పరమ పవిత్రం.. శ్రీవారి లడ్డూ ప్రసాదం | Chandrababu TDP coalition govt political conspiracy On TTD Laddu Issue | Sakshi
Sakshi News home page

పరమ పవిత్రం.. శ్రీవారి లడ్డూ ప్రసాదం

Nov 10 2025 6:04 AM | Updated on Nov 10 2025 6:04 AM

Chandrababu TDP coalition govt political conspiracy On TTD Laddu Issue

రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం 

సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం

అవాస్తవ ఆరోపణలతో ఎల్లో మీడియా రాద్ధాంతం 

చిన్న అప్పన్న వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదు.. ఏపీ భవన్‌ ఉద్యోగి ఫిర్యాదు వస్తే విచారణకు ఆదేశించడం కూడా తప్పేనా? 

భోలే బాబా డెయిరీ పాల సేకరణపై పరస్పర భిన్న కథనాలు 

సిట్‌ దర్యాప్తు పేరుతో ఎల్లో మీడియా కట్టు కథలు

నేటి మంత్రి కొలుసు, టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి నాటి టీటీడీ బోర్డులో సభ్యులే 

భక్తుల మనోభావాలు దెబ్బ తీస్తున్న కూటమి ప్రభుత్వం 

లడ్డూ ప్రసాదం కోసం కల్తీ నెయ్యి వాడలేదని తేల్చి చెప్పిన టీటీడీ ఈవో 

అందుకు విరుద్ధంగా చంద్రబాబు అవాస్తవ ఆరోపణలు 

నెయ్యి, ఇతర సరుకుల కొనుగోలుకు టీటీడీలో పటిష్ట వ్యవస్థ.. శతాబ్దాలుగా కొనసాగుతున్న పవిత్రత పరంపర 

వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా నెయ్యి కొనుగోలు.. ఐదేళ్లలో ఒక్క రోజూ లడ్డూ నాణ్యతపై ఫిర్యాదు చేయని భక్తులు 

ఎన్నికల మేనిఫెస్టో అమలులో కూటమి ప్రభుత్వం విఫలం.. అందుకే డైవర్షన్‌ డ్రామాలో భాగంగా లడ్డూ ప్రసాదంపై కుట్ర

సాక్షి, అమరావతి: రాజకీయ కుట్ర కోసం ఎంతకైనా దిగజారుతామని టీడీపీ కూటమి ప్రభుత్వం పదేపదే నిస్సిగ్గుగా ప్రకటిస్తోంది. అందుకోసం ఏకంగా శ్రీవారి దివ్య క్షేత్రమైన తిరుమల పవిత్రత, లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యంపై దుష్ప్రచారం చేసేందుకు కూడా తెగిస్తామని నిరూపిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్‌ రాజకీయాలతో లడ్డూ ప్రసాదం పవిత్రతకు కళంకం తెచ్చేందుకు తెగబడుతోంది. ఆ పక్కా కుట్రలో భాగంగానే సిట్‌ నివేదిక పేరుతో ఎల్లో మీడియా ద్వారా మరోసారి విషం చిమ్ముతోంది. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిపై అవాస్తవ ఆరోపణలతో అసత్య కథనాలు వండి వారుస్తోంది. రాజకీయాలకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని దూరంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు సూచనను కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తూ దుష్ప్రచారానికి బరితెగిస్తోంది. శతబ్దాలుగా కొనసాగుతున్న లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగిస్తూ తమ మనోభావాలను దెబ్బ తీస్తున్న ఎల్లో మీడియాపై ప్రపంచ వ్యాప్తంగా తిరుమల శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. అందుకే ఈ వ్యవహారంలో ఎల్లో మీడియా కుతంత్రాలను తిప్పికొడుతూ అసలు వాస్తవాలను “సాక్షి’ ప్రజల ముందు ఉంచుతోంది.

చిన్న అప్పన్న ఏపీ భవన్‌ ఉద్యోగి
తిరుమల లడ్డూ ప్రసాదం ముసుగులో రాజకీయ కుట్ర కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్నను టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ దుష్ప్రచారం చేస్తోంది. తద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లాలన్నదే కూటమి ప్రభుత్వ కుట్ర. ఏపీ భవన్‌లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్న గతంలో ప్రస్తుత టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పీఏగా పని చేశారు. 

ఆ వాస్తవాన్ని మాత్రం టీడీపీ కూటమి ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు యత్నిస్తుండటం గమనార్హం. చిరుద్యోగి అయిన ఆయన ఏకంగా టీటీడీ జీఎం స్థాయి ఉన్నతాధికారుల్ని ప్రభావితం చేశారని కట్టుకథలు అల్లుతోంది. ఆయన వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన ఆస్తుల ఉదంతాన్ని వక్రీకరిస్తోంది. వాటి ఆధారంగా చిన్న అప్పన్నను బెదిరించి, వేధించి తమకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇప్పించాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రమన్నది స్పష్టమవుతోంది. 

ఫిర్యాదుపై విచారణకు ఆదేశించడం కూడా తప్పేనా!? 
నెయ్యి నాణ్యతపై ఫిర్యాదు రావడంతో టీటీడీ చైర్మన్‌ హోదాలో వైవీ సుబ్బారెడ్డి విచారణకు ఆదేశించడం తప్పన్నట్టుగా పోలీసులు వక్రీకరిస్తుండటం గమనార్హం. ఓ అనాకమ ఫిర్యాదు వస్తే బోలే బాబా డెయిరీ సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను మైసూర్‌లోని సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు నిర్వహించాలని ఆయన ఆదేశించినట్టు పోలీసులు తమ నివేదికలో పేర్కొనడం గమనార్హం. మామూలుగా ఫిర్యాదు వస్తే విచారణకు ఆదేశించకపోతే పట్టించుకోలేదని విమర్శిస్తారు.. విచారణకు ఆదేశిస్తే ఎందుకు ఆదేశించారని ఈనాడు, ఇతర టీడీపీ ఎల్లో మీడియా తిరిగి ప్రశ్నిస్తుండటం విస్మయ పరుస్తోంది. టీడీపీ రాజకీయ కుట్రలో భాగంగా కేవలం విష ప్రచారం చేయాలన్న కుట్రే తప్ప, వాస్తవాలతో తమకు నిమిత్తం లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది.


చైర్మనే సర్వస్వం కాదు.. టీటీడీ బోర్డు ఉంటుంది 
ఇక రాజకీయ కుతంత్రంతో కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా టీటీడీ వ్యవస్థాగత నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు. తిరుమల–తిరుపతి వ్యవహారాలకు టీటీడీ చైర్మనే సర్వస్వం, సర్వాధికారి కాదు. టీటీడీ బోర్డుదే అత్యున్నత అధికారం. ఆ బోర్డులో సభ్యులు చర్చించి తీసుకున్న నిర్ణయాలనే టీటీడీ అమలు చేస్తుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఖరారు నిర్ణయాన్ని కూడా అదే రీతిలో బోర్డు తీసుకుంది. 

ఎల్లో మీడియా ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్న మరో విషయం ఏమిటంటే.. నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆమోదించిన ఆనాటి టీటీడీ బోర్డులో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కూడా సభ్యులుగా ఉన్నారు. టీటీడీ పర్చేజ్‌ కమిటీలో కూడా సభ్యులుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టుపై నిర్ణయాన్ని బోర్డుకు సిఫార్సు చేసింది కూడా వారే కావడం గమనార్హం. 

భోలే బాబా డెయిరీ పాల సేకరణపై భిన్న కథనాలు
పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ కూటమి ప్రభుత్వం కనికట్టు చేసేందుకు యత్నిస్తోంది. ఈ కేసుకు సంబంధించి భోలే బాబా డెయిరీ గురించి ప్రభుత్వం, ఎల్లో మీడియా పరస్పర విరుద్ధ వాదనలు వినిపిస్తుండటమే అందుకు తార్కాణం. భోలే బాబా డెయిరీ రైతుల నుంచి ఒక్క పాల చుక్క కూడా సేకరించకుండా టీటీడీ నుంచి రూ.240 కోట్ల నెయ్యి కాంట్రాక్టు పొందిందని సిట్‌ దర్యాప్తులో వెల్లడైనట్టు ఎల్లో మీడియా తన కథనంలో పేర్కొంది. మళ్లీ భోలే బాబా డెయిరీ ఉత్తర్‌ప్రదేశ్‌లో 60 వేల మంది పాడి రైతుల నుంచి పాలు సేకరించి, పాల ఉత్పత్తులు తయారు చేస్తోందని అదే కథనంలో పేర్కొనడం గమనార్హం. మరి ఆ డెయిరీ పాలు సేకరిస్తున్నట్టా.. సేకరించనట్టా? రెండూ ఎల్లో మీడియానే 
చెబుతుంటే అందులో ఏది వాస్తవం!?

