తొలిరోజే తడ‘బడి’! | Chandrababu govt cannot even provide books and kits to School children | Sakshi
Sakshi News home page

నేటి నుంచి స్కూల్స్‌ పునఃప్రారంభం.. తొలిరోజే తడ‘బడి’!

Jun 12 2026 5:28 AM | Updated on Jun 12 2026 5:28 AM

Chandrababu govt cannot even provide books and kits to School children

‘తల్లికి వందనం’ దేవుడెరుగు.. పిల్లలకు కనీసం పుస్తకాలు, కిట్లు ఇవ్వలేని ప్రభుత్వం 

గతేడాది మిగిలిపోయిన యూనిఫారం, బూట్లే సర్దుబాటు

సాక్షి, అమరావతి: కానరాని స్టూడెంట్‌ కిట్లు.. ఊసేలేని ‘తల్లికి వందనం’ దుస్థితి నడుమ శుక్రవారం విద్యా సంవత్సరం 2026–27 ప్రారంభం అవుతోంది. శుక్రవారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు కనీస అవసరాలను సైతం సమకూర్చలేని దయనీయ పరిస్థితులను చంద్రబాబు సర్కారు కల్పించింది. స్కూళ్లు తెరిచిన మొదటి రోజే స్టూడెంట్‌ కిట్లు హామీని అటకెక్కించింది. కనీసం అందరికీ పుస్తకాలైనా అందించకుండా సర్దుకోమంటోంది. రాష్ట్రంలో మొత్తం 62 వేల పాఠశాలలు ఉండగా ప్రభుత్వ యాజమాన్యంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతి వరకు 32 లక్షల మంది విద్యార్థులుండగా అదే అంచనాతో ఈ ఏడాది పుస్తకాల ముద్రణ చేపట్టారు. అయితే డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థిమిత్ర కిట్ల పంపిణీ సాధ్యం కాదని ఇటీవల ప్రకటించి ప్రభుత్వం చేతులెత్తేసింది. గతేడాది కిట్లలో విద్యార్థులకు సరిపోని బూట్లు, బెల్టులు, మిగిలిన యూనిఫారం క్లాత్‌ను కొన్ని మండలాల్లో సర్దుబాటు చేశారు.  

తొలిరోజే ఇస్తామని గొప్పలు చెప్పి... 
జూన్‌ 12న బడులు తెరిచిన మొదటిరోజే విద్యార్థులకు కిట్లను అందిస్తామని గతంలో గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తమవల్ల కాదని ప్రకటించింది. గ్యాస్‌ కొరత, క్రూడ్‌ ఆయిల్‌ సంక్షోభం, ఫైబర్‌ లాంటి ముడి పదార్థాల కొరతను సాకుగా చెబుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘జగనన్న విద్యా కానుక’ పేరును మార్చేసి మొదటి ఏడాది (2024 జూన్‌) వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో కొనుగోలు చేసిన కిట్లను ఇచ్చింది. 2025 వచ్చేసరికి ప్రభుత్వం బకాయి బిల్లులు చెల్లిస్తేనే కిట్లు ఇస్తామని కాంట్రాక్టర్లు తేల్చి చెప్పారు. దాంతో అధికారులు తమ సొంత హామీతో కిట్లు తీసుకొచ్చి ఆగస్టు తర్వాత పంపిణీ చేశారు. ప్రభుత్వం నిధుల చెల్లింపులో ఆలస్యం చేయడంతో ఈ ఏడాది కిట్ల కొనుగోలుకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. తమకు రెండేళ్లకు సంబంధించి రూ.1372 కోట్ల బకాయిల మొత్తం చెల్లించకుండా బిడ్డింగ్‌లో పాల్గొనలేమని ఆయా కంపెనీలు తేల్చి చెప్పాయి. ఇక 2026–27 విద్యా సంవత్సరంలో 35 లక్షల మంది విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయాలని అంచనాలు రూపొందించారు. ముద్రణ సమయంలో సర్కారు పిల్లిమొగ్గలు వేయడంతో పాటు ఇంటర్‌ పాఠ్యపుస్తకాల పీడీఎఫ్‌ లీకేజీ స్కామ్‌కు కారణమైన ప్రైవేటు ముద్రణ సంస్థ వీజీఎస్‌కు భారీగా కాంట్రాక్టు కట్టబెట్టారు. సకాలంలో ప్రింటింగ్‌ పూర్తి చేయకపోవడంతో ఇప్పటికీ చాలా మండలాలకు పుస్తకాలు చేరలేదు.  

గతేడాది మిగిలిపోయినవే దిక్కు.. 
– సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాల్లో 1,40,012 యూనిఫారాలు అవసరమైతే 20,618 మాత్రమే అందించారు. కుప్పం, శాంతిపురం మండలాలకు సరఫరా చేశారు. షూలు, బ్యాగులు లేవు. 80 వేల మందికి నోటు పుస్తకాలు ఇవ్వాల్సి ఉండగా 70 వేల మందికి మాత్రమే వచ్చాయి. పాఠ్యపుస్తకాలు సైతం 10 శాతం పెండింగ్‌. వర్క్‌బుక్స్‌ ఒక్కటీ రాలేదు.  
– విజయనగరం జిల్లాలో 27 మండలాలు ఉండగా ఆరు మండలాలకు పాత యూనిఫారం ఇచ్చారు. పుస్తకాలు 11 మండలాలకు పుస్తకాలు రాలేదు. పాత బూట్లు కొన్ని మండలాలకు సర్దుబాటు చేశారు.  
– ఎన్టీఆర్‌ జిల్లాలో కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే స్కూళ్లకు చేరాయి. 
– కర్నూలు జిల్లాలోని 26 మండలాల్లో పాఠ్యపుస్తకాలు, వర్క్‌ బుక్స్‌ మాత్రమే వచ్చాయి. యూనిఫామ్‌ 4 మండలాలకు, నోట్‌ బుక్స్‌ 9 మండలాలకు, పిక్టోరియల్‌ డిక్షనరీలు 8 మండలాలకు మాత్రమే వచ్చాయి.  
– పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని టైటిల్స్‌ కలిపి 4.80 లక్షల పుస్తకాలు అవసరముంటే 4 లక్షలు మాత్రమే అందించారు, వర్కుబుక్స్‌ మాత్రం అందలేదు. బ్యాగులు, బెల్టులు, బూట్లు లేనేలేవు.  
– కాకినాడ జిల్లాలో ఉన్న 20 మండలాలకు యూనిఫారం లేదు, 1.20 లక్షల మంది విద్యార్థులకు బూట్లు ఆర్డర్‌ పెట్టగా, 25 వేల మందికి 8 మండలాల్లో పాక్షికంగా సరఫరా చేశారు. బెల్టులు కూడా 10 శాతం సరఫరా చేశారు.  

జగన్‌ ప్రభుత్వంలో చదువులకు భరోసా.. 
వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 43 లక్షల మంది విద్యార్థులకు ఏటా స్కూళ్లు తెరిచిన మొదటి రోజే టంచన్‌గా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్‌–తెలుగు) నోట్‌ బుక్స్, వర్క్‌ బుక్స్, కుట్టు కూలితో 3 జతల యూనిఫామ్‌ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు ఆరో తరగతి విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లి‹Ù–తెలుగు డిక్షనరీ, ఒకటో తరగతి పిల్లలకు పిక్టోరియల్‌ డిక్షనరీతో కూడిన కిట్‌ను మొదటి రోజే విద్యార్థుల చేతికందేది. తల్లికి వందనం ద్వారా తల్లుల ఖాతాల్లో నిధులు జమచేసి పిల్లల చదువులకు పూర్తి అండగా నిలిచారు. ‘‘ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తాం’ అని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తల్లికి వందనం పూర్తిగా ఎగరగొట్టారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement