లెక్కలు పెంచి.. కాగితాలపై క్లియర్ చేసి.. రూ.1,200 కోట్లకు స్కెచ్
చంద్రబాబు సర్కారు చెత్త కుంభకోణం గుట్టురట్టు
కూటమి అధికారంలోకి వచ్చేనాటికి 44 లక్షల టన్నుల లెగసీ చెత్త మాత్రమే ఉంది
41.10 లక్షల టన్నులు క్లియర్ చేశారంటూనే మళ్లీ 85 లక్షలతో ఎన్జీటీకి 2 అఫిడవిట్లు
నాలుగో అఫిడవిట్‌లో 1.53 కోట్ల టన్నులకు చెత్తను పెంచేశారు
ఐదో అఫిడవిట్‌కు 1.58 కోట్ల టన్నులుగా మార్చేశారు
లెక్కలు మార్చుతూ.. ఏమార్చుతూ ఎన్జీటీకి 5 అఫిడవిట్లు
చెత్త తొలగించకుండానే కోట్ల టన్నులు క్లియర్ చేసినట్లు బిల్లులు
ఇప్పటికీ డంపింగ్ యార్డుల్లో టన్నులకొద్దీ లెగసీ చెత్త
బయోమైనింగ్ చేయాల్సిన చోట మట్టితో చెత్త కప్పివేత
100కు పైగా డంపింగ్ యార్డుల్లో చెత్త దహనం చేశారనే ఆరోపణలు
చెత్త దహనంతో విషవాయువులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
నిబంధనలకు విరుద్ధంగా పనులు.. అయినా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు
సాక్షి క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే వాస్తవాలు
సాక్షి, అమరావతి: కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లు.. ఇసుక, మట్టి, క్వార్ట్జ్, మద్యం అన్నిటిలోనూ వేల కోట్లు దోచేస్తున్నారు.. అమరావతి నిర్మాణాల పేరుచెప్పి ప్రపంచంలోనే ఎక్కడా లేనంత స్థాయిలో ఎస్‌ఎఫ్‌టీకి రూ.20 వేలు చొప్పున నొక్కేస్తున్నారు. అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా భూములు అప్పగించేస్తున్నారు. అంచనాలు పెంచేసి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులిచ్చేసి వాటిలో కమీషన్లు కొట్టేస్తున్నారు. అయినా చంద్రబాబు ఆకలి తీరడం లేదు. చివరకు చెత్తనూ వదలడం లేదు. చెత్త నిల్వల లెక్కలను కాగితాలపై పెంచేసి కాగితాలపైనే క్లియర్ చేసేసి కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ వాటిలో కమీషన్లు కాజేస్తున్న విషయం బయటపడింది.
చెత్తతోనూ ‘దోపిడీ పంట’ పండించవచ్చన్న విజనరీ చంద్రబాబు పాలనలో చెత్త కుంభకోణం విలువ రూ.1,200 కోట్లకు పైమాటే. అధికారంలోకి రాగానే ఎన్జీటీకి ఇచ్చిన నివేదికలు, మంత్రి నారాయణ ప్రకటనలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలు చూస్తే ఈ చెత్త లెక్కలను ఎలా పెంచుకుంటూ పోయారో తెలుస్తుంది. కాంట్రాక్టర్లు పనిచేయకపోయినా డబ్బులు చెల్లించడం, చెత్తను తరలించకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడికక్కడ తగలబెడుతుండడం చూస్తే కమీషన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిందో అర్థమౌతుంది.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న పొగ
లెక్కలు పెంచేసి.. కాగితాలపై క్లియర్ చేసి.. రూ.కోట్లు స్వాహా..
గత ప్రభుత్వ హయాంలో 123 మున్సిపాలిటీలలో లెగసీ చెత్త (దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్త) 85 లక్షల టన్నులకు గానూ 4.10 లక్షల టన్నులను క్లియర్ చేసినట్లు తేల్చారు. ఆ విషయాన్ని 2024 జులై 11న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్‌లో పొందుపరిచారు. కానీ 2025 మార్చి 16న ఎన్జీటీకి సమర్పించిన మరో అఫిడవిట్‌లో లెగసీ చెత్తను మళ్లీ 85 లక్షల టన్నులుగా చూపించారు. అందులో 50 లక్షల టన్నుల చెత్తను ప్రాసెస్ చేశామని చెప్పారు. మళ్లీ 2025 సెప్టెంబర్ 23న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్‌లో లెగసీ చెత్త 84 లక్షల టన్నులున్నట్లు చూపించారు.
అందులో 82 లక్షల టన్నుల చెత్తను ప్రాసెస్ చేశామని చెప్పారు. 2026 ఫిబ్రవరి 13న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్‌లో లెగసీ చెత్త 1.53 కోట్ల టన్నులుగా చూపించారు. అందులో 1.08 కోట్ల టన్నులను ప్రాసెస్ చేసినట్లు చూపించారు. ఇదే ఏడాది జులై 31 నాటికి లెగసీ చెత్త మొత్తాన్ని 1.58 కోట్ల టన్నులకు పెంచేశారు. అందులో 1.34 కోట్ల టన్నులను ప్రాసెస్ చేశామని చూపించారు. లెగసీ చెత్త లెక్కలను ఇలా ఎందుకు పెంచుతున్నారో మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. చెత్త లెక్కను కాగితాలపై పెంచుతున్నారు. చెత్తను క్లియర్ చేసేశామని కాగితాలపైనే చెబుతున్నారు. కానీ ఏమీ చేయకుండా టన్నుకు రూ.800 చొప్పున దాదాపు రూ. 1200 కోట్లకు పైగా నొక్కేయడానికి స్కెచ్ వేశారు.
క్లియర్ చేసిన చెత్త కన్నా మొత్తం చెత్త తక్కువట..
లెక్కకు మించిన చెత్త మెక్కేయడంతో చంద్రబాబు సర్కారుకు మెదడు మొద్దు బారిపోయినట్లుంది. సుమారు 20 మున్సిపాలిటీలలో మొదట సమర్పించిన అఫిడవిట్‌లలో క్లియర్ చేసిన చెత్త కంటే... మొత్తం చెత్త తక్కువ అని తదుపరి అఫిడవిట్‌లో తెలియజేశారు. అంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాజమహేంద్రవరంలో మూడు అఫిడవిట్లలో 5.12 లక్షల టన్నుల చెత్త ఉందని అందులో 5.11 లక్షల టన్నులు క్లియర్ చేశామని చూపించారు.
అంటే 5.11 లక్షల టన్నులకు బిల్లులు పెట్టుకుని తినేసినట్లే కదా.. కానీ మూడు నెలల తర్వాత సమర్పించిన అఫిడవిట్‌లో మొత్తం చెత్త 2.78లక్షల టన్నులని చూపించారు. తాడిపత్రిలో 1.27 లక్షల టన్నుల చెత్త ఉందని, అందులో 1.16 లక్షల టన్నులు క్లియర్ చేశామని చూపించి మూడు నెలల తర్వాత 4వ అఫిడవిట్‌లో మొత్తం చెత్త 22 వేల టన్నులు అని తెలియజేశారు. అవకతవకలు ఈస్థాయిలో జరిగిన నేపథ్యంలో దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపితే తప్ప నిజాలు బయటపడవు.
నచ్చిన కంపెనీలకే పనులు.. కాంట్రాక్టర్లపై చర్యల్లేవ్..
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు మొదలు మొత్తం ప్రక్రియనంతటినీ అస్తవ్యస్తంగా మార్చేసింది. 2025 మార్చిలో సౌరాష్ట్ర కంపెనీకి కర్నూలు, పరిసరాల్లోని 11 డంపింగ్ యార్డులను కట్టబెట్టారు. మిగిలిన చోట్ల వేర్వేరు కంపెనీలకు పనులు అప్పగించారు. చెత్త మొత్తాన్ని 2025 అక్టోబర్ 2 నాటికి క్లియర్ చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం గడువులోగా పూర్తి చేస్తే 10శాతం అదనపు ప్రోత్సాహకం, విఫలమైతే 20శాతం పెనాల్టీ విధించాలి. అయితే 2025 గడువు ముగిసి, 2026 నాటికి కూడా పనులు పూర్తికాకపోయినా కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
పైగా క్లియర్ చేస్తున్నట్లు ఎన్జీటీకి తప్పుడు నివేదికలు సమర్పించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు పూర్తి బిల్లులు చెల్లిస్తున్నారు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. వేలాది ఇళ్లకు కనీసం ఇంటింటికీ చెత్త సేకరణ కూడా చేయడం లేదు. డంపింగ్ యార్డులలో అవినీతి కప్పిపుచ్చుకోవడానికి నిబంధనల ప్రకారం పెట్టాల్సిన సీసీ కెమెరాలను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టేశారు. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో కూటమి ప్రభుత్వం చేసిన పర్యావరణ వినాశనం వర్ణనాతీతం. చెత్తను శాస్త్రీయంగా విడదీసి, బయో–మైనింగ్ ద్వారా భూమిని పునరుద్ధరించాల్సి ఉండగా, ఇక్కడ బిల్లులు మింగేయడానికి అడ్డదారి తొక్కారు. చెత్తను మట్టితో పూడ్చారు.
టన్నుకు రూ.800 చొప్పున కోట్లాది రూపాయల బిల్లులు డ్రా చేసుకున్నారు. కాంట్రాక్టర్లు, మున్సిపల్ అధికారులు కుమ్మక్కయి చెత్తను ప్రాసెస్ చేయకుండానే భారీ ఎత్తున మట్టిలో పూడ్చిపెట్టారు. ఎన్జీటీ నిబంధనల ప్రకారం.. చెత్తను మట్టితో కప్పివేయడం వల్ల (కేపింగ్) వ్యర్థాల నుంచి అత్యంత ప్రమాదకరమైన విష ద్రావకం విడుదలై భూగర్భ జలాల్లోకి చేరుతుంది. ఇది చుట్టుపక్కల ప్రాంతాల తాగునీటిని పూర్తిగా విషపూరితంగా మారుస్తుంది. పర్యావరణానికి ఇంతటి ద్రోహం జరుగుతున్నా, పచ్చ చొక్కాల జేబులు నిండటమే లక్ష్యంగా ఈ దారుణాన్ని సాగనిచ్చారు.
వైఎస్సార్‌సీపీ ‘క్లాప్’ విజయంకూటమి ‘చెత్త’ వైఫల్యం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2021 అక్టోబర్ 2న ప్రారంభించిన క్లాప్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పారిశుధ్య వ్యవస్థ రూపురేఖలను మార్చింది. నాడు కేంద్రం నిధులతో సంబంధం లేకుండా సొంత బడ్జెట్‌తో ప్రతి ఇంటికీ ఉచితంగా 1.2 కోట్ల డస్ట్‌బిన్లు పంపిణీ చేసి, 4,097 గార్బేజ్ ఆటోలను జీపీఎస్ ట్రాకింగ్‌తో నడిపింది. నిల్వ చెత్తను పర్యావరణ హితంగా క్లియర్ చేసింది. ