‘అసైన్డ్‌’పై ఎమ్మెల్యేలదే పెత్తనం | Chandrababu Naidu coalition govt surprising decision On assigned lands | Sakshi
Sakshi News home page

‘అసైన్డ్‌’పై ఎమ్మెల్యేలదే పెత్తనం

Jun 24 2026 5:03 AM | Updated on Jun 24 2026 5:03 AM

Chandrababu Naidu coalition govt surprising decision On assigned lands

చంద్రబాబు కూటమి సర్కారు విస్మయకర నిర్ణయం

ఇప్పటికే ఇసుక, మట్టి, మద్యం ద్వారా దండుకునేందుకు దారులు చూపిన వైనం

తాజాగా అసైన్డ్‌ భూములు కొల్లకొట్టడమే లక్ష్యం 

ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన జిల్లా అసైన్డ్‌ కమిటీలు రద్దు 

నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల అధ్యక్షతన అసైన్డ్‌ కమిటీలు

తమ అనుచరులు, అనుయాయులకు అసైన్డ్‌ భూములు కట్టబెట్టేందుకే.. 

నియోజకవర్గాల వారీగా అసైన్డ్‌ భూమి అనేది లేకుండా ఇక స్వాహా చేయడమే లక్ష్యం 

ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధి కుదింపు 

రామాయపట్నం పోర్టు అభివృద్ధి, నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు ప్రైవేట్‌కు.. 

2022 నుంచి వర్తించేలా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62కు పెంపు 

విశాఖ, గన్నవరం విమానాశ్రయాల్లో బార్లు, మద్యం దుకాణాలకు అనుమతి 

2004కు ముందు నోటిఫికేషన్‌ ద్వారా నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్‌  

పలు సంస్థలకు రాయితీలు, భూముల కేటాయింపులు, మినహాయింపులు 

కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పార్థసారధి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో  అసైన్డ్‌ భూములను కొల్లగొట్టడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం కొత్త దుకాణానికి తెరతీసింది. ఇప్పటికే నియోజకవర్గాలు, మం­డలాల నేత­లకు ఇసుక, మట్టి, మద్యం ద్వారా అడ్డగోలుగా దోచుకునేందుకు దారులు చూపిన ప్రభుత్వం.. తాజాగా అసైన్డ్‌ భూ­ములను సైతం పందేరం చేయడానికి సరికొత్త ఎత్తుగడ వేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన గల అసైన్డ్‌ కమిటీలను రద్దు చేసి, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల అధ్యక్షతన అసైన్డ్‌ కమిటీల ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అసైన్డ్‌ కమిటీలకు ఎమ్మెల్యేలను అధ్యక్షులుగా ఉంచేలా కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి పార్థసారథి మీడియాకు తెలిపారు. నియోజకవర్గాల వారీగా అసైన్డ్‌ భూములే లేకుండా మొత్తం భూములను తమ అనుచరులు, అనుయాయులకు కట్టబెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

ఎమ్మెల్యేలే ఇష్టానుసారంగా వారికి నచ్చిన వారికి అసైన్డ్‌ భూములను కేటాయిస్తారు తప్ప.. అర్హులనే పదానికి తావుండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే గత వైఎస్సార్‌సీపీ సర్కారు.. ప్రభుత్వ రంగంలో నిర్మాణం చేపట్టిన మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధి కుదింపు ద్వారా ప్రైవేట్‌కు ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఈ 2 పోర్టుల్లో మిగతా దశల విస్తరణకు బాబు ప్రభుత్వం దారులను మూసేసింది. చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు పరిధిని 64 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు, ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు పరిధిని 51 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు కుదిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో సవరణలకు ఆమోదం లభించిందని మంత్రి పార్థసార«థి మీడియాకు వెల్లడించారు. 

ఇతరత్రా కేబినెట్‌ నిర్ణయాలు...
రామాయపట్నం పోర్టు అభివృద్ధి, నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను డీబీఎఫ్‌ఒటీ (డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌) ప్రాతిపదికన అప్పగించేందుకు పోర్ట్‌ ఆపరేటర్‌ నియామకం కోసం ఆర్‌ఎఫ్‌పీ జారీ చేయడానికి, బిడ్డర్లను ఆకర్షించేందుకు వీలుగా ఆర్‌ఎఫ్‌పీలో నిబంధనల్లో మార్పులకు ఆమోదం.  
⇒ ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని షెడ్యూల్‌ 9, 10లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలలోని రెగ్యులర్‌ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచేందుకు ఆమోదం. దీనిని 2022  జనవరి 1 నుంచి పాత తేదీతో వర్తింపజేస్తూ, అప్పటి నుండి విశ్రాంతి పొందిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేలా సరీ్వస్‌ రూల్స్‌ సవరించడానికి ఆమోదం.  
⇒ 2004 సెప్టెంబర్‌ 1 కంటే ముందే నియామక నోటిఫికేషన్‌ విడుదలై..అదే తేదీన లేదా ఆ తర్వాత ప్రభుత్వ సేవ­లో చేరిన అర్హులైన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సీపీఎస్‌ నుంచి పాత పెన్షన్‌ విధానంలోకి మారేందుకు ఒకేసారి అవకాశం కల్పించేందుకు ఆమోదం. ఈ నిర్ణయంతో జీవో 653 పరిధి­లోని సుమారు 10,715 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి కుటుంబాలకు పదవీ విరమణ అనంతరం పాత పెన్షన్‌ విధానం వర్తింపు. 

కేబినెట్‌ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 

⇒ రాష్ట్రంలోని అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించేలా, తిరుపతి విమానాశ్రయం మినహా మిగిలిన అన్ని విమానాశ్రయాలలో అత్యాధునిక బార్‌లు, రిటైల్‌ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడానికి సంబంధించిన నూతన విధాన మార్గదర్శకాల ముసాయిదా ఆమోదం.  
⇒ ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల (స్థాపన, నియంత్రణ) చట్టం 2016లో సవరణలకు ఆమోదం.  

టీడీపీ ఆఫీస్‌కు రెండు ఎకరాలు 
⇒ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో టీడీపీ కార్యాలయం కోసం 2.002 ఎకరాలు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడికి తొలుత 66 ఏళ్లు.. ఆపై 99 ఏళ్లకు పొడిగించేలా లీజుకు ఆమోదం. 
⇒ రాష్ట్రంలో సాంకేతిక ఆధారిత రిజిస్ట్రేషన్‌ సేవలను అందించేందుకు అల్లూరి సీతారామరాజు, పొలవరం జిల్లాలు మినహా అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్ట్‌నర్‌íÙప్‌ (పీపీపీ) విధానంలో రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రం స్థాపించి, నిర్వహించడానికి ఆమోదం. వీటిని సబ్‌–రిజిస్ట్రార్‌ కార్యాలయాలుగా ప్రకటిస్తూ విధులు నిర్వహించేందుకు ఆమోదం.  

‘గీతం’లో 45 మీటర్ల ఎత్తు వరకు భవన నిర్మాణానికి అనుమతి
⇒  విశాఖ రిషికొండలోని గీతం విద్యా సంస్థ­లో 45 మీటర్ల ఎత్తు వరకు భవన నిర్మాణం చేపట్టేందుకు తాత్కాలిక ఫైర్‌ ఎన్‌వోసీ మంజూరుకు ఆమోదం.   
⇒ ఎస్‌ఐపీబీ, సీఆర్‌డీఏలో తీసుకున్న నిర్ణయాలకు, పలు సంస్థలకు భూముల కేటాయింపు, రాయితీలు ఇచ్చేందుకు ఆమోదం.  
⇒ డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, నెట్‌వర్క్‌ ఆసుపత్రుల మధ్య ప్రతిపాదించిన బిల్‌ డిస్కౌంటింగ్‌ విధానానికి సంబంధించి 8 శాతం వడ్డీ భారాన్ని సంబంధిత నెట్‌వర్క్‌ ఆసుపత్రులే భరించే నిబంధనతో ఆమోదం.  

పవన్‌పై విమర్శలు చేస్తే స్పందించండి
మంత్రులకు సీఎం డైరెక్షన్‌
సాక్షి, అమరావతి: ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌పై ఎవరైనా విమర్శలు చేస్తే వాటిపై స్పందించి కౌంటర్‌ ఇవ్వాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రులతో మాట్లాడుతూ పలు సూచనలు చేసినట్టు సమాచారం. కొద్ది రోజులుగా పవన్‌ కళ్యాణ్‌పై కాపు సామాజికవర్గం నేతలు, వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న విమర్శలను సీఎం వద్ద ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. పవన్‌పై విమర్శలు వస్తే మంత్రులంతా స్పందించాల్సిందేనని, మౌనంగా ఉంటే సరికాదని, ఎప్పటికప్పుడు కౌంటర్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను వివాదాల్లోకి లాగేందుకు కొందరు ప్రయత్ని­స్తున్నా­రని, అలాంటి సందర్భాల్లో కూటమి ఐక్యతను చాటే విధంగా మంత్రులంతా సమన్వయంతో స్పందించాలని సూచించారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ క్రిమినల్స్‌ను వెనకేసుకొస్తూ రాజకీయం చేస్తోందన్నారు. వైసీపీ నేతలు కుల మీటింగ్‌లు పెడుతూ కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను తిప్పికొట్టాలని మంత్రులకు సూచించినట్టు తెల్సింది. జొన్నగిరి గ్రామాన్ని ‘స్వర్ణ గ్రామం’గా నామకరణం చేయాలని సీఎం ప్రతిపాదించినట్టు సమాచారం. జూలై 3న కడప స్టీల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం చంద్రబాబు మంత్రుల వద్ద ప్రస్తావించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement