
తక్షణమే సీఆర్డీఏ ఖాతాలో జమచేయాలని
ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో ఆదేశం
దీంతో రూ.245.37 కోట్లను విడతల వారీగా సర్కారు జమ
ఇంకా రూ.745.69 కోట్లు జమచేయని ప్రభుత్వం
పోలవరం నిధులూ ఇదే తరహాలో పక్కదారి
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు), హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) నుంచి తెచ్చిన అప్పులో రూ.991.06 కోట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. ఈ నిధులను రాజధాని నిర్మాణ పనుల కోసం అప్పుగా ఇచ్చామని.. వాటిని నిర్మాణ పనులకే వ్యయం చేయాలని.. ఇతర పనులకు మళ్లించకూడదని ఆ బ్యాంకులు ముందే షరతులు విధించాయి.
ఇదే అంశాన్ని గుర్తుచేస్తూ మళ్లించిన నిధులను తక్షణమే సీఆర్డీఏ ఖాతాలో జమచేయాలని కమిషనర్ కె. కన్నబాబును ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో అధికారులు ఆదేశించారు. ఇదే అంశాన్ని ఆయన ఆరి్థక శాఖకు చెబుతూ వస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ విడతల వారీగా రూ.245.37 కోట్లను ప్రభుత్వం జమచేసింది. ఇంకా రూ.745.69 కోట్లను జమచేయలేదు.
‘పోలవరం’ నిధులు కూడా..
ఇలా రాజధాని నిర్మాణం కోసం అప్పుతెచ్చిన నిధులనే కాదు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను కూడా ఎస్‌ఎన్‌ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమచేయకుండా ప్రభుత్వం ఇదే రీతిలో ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. గత అక్టోబరు 9న పోలవరం ప్రాజెక్టుకు తొలివిడత అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,348 కోట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లించేసింది.
ఇది తెలిసి కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తంచేయడంతో చివరికి జనవరి రెండో వారంలో వాటిని ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో ప్రభుత్వం జమచేసింది. దాంతో నిర్వాసితులకు పరిహారం, చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు, సేకరించిన భూమికి పరిహారం పంపిణీ చేశారు.
అలాగే, మార్చి 12న పోలవరం ప్రాజెక్టుకు రెండో విడతగా కేంద్రం విడుదల చేసిన అడ్వాన్సులో రూ.2,704.81 కోట్లలో రూ.2,504.81 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఇతర అవసరాలకు పక్కదారి పట్టించింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, సేకరించాల్సిన భూమికి పరిహారం, చేసిన పనులకు బిల్లులు చెల్లించడానికి మాత్రమే వినియోగించాల్సిన అడ్వాన్సు నిధులను మళ్లీ దారి మళ్లించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.