మహానాడును ఆర్భాటంగా నిర్వహించాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో నిర్ణయించడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని అన్ని పనులు చేయించుకుంటున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ముఖ్య నేతలు, శ్రేణుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. వారి కోసం కింది స్థాయిలో పనిచేస్తున్న వీఆర్‌ఓలు, సర్వేయర్లు, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించారు. ఒక్కో ఎమ్మెల్యే దగ్గర ఇద్దరు ఉద్యోగులు మూడు రోజులపాటు ఉంటూ అవసరమైన సదు­పాయాలు కల్పించే ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్‌ జిల్లా యంత్రాంగం మొత్తం ఇదే పనిలో నిమగ్నమై ఉంది. ఈ కార్యక్రమం కోసం మంత్రులు, ముఖ్యనేతలు పది రోజులుగా అక్కడే తిరుగుతుండటంతో అధికారులకు వేరే పని లేకుండాపోయింది. 

18 తీర్మానాలు 
ఈ మహానాడులో 18 తీర్మానాలు చేయనున్నారు. ఏడాదిలో ప్రభుత్వ విజయాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, అమ­రావతి నిర్మాణం, విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు, చంద్రన్న విజన్‌తో సంక్షేమ రాజ్యం, ప్రజాపాలనపై వైఎస్సార్‌సీపీ విష ప్రచారం వంటి తీర్మానాలు అందులో ఉన్నాయి. 18 తీర్మానాల్లో 14 ఏపీకి సంబంధించినవి కాగా.. 4 తెలంగాణవి పెడుతున్నారు. తొలి రోజు పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్‌ ఇచ్చి రెండో రోజు ఎన్నుకోనున్నారు. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా చంద్రబాబును లాంఛనంగా అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. మూడవ రోజు మధ్యాహ్నం బహిరంగ సభ నిర్వహిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement