పీ–4 ఒక్కరోజు అట్టహాస వేడుకలకు రూ.3.07 కోట్లు
కేవలం సీఎం సభకే రూ.80 లక్షలు
జిల్లాల్లో వేడుకలకు రూ.52 లక్షలు
నియోజకవర్గాల్లో వేడుకలకు రూ.175 లక్షలు
ఏడాది మొత్తం పీ–4 సభల వ్యయం రూ.9.15 కోట్లు
సాక్షి, అమరావతి: సంపన్నులను పేదలతో అనుసంధానించి.. పేదరికాన్ని నిర్మూలిస్తామంటూ పీ–4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సర్కారు సభల పేరుతో ప్రభుత్వ సొమ్మును దుబారా చేస్తోంది. పీ–4 ప్రథమ వారికోత్సవ వేడుకల్ని నిర్వహించేందుకు రూ.3.07 కోట్లు వెచ్చించేందుకు ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ గురువారం పరిపాలన అనుమతి మంజూరు చేశారు. ఈ మొత్తం ఒక్క రోజు వేడుకలు నిర్వహించేందుకు అయిన వ్యయంగా పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు ఈ ఏడాది మార్చి 30న తిరుపతిలో పీ–4 ప్రథమ వార్షికోత్సవ సభలో పాల్గొన్నారు. దీని కోసం రూ.80 లక్షలు విడుదల చేశారు. అలాగే జిల్లా స్థాయిల్లో ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు జిల్లాకు రూ.2 లక్షల చొప్పున 26 జిల్లాలకు రూ.52 లక్షలను విడుదల చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన వేడుకలకు నియోజకవర్గానికి రూ.లక్ష చొప్పున రూ.175 లక్షల్ని విడుదల చేశారు.
సభలు, వేడుకల ఖర్చు రూ.9.15 కోట్లు
గత ఏడాది మార్చి 30న సచివాలయం వెనుక పీ–4 పాలసీ ప్రారంభోత్సవం పేరుతో సీఎం చంద్రబాబు ఒకపూట సదస్సు నిర్వహించారు. ఆ సదస్సుకు గతంలోనే ప్రణాళికా శాఖ రూ.5.61 కోట్లను విడుదల చేసింది. గత ఏడాది ఆగస్టు 19న మంగళగిరిలోని సీ.కే. కన్వెన్షన్స్‌లో సీఎం చంద్రబాబు నిర్వహించిన పీ–4 కార్యక్రమానికి ఖర్చుల నిమిత్తం రూ.47.10 లక్షలకు పరిపాలన అనుమతి ఇస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు పీ–4 సభలు, వేడుకల పేరుతో చంద్రబాబు సర్కారు రూ.9.15 కోట్లను వ్యయం చేసింది.
పేదరిక నిర్మూలన కోసం పేదలకు నేరుగా ఒక్క పైసా కూడా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుల పేరుతో రూ.కోట్లు వెచ్చిస్తోంది. సంపన్నులైన 10 శాతం కుటుంబాలు పేదరికంలో ఉన్న కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలి. ఈ కార్యక్రమం కోసం సదస్సులు, వేడుకల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే ఏకంగా రూ.9.15 కోట్లు వ్యయం చేయడంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.


