‘అమరావతి’లో ఆగని దందా! | Chandrababu Govt: Syndicates involvement in Amaravati construction tenders | Sakshi
Sakshi News home page

‘అమరావతి’లో ఆగని దందా!

Jun 26 2026 5:25 AM | Updated on Jun 26 2026 5:25 AM

Chandrababu Govt: Syndicates involvement in Amaravati construction tenders

5 ప్యాకేజీల పనులూ కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు సిండికేట్లకు అప్పగింత

రూ.751.3 కోట్ల విలువైన మూడు ప్యాకేజీల పనులు ఎన్‌సీసీ చేతికి..

రూ.218.12 కోట్ల విలువైన రెండు ప్యాకేజీలను ఎమ్వీఆర్‌ ఇన్‌ఫ్రాకు..

మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద కాంట్రాక్టర్లకు పదిశాతం చెల్లింపు

సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల టెండ­ర్లలో సిండికేట్ల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. టెండరు నోటిఫికేషన్‌కు ముందే సిండికేటులో ఎక్కువ కమీషన్‌ ఇచ్చేందుకు ముందుకొచ్చిన కాంట్రాక్టు సంస్థకు వాటిని పంచేసి.. ఆ తర్వాత నోటిఫికేషన్‌ జారీచేసి.. అధిక ధరకు ఆ సంస్థకే అప్పగించేలా ముఖ్యనేత చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఆది నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఐదు ప్యాకేజీల పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్ప­గిస్తూ గురువారం ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు వాటికి బలం చేకూరుస్తున్నాయని ఇంజినీరింగ్‌ నిపు­ణులు స్పష్టంచేస్తున్నారు. సిండికేట్‌లోని ఎన్‌సీసీకి మూడు ప్యాకేజీలు.. ఎమ్వీఆర్‌ ఇన్‌ఫ్రాకు రెండు ప్యాకేజీల పనులు కట్టబెట్టారు. ఈ ఐదు ప్యాకేజీల పనులు అధిక ధరకు కట్టబెట్టడంవల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.34.70 కోట్ల భారంపడింది. అదే జ్యుడీషియల్‌ ప్రివ్యూ.. రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో టెండర్లు నిర్వహించి ఉంటే కాంట్రాక్టు విలువ కంటే కనీసం 4.5 శాతం తక్కువ ధరలకే పనులు చేయడానికి సంస్థలు ముందుకొచ్చేవని.. దీనివల్ల ఖజానాకు రూ.70 కోట్ల మేర ఆదా అయ్యేవని చెబుతున్నారు.

అన్ని పనులూ అధిక ధరకు కోట్‌..
రాజధానికి భూసమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లు ఇచ్చేందుకు ఉండవల్లి ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం లేఅవుట్‌ అభివృద్ధి పనులకు రూ.409.78 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి ఏడీసీఎల్‌ (అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ పనులకు కాంట్రాక్టు విలువ కంటే 4.07 శాతం అధిక ధరకు అంటే రూ.426.46 కోట్లకు కోట్‌చేసిన ఎన్‌సీసీ సంస్థ ఎల్‌–1గా నిలిచింది. ఆ సంస్థకు వాటిని అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనివల్ల ఖజానాపై రూ.16.68 కోట్ల భారం పడింది. వాటితోపాటు పన్నుల రూపంలో రూ.86.08 కోట్లను రీయింబర్స్‌ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అంటే.. ఆ పనుల కాంట్రాక్టు విలువ రూ.512.54 కోట్లు. అలాగే.. 

– పిచ్చుకలపాలెంలో జ్యుడీషియల్‌ అకాడమీ భవనాల నిర్మాణ పనులకు రూ.125.49 కోట్ల కాంట్రాక్టు విలువతో ఏజీఐసీఎల్‌ (అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) టెండర్లు పిలిచింది. కాంట్రాక్టు విలువ కంటే 3.89 శాతం అధిక ధరకు అంటే రూ.130.38 కోట్లకు కోట్‌ చేసిన ఎన్‌సీసీ సంస్థకు ఆ పనులు అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనివల్ల ఖజానాపై రూ.4.89 కోట్ల భారం పడింది. 

– కరకట్ట పటిష్టీకరణతోపాటు కరకట్టపై ఈ–1 రోడ్డు నిర్మాణ పనులకు మూడు ప్యాకేజీల కింద ఏడీసీఎల్‌ టెండర్లు పిలిచింది. కరకట్టను బలోపేతం చేయడం, దానిపై ఈ–1 రోడ్డును 0.3 కిమీ నుంచి 2.48 కిమీ వరకూ నిర్మించే పనులకు రూ.105.78 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు ఆహ్వానించింది. ఇందులో 4.02 శాతం అధిక ధరకు అంటే రూ.110.03 కోట్లకు కోట్‌ చేసిన ఎమ్వీఆర్‌ ఇన్‌ఫ్రాకు వాటిని అప్పగించింది. దీనివల్ల ఖజానాపై రూ.4.25 కోట్లు భారం పడింది. 

– అంతేకాక..2.48 కి.మీ నుంచి 4.990 కి.మీ వరకూ రోడ్డు నిర్మించే పనులకు రూ.103.50 కోట్ల కాంట్రాక్టు విలువతో నిర్వహించిన టెండర్లలో 4.72 శాతం అధిక ధరకు అంటే రూ.108.38 కోట్లకు కోట్‌ చేసిన ఎన్‌సీసీ సంస్థకు వాటిని అప్పగించింది. దీనివల్ల కూడా ఖజానాపై రూ.5.12 కోట్ల భారం పడింది. 

– ఇక 4.99 కి.మీ నుంచి 7.20 కి.మీ వరకూ రోడ్డు నిర్మించే పనులకు రూ.104.09 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి, నిర్వహించిన టెండర్లలో 4.04 శాతం (108.09 కోట్లు) అధిక ధరకు కోట్‌ చేసిన ఎమ్వీఆర్‌ ఇన్‌ఫ్రాకు వాటిని కట్టబెట్టింది. దీనివల్ల ఖజానాపై రూ.4 కోట్లు భారం పడింది.

నీకింత.. నాకింత..
ఇలా మొత్తమ్మీద ఐదు ప్యాకేజీల్లో రూ.751.3 కోట్ల విలువైన మూడు ప్యాకేజీల పనులను ఎన్‌సీసీకి.. 218.12 కోట్ల విలువైన రెండు ప్యాకేజీలను ఎమ్వీఆర్‌ ఇన్‌ఫ్రాకు కట్టబెట్టింది. ఈ ఐదు ప్యాకేజీల విలువ రూ.969.42 కోట్లు. ఇందులో పది శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా కాంట్రాక్టర్లకు ముట్టజెప్పి.. నీకింత నాకింత అంటూ ముఖ్యనేత పంచుకోనున్నారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement