
బడ్జెట్ లోపల, బయట బాబు సర్కారు అప్పులు రూ.2,09,085 కోట్లు
7.63 శాతం వడ్డీతో తాజాగా మరో రూ.5,000 కోట్లు అప్పులు
తాగునీటి ప్రాజెక్టులు, ఏపీఐఐసీ ఆస్తుల తాకట్టుతో ఎడాపెడా రుణాలు
ఏడాదిన్నర పాలనలో ఏ సర్కారుకూ సాధ్యం కాని రికార్డు సృష్టి
ఇంత అప్పు చేసినా సూపర్ సిక్స్‌లో కీలకమైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధికి ఎగనామం..
అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు హామీలిచ్చి వంచన
సాక్షి, అమరావతి: అప్పుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు రికార్డు స్థాయి వృద్ధి సాధిస్తోంది. రాష్ట్ర ప్రజలపై నెల నెలా భారీగా అప్పుల భారాన్ని మోపుతూ సంపద సృష్టిలో తిరోగమనంలో వెళుతోంది. హామీలను ఎగ్గొడుతూ బడ్జెట్ లోపల, బయట అప్పులు చేయడంలో మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోతోంది.
తాజాగా మంగళవారం రూ.5,000 కోట్లు అప్పు చేయడం ద్వారా బడ్జెట్ లోపల, బయట చేసిన చంద్రబాబు సర్కారు అప్పులు ఏకంగా రూ.2,09,085 కోట్లకు చేరాయి. 15 నెలల పాలనలో ఇంత పెద్ద ఎత్తున అప్పులు గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు. తాగునీటి ప్రాజెక్టులు, ఏపీఐఐసీ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేయడం ఈ విజనరీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.
బడ్జెట్ అప్పులే రూ.1,33,702 కోట్లు...
ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్‌బీఐ 7.63 శాతం వడ్డీకి రూ.5,000 కోట్లు రుణం సమీకరించి తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్ లోపల రాష్ట్ర అప్పులే ఏకంగా రూ.1,33,702 కోట్లకు ఎగబాకాయి. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.44,383 కోట్లు అప్పులు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ జలజీవన్ నీటి సరఫరా సంస్థ ఏర్పాటు చేసి రూ.10,000 కోట్లు అప్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీఐఐసీ ఆస్తులను తాకట్టు పెట్టేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి రూ.7,500 కోట్లు అప్పులు చేయడానికి జీవో జారీ చేసింది. ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్ ద్వారా రూ.5,473 కోట్లు అప్పులు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఇవి కాకుండా బడ్జెట్ బయట మరిన్ని అప్పులను ప్రభుత్వం ఇప్పటికే చేసేసింది. మరోపక్క రాజధాని అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్ధ, హడ్కో నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పులు చేస్తోంది. ఇలా బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నప్పటికీ సూపర్ సిక్స్‌లో కీలకమైన నిరుద్యోగ భృతి, ఆడ బిడ్డ నిధి అమలు చేయకుండా ఎగనామం పెట్టారు.

ప్రజలను తప్పుదోవ పట్టించి..
అధికారం చేపట్టి ఏడాదిన్నర కూడా కాకుండానే చంద్రబాబు సర్కారు రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా అటు ఆస్తులు సమకూర్చలేదు.. ఇటు హామీలను నెరవేర్చలేదు. గత ప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం సిఫార్సులు, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడి అప్పులు చేయగా రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేస్తున్నారంటూ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం ప్రజలను తప్పుదోవ పట్టించింది. తాను అప్పులు చేయకుండా సంపద సృష్టించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు తీరా సీఎం అయ్యాక నెల నెలా అప్పులు చేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు.