చంద్రబాబుకు జైల్లో పూర్తి భద్రత  | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు జైల్లో పూర్తి భద్రత 

Published Sat, Oct 28 2023 3:14 AM

Chandrababu has full security in jail says DIG Ravi Kiran - Sakshi

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): చంద్రబాబుకు సెంట్రల్‌ జైల్లో పూర్తి భద్రత ఉందని, దీనిపై అవాస్తవ వార్తలను నమ్మొద్దని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్, ఎస్పీ జగదీష్‌ స్పష్టం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం, ఆయనను చంపేస్తామంటూ మావోల పేరుతో వచ్చిన లేఖ, జైల్లో పెన్‌ కెమెరాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై సెంట్రల్‌ జైల్లో శుక్రవారం రాత్రి వారు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని, 24 గంటలూ సెక్యూరిటీతో పాటు అడిషనల్‌ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్‌ చేస్తున్నామన్నారు.

ఈ నెల 19న చంద్రబాబు రిమాండ్‌ నేపథ్యంలో ఆయనను బ్లూ జీన్‌ యాప్‌ ద్వారా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టామని, అందులో చంద్రబాబు కొన్ని విష­యా­లను న్యాయమూర్తికి తెలిపారని, వాటిని లెటర్‌ రూపంలో తిరిగి ఆయన ఇస్తే దా­నిని తాము కోర్టుకు పంపామన్నారు. జైలు చుట్టూ ఐదు వాచ్‌టవర్స్‌ ఉన్నాయని, గంటకోసారి గార్డ్‌ సెర్చ్‌ జరుగుతోందని చెప్పారు. జైలు వాటర్‌ ట్యాంక్‌ వైపు డ్రోన్‌ తిరిగినట్టు నార్త్‌ ఈస్ట్‌ వాచ్‌టవర్‌ గార్డు నుంచి సమాచారం వచ్చిందని, అయితే ఆ డ్రోన్‌ క్లోజ్డ్‌ జైలు వైపు రాలే­దని, దీనిపై సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా­దు చేశామని, విచారణ జరుగుతోందన్నారు. 

మావోల పేరుతో వచ్చిన లేఖ నకిలీది..  
చంద్రబాబును చంపేస్తామంటూ మావోల పేరుతో వచ్చిన లేఖ నకిలీదిగా గుర్తించినట్టు తెలిపారు. జైలు నుంచి చంద్రబాబు రాశారంటూ బయటకొచ్చిన లెటర్‌కు జైలు ముద్ర, సూపరింటెండెంట్‌ సంతకం లేదన్నారు. చంద్ర­బాబు ప్రింటెడ్‌ సంతకాన్ని తీసి దానిపై వేసి వైరల్‌ చేస్తున్నారని తెలిపారు. అలాగే జైల్లోకి వచ్చే ప్రతి ఖైదీని పూర్తిగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తామన్నారు. శ్రీనివాస్‌ అనే ఖైదీ రిమాండ్‌కు వచ్చినప్పుడు అతని వద్ద ఒక బటన్‌  కెమెరా ఉన్నట్టు గుర్తించామన్నారు. జైలు లోపలికి అనుమతించే ముందు అతని దుస్తులు తనిఖీ చేస్తుంటే అది లభించిందని తెలిపారు.

అందులో ఎలాంటి జైలు ఫుటేజీ లేదని, ఆ కెమెరాను స్వాదీనం చేసుకుని.. పోలీసులకు అప్పగించామని, ఆ కెమెరాను ఎందుకు తెచ్చారనే విషయంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు గంజాయి ప్యాకెట్లు జైల్లోకి విసిరారన్నది పూర్తి అవాస్తవమన్నారు. చంద్రబాబు కుడికంటి కేటరాక్ట్‌ ఆపరేషన్‌కు సంబంధించి రాజమండ్రి జీజీహెచ్‌ వైద్యులు పరీక్షలు చేశారని, కొంతకాలం తర్వాత అయినా ఆపరేషన్‌ చేయించుకోవచ్చని తెలిపారని వివరించారు. ఆయన ఆరోగ్యంపై తప్పుడు రిపోర్టులు విడుదల చేయడంలేదని, వాటిని ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిస్తున్నట్టు తెలిపారు.

జైల్లో చంద్రబాబును తాము కలవాలన్నా ఏడుగురు అధికారులు కలిస్తేనే.. అది సాధ్యమన్నారు. చంద్రబాబు తనకున్న ఎలర్జీలపై గతంలో ప్రభుత్వ వైద్యులకు చెప్పారని, దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు రెండు లె­టర్లు కూడా రాశామన్నారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించి ఎలాంటి చికిత్స అవసరమో తెలపాలని ఆయన భార్య భువనేశ్వరికి, ఇదే విషయాన్ని కోర్టుకూ తెలియజేసినట్టు తెలిపారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలు బయట సైతం 24 గంటలూ డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పకడ్బందీగా గస్తీ ఏర్పాటు చేసినట్టు రవికిరణ్, జగదీ‹Ù వివరించారు.   

Advertisement
Advertisement