‘గ్రీన్‌’ ప్రాజెక్టులకు వైఎస్‌ జగన్‌ రెడ్‌ కార్పెట్‌ | Chandrababu Stealing YS Jagan Credit | Sakshi
Sakshi News home page

‘గ్రీన్‌’ ప్రాజెక్టులకు వైఎస్‌ జగన్‌ రెడ్‌ కార్పెట్‌

Jan 18 2026 5:02 AM | Updated on Jan 18 2026 6:07 AM

Chandrababu Stealing YS Jagan Credit

జగన్‌ తెచ్చిన కంపెనీలతో మళ్లీ ఒప్పందాలు కుదుర్చుకుంటూ చంద్రబాబు క్రెడిట్‌ చోరీ.. రెన్యూ పవర్, గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగింది వైఎస్‌ జగన్‌ హయాంలోనే.. 

గత ప్రభుత్వంలోనే క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీలో భేష్‌ అనిపించుకున్న ఏపీ.. 10–15 బిలియన్‌ డాలర్ల గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాపారం చేయొచ్చని అంచనా.. అందుకు తగ్గట్టుగా పాలసీ రూపకల్పన

రూ.1.10 లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిన సంస్థలు

సాక్షి, అమరావతి: స్వచ్ఛ ఇంధనంగా పిలిచే గ్రీన్‌ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమంగా నిలిపింది. పునరుత్పాదక విద్యుత్‌తో పాటు ఇంధన సామర్థ్యం, విద్యుత్‌ పొదుపు, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో మన రాష్ట్రం వైఎస్సార్‌సీపీ పాలనలోనే అగ్రస్థానంలో దూసుకెళ్లిందనడానికి జాతీయ నివేదికలు సాక్ష్యంగా నిలిచాయి. నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ (పీఎస్పీ) ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి గ్రీన్‌ ఎనర్జీ పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా చేసిన పాలసీలే ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి మార్గదర్శకాలయ్యాయి. కానీ, ఇప్పుడు తామే పీఎస్పీలను కనిపెట్టినట్టు, గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులను తెస్తున్నట్టు పాత ఒప్పందాలనే మళ్లీ చేసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్‌ చోరీకి పాల్పడుతోంది.  

తామే తెస్తున్నట్టు బిల్డప్‌ 
రెన్యూ పవర్‌ని గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి గెంటేసిందని, తామే ఆ సంస్థ నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నామని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు వల్లె వేశారు. నిజానికి.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విశాఖలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో రెన్యూ పవర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాక.. రెన్యూ సంస్థ ప్రాజెక్టులకు అవసరమైన భూములు విశాఖ, కాకినాడ జిల్లాల్లో కేటాయించేందుకు కూడా అప్పుడే స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ (ఎస్‌ఐపీబీ) అంగీకారం తెలిపింది.

2023 జూన్‌ 20న ఒక జీఓ, 2024 ఫిబ్రవరి 5న మరో జీఓను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. కానీ.. విచిత్రంగా వైఎస్‌ జగన్‌ తెచ్చిన అదే రెన్యూ కంపెనీతో వైజాగ్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో చంద్రబాబు సర్కారు మళ్లీ ఒప్పందం కుదుర్చుకుంది. అదేవిధంగా.. గ్రీన్‌కోకు చెందిన ఏఎం గ్రీన్‌ ఆధ్వర్యంలో 2023 ఫిబ్రవరి 7న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలోనే ఒప్పందం జరిగింది. తాజాగా.. దీనిని కూడా తండ్రీ కొడుకులు క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారు.

పాలసీలకు అప్పుడే రూపకల్పన 
గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం కోసం ఐదేళ్లలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఏపీ రెన్యూవబుల్‌ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ–2020, ఏపీ పంప్డ్‌ స్టోరేజీ ప్రమోషన్‌ పాలసీ–2022, ఏపీ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ గ్రీన్‌ అమ్మోనియా ప్రమోషన్‌ పాలసీ–2023లను తీసుకొచ్చింది. ఈ చర్యలతో పునరుత్పాదక ఇంధన పరిరక్షణలో ఏకంగా రాష్ట్రపతి చేతుల మీదుగా వరుసగా రెండేళ్లు అవార్డులు సైతం దక్కించుకుంది.

ఏపీ ట్రాన్స్‌కోకు ‘టాప్‌ స్టేట్‌ యుటిలిటీ ఫర్‌ ఎనర్జీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ అవార్డు, దేశంలోనే ఉత్తమ టాప్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ నోడల్‌ ఏజెన్సీగా నెడ్‌క్యాప్‌కు అవార్డు, రెన్యూవబుల్‌ పవర్‌ పర్చేజ్‌ ఆబ్లిగేషన్స్‌ను చేరుకున్న ఉత్తమ రాష్ట్రంగా మరో అవార్డు రాష్ట్రానికి లభించాయి. వైజాగ్‌లో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో, గ్రీన్‌ హైడ్రోజన్, బయో డీజిల్, కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ (సీబీజీ) ప్రాజెక్టుల కోసం 42 ఇంధన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. 

గ్రీన్‌ హైడ్రోజన్‌కు అనుకూలంగా.. 
గ్రీన్‌ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌ (బీఈఎస్‌ఎస్‌) వంటి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రం అప్పుడే అందిపుచ్చుకుంది. రాష్ట్రంలో 10 నుంచి 15 బిలియన్‌ డాలర్ల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశాలు ఉన్నాయని ఇంధన శాఖ గత ప్రభుత్వ హయాంలోనే అంచనా వేసింది. ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను ఎగుమతి చేయడానికి, రాష్ట్ర అవసరాల కోసం గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రం అనుకూలంగా ఉంది. ఇక్కడ ఏటా 400 కిలో టన్నుల దేశీయ హైడ్రోజన్‌ డిమాండ్‌ ఉంది. 2030 నాటికి కనీసం 500 కిలో టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం.

ఇందుకోసం యాక్సిలరేటింగ్‌ స్మార్ట్‌ పవర్‌ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ఇన్‌ ఇండియా (ఆసై్పర్‌) ప్రోగ్రాం కింద ఫారిన్, కామన్వెల్త్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీస్‌ సాయంతో ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశాల నివేదికను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఫలితంగా ఏపీలో కేంద్ర సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. విశాఖలో దాదాపు 1,200 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎనీ్టపీసీ ముందుకొచ్చి గత ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. 1,200 ఎకరాల్లో రోజుకి 1,200 టన్నుల హైడ్రోజన్‌ ఉత్పత్తి సామర్థ్యంతో రూ.1.10 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ హబ్‌ ఏర్పాటు చేయడానికి ఎనీ్టపీసీ సంసిద్ధత వ్యక్తం చేసింది.

టాప్‌–5లో ఏపీని నిలిపిన జగన్‌
కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘ఎనర్జీ స్టాటిస్టిక్స్‌ ఇండియా–2025’  నివేదిక ప్రకారం.. 2024 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 21,09,655 మెగావాట్లుగా అంచనా. ఇందులో సగానికి పైగా నాలుగు రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇందులో 7.9 శాతంతో ఏపీ 5వ స్థానంలో నిలిచింది. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎనర్జీ ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ అనాలసిస్, ఎంబర్‌ సంస్థల 2018–24 నివేదిక కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళల్లో ఐదు జాతీయ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఏపీకి దక్కిన అరుదైన గుర్తింపు. ఈ హబ్‌లను 25 గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు క్లస్టర్లుగా విభజించి గ్రీన్‌ హైడ్రోజన్‌ను వివిధ రంగాలకు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించింది.

గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌కు ఎన్‌ఎఫ్‌సీఎల్‌ శ్రీకారం 
1.5 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యం 
సాక్షి ప్రతినిధి, కాకినాడ:  కాకినాడలోని నాగార్జున ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎఫ్‌సీఎల్‌)లో ఏఎం గ్రీన్‌ హైడ్రోజన్, అమ్మోనియా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ శనివారం శంకుస్థాపన చేశారు. ప్లాంట్‌ లక్ష్యాలను ఏఎం ప్రతినిధులు కొల్లి మహేష్ , చలమలశెట్టి అనిల్‌ వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 2027 జూన్‌ నాటికి 1.5 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. కాకినాడ నుంచి గ్రీన్‌ అమ్మోనియాను జర్మనీకి ఎగుమతి చేస్తారన్నారు. గతంలో గ్రే అమ్మోనియా తయారీని నాగార్జున ఫెర్టిలైజర్స్‌ చేపట్టిందన్నారు.

అదే ప్రాంతంలో పర్యావరణ హితంగా గ్రీన్‌ అమ్మోనియా తయారవుతుందన్నారు. పర్యావరణ సమతుల్యత సాధించడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 500 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారని, ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో 160 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ తయారీని లక్ష్యంగా నిర్దేశించుకున్నారని చెప్పారు. సౌర, పవన, జలవిద్యుత్, పంప్డ్‌ స్టోరేజ్‌ వంటి విద్యుత్‌ ఉత్పత్తికి గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తులకు అనుకూలంగా రాష్ట్రం మారుతుందన్నారు. అలాగే గ్రీన్‌ అమ్మోనియా ప్రకృతి సేద్యానికి దోహదపడుతుందన్నారు.

రాష్ట్రంలో విద్యుత్‌ కొనుగోలు భారాన్ని యూనిట్‌కు రూ.1.19 మేర తగ్గించేందుకు ప్రయతి్నస్తున్నామని తెలిపారు. వచ్చే 6 నెలల్లో అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సేవలు ప్రారంభమవుతాయని సీఎం చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీలు ఉదయ్‌ శ్రీనివాస్, సానా సతీష్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement