సంపద సృష్టించకపోగా ఉన్న ఆస్తులనే ఊడ్చేస్తున్న చంద్రబాబు సర్కారు
గత ప్రభుత్వంలోనే 95 శాతం పూర్తైన రామాయపట్నం పోర్టు తాజాగా ప్రైవేట్ చేతుల్లోకి
రామాయపట్నం పోర్టు నిర్వహణ టెండర్లకు బాబు సర్కారు పచ్చజెండా
ప్రభుత్వ విలువైన ఆస్తులన్నీ స్కామ్‌ల కోసం ప్రైవేట్‌కు ధారాదత్తం
మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధి కుదింపు.. ఇప్పటికే జువ్వలదిన్నె హార్బరు ప్రైవేట్ సంస్థ పరం..
రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తులన్నీ వరుసగా ప్రైవేట్‌పరం..
కొత్త మెడికల్ కాలేజీలు, ఆర్టీసీ, టూరిజం శాఖ హోటళ్లు, ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు అంతా ‘ఫర్ సేల్’
ఎలక్ట్రిక్ బస్సులు పేరిట ఆర్టీసీ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం.. విలువైన సంస్థ ఆస్తులు కూడా.. రియల్ ఎస్టేట్ సంస్థలకు కారుచౌకగా ఖరీదైన ప్రభుత్వ భూములు.. బంధువులకు భూ సంతర్పణ
మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పరుగులు పెట్టిన తీరప్రాంత అభివృద్ధి
రూ.26,501 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు శ్రీకారం
ప్రభుత్వ రంగంలో ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: మొన్న ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలు..! నిన్న ఫిషింగ్ హార్బర్లు, ఆర్టీసీ ఆస్తులు అప్పనంగా ప్రైవేట్‌పరం..! ఖరీదైన ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ సంస్థలకు, బంధు గణానికి పందేరం..! నేడు కొత్త పోర్టుల వంతు..! కొత్తగా సంపద సృష్టించకపోగా మాజీ సీఎం వైఎస్ జగన్ కృషితో ప్రభుత్వ రంగంలో సాకారమైన విలువైన ఆస్తులన్నింటినీ చంద్రబాబు సర్కారు ప్రైవేట్‌పరం చేసేస్తూ సన్నిహితులకు దోచిపెడుతోంది. ప్రజల సంపదకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే పప్పుబెల్లాలకు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేస్తోంది. గత ప్రభుత్వం నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో 30 ఎకరాలను సాగర్ డిఫెన్స్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు సర్కారు కన్ను తాజాగా మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులపై పడింది. గత రెండేళ్లుగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని పట్టించుకోకుండా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల పరిధిని తగ్గించడమే కాకుండా వీటి నిర్వహణ, విస్తరణ పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు పచ్చజెండా ఊపింది. వైఎస్సార్‌సీపీ హయాంలో పోర్టులు, హార్బర్లు, ఆస్పత్రులు, గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో రూ.వేల కోట్ల విలువైన శాశ్వత ఆస్తులు ప్రభుత్వ రంగంలో సమకూరితే చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణ పేరిట తన అనుయాయులకు పంచిపెడుతోంది.
రామాయపట్నం హరీ..!
మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.4,929.39 కోట్లతో చేపట్టి దాదాపు 95 శాతం మేర పూర్తి చేసిన రామాయపట్నం పోర్టును చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణ చేస్తోంది. పోర్టు పరిధిని 51 కి.మీ. నుంచి ఏకంగా 15 కి.మీ.కి తగ్గించడమే కాకుండా పోర్టు నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2021లో రామాయపట్నం పోర్టు పనులను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించగా 2024 నాటికి దాదాపుగా పూర్తయ్యాయి. మల్టీ ప్రోడక్ట్ కార్గో నాలుగో బెర్తు పనులు కూడా పూర్తయి ప్రారంభించాల్సిన తరుణంలో ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు గడిచినా గంప ఇసుక కూడా ఎత్తలేదు. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో నిర్వహణ కోసం టెండర్లు పిలవడంపై వ్యాపార, అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ అంటే? అనే చర్చ జరుగుతోంది. దాదాపుగా పూర్తయిన ప్రాజెక్టును అప్పనంగా ప్రైవేట్‌కు కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.26,501 కోట్లతో చేపట్టిన మూడు పోర్టులు, 10 షిషింగ్ హార్బర్ల పనులను చంద్రబాబు సర్కారు నిలిపివేసింది. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిన ప్రాజెక్టులను అందుబాటులోకి తేకపోగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోంది.
ప్రైవేటుకు తీరప్రాంతం..
తూర్పు తీర ప్రాంతానికి ముఖద్వారంగా విలసిల్లే ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తినుకో.. దోచుకో.. పంచుకో విధానంలో ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మచిలీపట్నం పోర్టు పరిధిని 64 కిలోమీటర్ల నుంచి 15 కిలో మీటర్లకు తగ్గించేయడమే కాకుండా ఇప్పటికే పోర్టు సమీపంలో షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు కోసం బిడ్లను ఆహ్వానించింది. కాకినాడలో ఏపీ మారిటైమ్ బోర్డుకు చెందిన 45 ఎకరాలను 30 ఏళ్ల దీర్ఘకాలిక లీజుపై ‘సేఫ్ వన్ ఇండియా ఎస్పీ కాంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్’కు ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదించింది. అంతేకాకుండా ఏపీ మారిటైమ్ బోర్డు ల్యాండ్ అలాంట్‌మెంట్ గైడ్‌లైన్స్ 2026 పేరుతో వాటర్ ఫ్రంట్ ఏరియా, తీరం, ఉప్పు సాగు భూములను కావాల్సిన వారికి కేటాయించనున్నారు.
మత్స్యకారులకు దగా..
కొత్తగా ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కూడా చేపట్టకపోగా నిర్మాణంలో ఉన్నవాటిని నిలిపివేసి, టెండర్ల విలువను భారీగా పెంచేసి చంద్రబాబు సర్కారు మత్స్యకారులకు ద్రోహం చేస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తొలిదశలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించి.. రెండో దశలో బుడగట్లపాలెం, కొత్తపట్నం, పూడిమడక, బియ్యపు తిప్ప, ఓడరేవుల వద్ద ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిచింది. రెండేళ్లుగా ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా, ఓడరేవు లాంటి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను ఆపేయడమే కాకుండా బుడగట్లపాలెం, కొత్తపట్నం, పూడిమడక హార్బర్ల నిర్మాణ విలువను భారీగా పెంచేస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
గత ప్రభుత్వం ఈ మూడు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ వ్యయాన్ని రూ.1,150.22 కోట్లుగా నిర్ణయిస్తే ఇప్పుడు ఈ విలువను రూ.436.41 కోట్లు పెంచేసి ఏకంగా రూ.1,586.63 కోట్లకు చేర్చడం గమనార్హం. బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బరు నిర్మాణ వ్యయం రూ.365.81 కోట్ల నుంచి రూ.444.75 కోట్లకు పెంచగా.. కొత్తపట్నం హార్బర్ నిర్మాణ వ్యయాన్ని రూ.392.41 కోట్ల నుంచి రూ.441.88 కోట్లకు పెంచుతూ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. పూడిమడక హార్బర్‌ను ప్రభుత్వం నిర్మించకుండా పీపీపీ విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. అంతేకాదు.. ఈ హార్బర్ నిర్మాణ వ్యయాన్ని రూ.392 కోట్ల నుంచి ఏకంగా రూ.700 కోట్లకు పెంచేయడం హార్బర్ల పేరుతో చంద్రబాబు సర్కారు చేస్తున్న నిలువు దోపిడీకి నిదర్శనం. మరోవైపు రూ.417.55 కోట్లతో గత ప్రభుత్వ హయంలో పనులు ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఓడరేవు హార్బర్ నిర్మాణ పనులు 25 శాతం లోపే ఉన్నాయంటూ 2024 సెపె్టంబర్ 27 టెండర్లను రద్దు చేసి పనులను అర్థంతరంగా నిలిపివేసింది.
బాబు సర్కార్ ప్రైవేట్ పందేరం ఇలా..!
ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలకు ఉరి..
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఒకేసారి ప్రభుత్వ రంగంలో 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నెలకొల్పే వైద్య కళాశాలల్లో మెరుగైన నిర్వహణ కోసం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ సీట్లకు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కంటే తక్కువ ఫీజులను ఖరారు చేసింది. ఎన్నికల ముందు టీడీపీ దీనిపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. తాము అధికారం చేపట్టిన వంద రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని లోకేశ్ ప్రకటించారు. ఇప్పుడు ఆ విధానం రద్దు చేయకపోగా, ఏకంగా కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. ఇప్పటికే పది కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.కోట్ల విలువ చేసే ఈ కళాశాలల భూములను ఎకరం రూ.వందకే లీజుకు ఇవ్వడంతో పాటు కళాశాలలు, బోధనాస్పత్రిపై ఏకంగా 66 ఏళ్ల పాటు సర్వ హక్కులు కల్పిస్తోంది. ప్రభుత్వ రంగంలో ఉచితంగా అందాల్సిన వైద్య సేవలకు ఫీజులు వసూలు చేసే అధికారాన్ని కల్పించి అప్పనంగా ప్రభుత్వాస్పత్రులను ప్రైవేట్ పరం చేస్తోంది.
‘ప్రైవేట్’ దారిలో ఆర్టీసీ..
ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీని సైతం ప్రైవేట్ చేతుల్లో పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. ఈ–బస్సులను ప్రైవేట్ సంస్థల ద్వారానే నిర్వహించాలనే విధానం ముసుగులో ఈ కుతంత్రానికి తెర తీసింది. ఆర్టీసీయే స్వయంగా ఈ–బస్సులు నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను బేఖాతర్ చేస్తోంది. ఆర్టీసీకి ప్రస్తుతం 11 వేల బస్సులు ఉన్నాయి. వాటిలో 8 వేలు ఆర్టీసీకి చెందినవి కాగా 3 వేల బస్సులను అద్దె విధానంలో నిర్వహిస్తున్నారు. ఆ మొత్తం బస్సుల స్థానంలో 2029 నాటికి 9 వేల ఈ–బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 2 వేల బస్సుల స్థానంలో కూడా ప్రైవేటు ఈ–బస్సులను 2031 నాటికి ప్రవేశపెట్టాలన్నది లక్ష్యం. అంటే 2031 నాటికి మొత్తం ఆర్టీసీని ప్రైవేటుపరం చేయనున్నారు.
అందుకే కొత్తగా డీజిల్ బస్సుల కొనుగోలును నిలిపివేసింది. సగటున రెండు రోజులకు ఒక బస్సు చొప్పున సర్వీసుల నుంచి తొలగిస్తోంది. మరోవైపు ఆర్టీసీ బస్ డిపోలు, బస్ స్టేషన్లను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోంది. ఇప్పటికే రూ.6,600 కోట్ల విలువైన 12 ఆర్టీసీ డిపోలను ఈ–బస్సులను నిర్వహించే ప్రైవేటు సంస్థలకు లీజు ప్రాతిపదికన ధారాదత్తం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆర్టీసీ బస్ స్టేషన్లను ఖాళీ చేయించి షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సముదాయాలు నిర్మించేందుకు పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని నిర్ణయించింది.
టూరిజం పేరిట లూటీ!
పర్యాటక శాఖకు చెందిన సుమారు రూ.10 వేల కోట్ల విలువైన ఏపీ టీడీసీ హోటళ్లను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ప్రభుత్వం ఏకంగా 33 ఏళ్ల పాటు ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇస్తోంది. పర్యాటకాభివృద్ధి పేరుతో ప్రభుత్వానికి చెందిన 3,913.96 ఎకరాల విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టేందుకు ప్రణాళిక సిద్ధమైంది.రాష్ట్రవ్యాప్తంగా సెంటు భూమిని కూడా వదలకుండా ప్రైవేటు పరం చేసేందుకు ‘ల్యాండ్ బ్యాంకు’ రూపొందించింది. జిల్లాల వారీగా ఏ ప్రాంతంలో పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన ఎంత భూమి ఉందనే వివరాలను సర్వే నంబర్లతో సహా వెబ్‌సైట్‌లో పెట్టింది. 2024–29 పర్యాటక విధానం, పర్యాటక భూ పంపిణీ విధానాన్ని అనుసరించి ఎటువంటి టెండర్లు, బిడ్డింగ్ లేకుండానే ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోంది. విశాఖలోని రుషికొండ, ఆనందపురం, మధురవాడ, కాపులుప్పాడ, యండాడ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో భూములను పందేరం చేసింది.
రాయలసీమలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోటలో 1,200 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు తహతహలాడుతోంది. ఓర్వకల్లు రాక్ గార్డెన్ సమీపంలో 200 ఎకరాలు, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో 550.59 ఎకరాల భూమిని (ఒక్క ఆత్మకూరులోనే 210.4 ఎకరాలు) భూమిని దోచిపెడుతోంది. జల వనరుల ప్రాజెక్టుల సమీపంలోని భూములతోపాటు లంక భూములను సైతం వదిలి పెట్టడం లేదు. పట్టిసీమ, పురుషోత్తపట్నం, తిరుపతిలోని కల్యాణి డ్యామ్, రామాయపట్నం పోర్టు ప్రాంతాల్లోని ఖరీదైన భూముల దోపిడీయే లక్ష్యంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. విజయవాడలో 230 ఎకరాల భవానీ ద్వీపాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. కూటమి పార్టీల నాయకులు, ముఖ్యనేత బంధువులకు యథేచ్ఛగా విలువైన ప్రభుత్వ భూములను పంచిపెడుతోంది.


