తనఖా రుణం.. తన ప్రచారానికి

Chandrababu Govt Rs 3000 crore debt in the name of roads - Sakshi

బాబు సర్కారు నిర్వాకాలకు మరో మచ్చుతునక

రహదారుల పేరుతో రూ.3,000 కోట్ల అప్పు

ఒక్క రోడ్డూ వేయకుండానే నిధులు పప్పు బెల్లాలకు మళ్లింపు

ఏపీఆర్‌డీసీని తనఖా పెట్టి రుణం

సాక్షి, అమరావతి: అందినకాడికి అప్పులు చేయడం... వాటిని సొంత ప్రచారం కోసం మంచినీళ్లలా ఖర్చు చేయడం! గత సర్కారు విచ్చలవిడితనానికి రహదారుల పేరుతో జరిగిన నిర్వాకాలే మరో నిదర్శనం. పలు కార్పొరేషన్ల ద్వారా రూ.వేల కోట్లు అప్పులు తెచ్చిన చంద్రబాబు సర్కారు వాటిని నిర్వీర్యం చేసింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఆర్‌డీసీ) అలంకార ప్రాయంగా మారింది. 

ఒక్క రోడ్డూ నిర్మించలేదు..
► రాష్ట్రంలో కొత్త రహదారుల నిర్మాణంతోపాటు ప్రధానమైన రోడ్లకు మరమ్మతులు చేపడతామంటూ ఏపీఆర్‌డీసీ ద్వారా చంద్రబాబు సర్కారు 2018లో రూ.3 వేల కోట్ల రుణం తెచ్చింది. ఈ రుణంతో ఒక్క రహదారి ప్రాజెక్టు  ప్రారంభించలేదు సరికదా కనీసం ఒక్క గుంతనైనా పూడ్చలేదు. 
► గత సర్కారు అప్పుగా తెచ్చిన రూ.3 వేల కోట్లను మళ్లించి ఎన్నికలకు ముందు పసుపు–కుంకుమ పేరుతో చంద్రబాబు ప్రచారం కోసం పంచేసింది. దీంతో ఆ రుణాన్ని చెల్లించేందుకు ఏపీఆర్‌డీసీ ఆర్‌అండ్‌బీకి కేటాయించిన బడ్జెట్‌ నుంచి ఖర్చు చేయాల్సి వస్తోంది. తెచ్చిన అప్పులపై వడ్డీలు చెల్లించేందుకే బడ్జెట్‌ చాలకపోవడంతో ఏపీఆర్‌డీసీ రహదార్లను అభివృద్ధి చేయలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడంతో న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు సహకారంతో గ్రామ, మండల, జిల్లా రోడ్ల విస్తరణ, వంతెనల పునర్నిర్మాణాన్ని ప్రారంభించింది.

పంజాబ్‌ బ్యాంకు నుంచి 7.90 శాతం వడ్డీతో రుణం
► టీడీపీ సర్కారు అధికారంలో ఉండగా జాతీయ/రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేసేందుకు అప్పు ఇవ్వాలంటూ పలు ఆర్ధిక సంస్ధలను ఆశ్రయించింది. చివరకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి 7.90 శాతం వడ్డీతో రూ.3 వేల కోట్ల రుణం తీసుకుంది. ఆర్‌ అండ్‌ బీకి 2017–18 బడ్జెట్‌ కేటాయింపులు సరిపోలేదంటూ అప్పు చేసింది. 
► రాష్ట్రంలో 2,144 కి.మీ రోడ్లు, 78 వంతెనల నిర్మాణం చేపడతామంటూ రుణం తీసుకుని చంద్రబాబు ప్రభుత్వం సొంత ప్రచారానికి వాడుకోవడంతో ఇప్పుడు ఆ భారం ఏపీఆర్‌డీసీపై పడింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top