నందిని డెయిరీని తప్పించింది చంద్రబాబు ప్రభుత్వమే
కర్ణాటక సహకార రంగంలోని నందిని డెయిరీ దశాబ్ద కాలం పాటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. ఆ పరంపరను 2015లో చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుంది. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు కోసం నందిని డెయిరీతోపాటు పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం నందిని డెయిరీని కాదని మహారాష్ట్రకు చెందిన ప్రైవేటు రంగంలోని గోవింద్‌ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చింది. దీనిపై అప్పట్లోనే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తినా, చంద్రబాబు ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. 

అంటే నందిని డెయిరీని తొలిసారిగా పక్కన పెట్టేసి మరో ప్రైవేటు డెయిరీకి కాంట్రాక్టు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనన్నది సుస్పష్టం. ఇక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కోసం టీటీడీ నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నందిని డెయిరీ అసలు పాల్గొన లేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తాము కోట్‌ చేసిన ధరకు కాంట్రాక్టు ఇవ్వ లేదు కాబట్టి.. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులో పాల్గొనమని చెప్పింది. 

వాస్తవాలు అలా ఉంటే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నందిని డెయిరీకి ఎందుకు కాంట్రాక్టు ఇవ్వలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. అసలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియలో పాల్గొనని నందిని డెయిరీకి ఎలా కాంట్రాక్టు ఇస్తారు? ఇస్తే అసలు టెండరు వేయని డెయిరీకి ఎలా కాంట్రాక్టు ఇచ్చారని అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ప్రశ్నించేది కాదా? టెండరులో పాల్గొన్న ఇతర డెయిరీలు కూడా అభ్యంతరం తెలుపుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించేవి కదా! 

టీడీపీ వీరవిధేయ సిట్‌తో కుతంత్రం
నెయ్యి వివాదాన్ని టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని కూటమి ప్రభుత్వం యత్నించింది. అందుకే ఈ ఆరోపణలపై దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో గత ఏడాది హడావిడిగా సిట్‌ను ఏర్పాటు చేసింది. 2024 ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పని చేసిన గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్‌ ఇన్‌చార్జ్‌గా నియమించింది. అప్పటి విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ, కడప ఎస్పీ హర్షవర్దన్‌ రాజులను సభ్యులుగా నియమించారు. గోపీనాథ్‌ జెట్టి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కృష్ణయ్య అల్లుడు. 

రిటైరైన తర్వాత కొన్నేళ్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన కృష్ణయ్యను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్‌గా నియమించారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ పదవి కట్టబెట్టడం గమనార్హం. సిట్‌ను ఏర్పాటు చేసిన తర్వాత.. నెయ్యిలో కల్తీపై టీటీడీ ద్వారా తిరుపతిలోని ఈస్ట్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయించడం గమనార్హం. ఆ ఫిర్యాదు చేసే ముందు రోజు రాత్రే తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐని బదిలీ చేసి, ఆ స్థానంలో టీడీపీకి అనుకూల పోలీసు అధికారిని నియమించడం ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. 

సుప్రీం కొరడా.. సిట్‌ క్లోజ్‌
ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సీఎం హోదాలో ఉండి లడ్డూ ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటని చంద్రబాబును ప్రశ్నించింది. కనీసం దేవుడిని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచండని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లడ్డూ ప్రసాదం అంశంపై సిట్‌ దర్యాప్తు సరిపోతుందా.. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా.. అన్నది ఆలోచిస్తామని తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు ప్రభుత్వం తిరుపతిలో దర్యాప్తు నిర్వహిస్తున్న సిట్‌ కార్యకలాపాలను తక్షణం నిలిపి వేసింది. అనంతరం సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర బృందం దర్యాప్తు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశం చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని పరిశీలకులు స్పష్టం చేశారు.

డైవర్షన్‌ డ్రామా కోసం తిరుమల పవిత్రతపై దుష్ప్రచారం
ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్‌ డ్రామాలో భాగంగానే కల్తీ నెయ్యి అంటూ రాద్ధాంతం చేస్తోంది. అందుకోసం ఏకంగా తిరుమల ఆలయ పవిత్రతకు భంగం కలిగించేందుకు బరితెగిస్తోంది. గత ఏడాది బుడమేరుకు భారీ వరద వస్తుందని నిపుణులు ముందే హెచ్చరించినా, కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడ లేదు. దాంతో భారీ వరద విజయవాడను ముంచెత్తి అతలాకుతలం చేసింది. 

తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిపై దుష్ప్రచారానికి తెగబడింది. కూటమి నేతలు, ఎల్లో మీడియా పక్కా పన్నాగంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసేందుకు ఏమాత్రం వెనుకాడ లేదు. కానీ టీడీపీ కూటమి నేతల కుట్రను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు అధికారిక ప్రకటనే తిప్పికొట్టింది. ఆ వ్యవహారం ఇలా సాగింది.

2024 జులై 23
వనస్పతి కలిసింది.. ట్యాంకర్లు వెనక్కి పంపాం 
నెయ్యిలో కల్తీ జరిగిందని శాంపిల్స్‌ పరీక్షల్లో తేలింది. వెజిటబుల్‌ ఫ్యాట్‌ అంటే వనస్పతి కలిసిందని వెల్లడైంది. దాంతో కాంట్రాక్టరును బ్లాక్‌ లిస్ట్‌ పెట్టి షోకాజ్‌ నోటీసు ఇచ్చాం. ఆ సంస్థ సరఫరా చేసిన ట్యాంకర్లను వెనక్కి పంపాం. ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదం కోసం వినియోగించనే లేదు.     – టీటీడీ ఈవో శ్యామలరావు

2024 సెప్టెంబర్‌ 18 
నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారు : చంద్రబాబు
టీటీడీ ఈవో అధికారిక ప్రకటనలకు విరుద్ధంగా లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారు. 

సెప్టెంబర్‌ 22
నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపాం : టీటీడీ ఈవో
అయినా సరే చంద్రబాబు ఆరోపణలను టీటీడీ ఈవో శ్యామలరావు తిప్పికొట్టారు. నమూనాలను పరీక్షించాక అది కల్తీ నెయ్యి అని తేలడంతో ఆ డెయిరీ పంపిన నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపాం. ఆ డెయిరీ నుంచి నెయ్యి సరఫరాను నిలిపి వేశామని తెలిపారు.

సెప్టెంబరు 22 
ఆ నెయ్యి వాడారు : చంద్రబాబు
అయినా సరే చంద్రబాబు తన దుష్ప్రచారాన్ని కొనసాగించారు. నాలుగు ట్యాంకర్లు అప్పటికే వచ్చేశాయి. అందులోని కల్తీ నెయ్యిని వాడారని మళ్లీ దుష్ప్రచారం చేయడం గమనార్హం. అంటే వాస్తవాలతో తనకు నిమిత్తం లేదని, రాజకీయ ప్రయోజనం కోసం తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీసేందుకు వెనుకాడనని నిరూపించారు.

    ఇంతటితో ఆగకుండా, టీడీపీ కూటమి ప్రభుత్వం తన డర్టీ పాలిటిక్స్‌కు మరింత పదును పెట్టింది. 2024 సెప్టెంబర్‌ 18న తిరుమల లడ్డూపై ఆరోపణలు చేస్తే.. ఆ మర్నాడే అంటే సెప్టెంబర్‌ 19న ఎన్‌డీడీబీ నివేదికను టీడీపీ ప్రధాన కార్యాలయం విడుదల చేసింది. వాస్తవానికి ఎన్‌డీడీబీ నివేదికను గోప్యంగా ఉంచాలి. 
కానీ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ టీడీపీ కార్యాలయం ఆ నివేదికను విడుదల చేయడం గమనార్హం.

సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు కోరిన వైవీ సుబ్బారెడ్డి
తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ కూటమి ప్రభుత్వ దుష్ప్రచారంపై వైవీ సుబ్బారెడ్డి సత్వరం స్పందించారు. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్‌ ఏర్పాటు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని అభ్యర్థించారు. బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు కోరినందునే వైవీ సుబ్బారెడ్డిపై కూటమి ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోంది. అందుకే ఆయనకు వ్యతిరేకంగా ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తోంది.

టీటీడీలో నెయ్యి కొనుగోలుకు పటిష్ట వ్యవస్థ
రాజకీయ ప్రయోజనాల కోసం లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ ఏకైక లక్ష్యంగా మారింది. కానీ నెయ్యి, ఇతర సరుకులు కొనుగోలు చేసేందుకు టీటీడీలో దశాబ్దాలుగా పటిష్ట వ్యవస్థ ఉందనే వాస్తవాన్ని ఉద్దేశ పూర్వకంగా 
విస్మరిస్తోంది. నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేసేందుకు టీటీడీ పటిష్ట విధానం అనుసరిస్తోంది.

⇒ లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం టీటీడీ ప్రతి ఆరు నెలలకోసారి టెండర్లు పిలుస్తుంది. టెండర్లు కోట్‌ చేసిన వాటిలో ఎల్‌1గా వచ్చిన డెయిరీని టీటీడీ బోర్డు ఆమోదిస్తుంది. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నియమ నిబంధనలను ఎవరూ మార్చేందుకు ఏమాత్రం అవకాశమే లేదు.

⇒ లడ్డూ తయారీకి నెయ్యి ఎవరు సరఫరా చేసినా.. వారు పంపించిన నెయ్యి ట్యాంకర్‌తో పాటు, నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌ ల్యాబరేటరీస్‌ (ఎన్‌ఏబీఎల్‌) గుర్తించిన ల్యాబ్‌ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్‌ను కూడా సమర్పించాలి.

⇒ అలా ట్యాంకర్‌ నుంచి తిరుపతిలోనే మూడు శాంపిల్స్‌ తీసి మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్‌ అయితేనే ఆ నెయ్యిని టీటీడీ లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తారు. శాంపిల్స్‌ పరీక్షల్లో నాణ్యత లేదని తేలితే వెంటనే ఆ ట్యాంకర్లను తిరుపతిలోని అలిపిరి నుంచే వెనక్కు పంపుతారు. తిరుమల కొండ కూడా ఎక్కనివ్వరు.

⇒ తగిన నాణ్యతతో లేని నెయ్యిని చాలాసార్లు వెనక్కి పంపారు. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో 15 సార్లు, 2019­–24లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హాయంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపారని టీటీడీ రికార్డులే వెల్లడిస్తున్న వాస్తవం.

ప్రస్తుత నెయ్యి వివాదం టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనిదే 
ప్రస్తుతం కల్తీ అంటూ చేçస్తున్న రాద్ధాంతానికి కేంద్ర బిందువుగా ఉన్న నెయ్యి శాంపిల్స్‌ ఎప్పుడు తీసుకున్నవో తెలుసా..? 2024 జూన్‌ 12న తీసిన శాంపిల్స్‌ అవి. 2024 జూన్‌ 4నే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీడీపీ కూటమి గెలిచిందన్నది తేలి పోయింది. జూన్‌ 12నే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మూడు టెస్టుల నివేదికల్లో నెయ్యి తగిన నాణ్యతతో లేదని తేలడంతో ఆ శాంపిల్స్‌ను జూలై 17న ఎన్డీడీబీ బోర్డుకు పంపారు. ఎన్డీడీబీ బోర్డు 2024 జూలై 23న నివేదిక ఇచ్చింది. అంటే మొత్తం వ్యవహారం అంతా టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనే సాగిందన్నది సుస్పష్టం.

జంతువుల కొవ్వు కలిసిందని ఎన్‌డీడీబీ చెప్పనే లేదు 
నెయ్యి కల్తీ జరిగిందని మాత్రమే ఎన్‌డీడీబీ నివేదిక వెల్లడించగలదు. కానీ, ఆ కల్తీ జంతువుల కొవ్వు కలపడంతో జరిగిందని నిరూపించే అవకాశమే లేదని ఆహార శాస్త్రవేత్త నేహా దీపక్‌ షా స్పష్టం చేశారు. సోయాబీన్, పొద్దు తిరుగుడు పువ్వు, రేపీడ్స్, గోధుమ జెర్మ్, మొక్కజొన్న జెర్మ్, పత్తి విత్తనాలు, కొబ్బరి, పామ్‌ ఆయిల్‌ ద్వారా కూడా కల్తీ చేసే అవకాశాలున్నాయి. 

సాధారణంగా నెయ్యిలో కల్తీ చేయాలంటే వ్యాపారులు పామాయిల్, హైడ్రోజనేటెడ్‌ కూరగాయల కొవ్వును కలుపుతూ ఉంటారని ఆహార శాస్త్రవేత్తలు చెప్పారు. ఎందుకంటే అవి అయితేనే తక్కువ వ్యయంతో కల్తీ చేయవచ్చన్నారు. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎటువంటి కల్తీ చేశారన్నది ఎన్‌డీడీబీ నివేదికలో స్పష్టం చేయనే లేదు. కానీ చంద్రబాబు, ఆయన ముఠా సభ్యులు మాత్రం టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతవుల కొవ్వు కలిపారని రాద్ధాంతం చేయడం కేవలం రాజకీయ కుట్రేనన్నది సుస్పష్టం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement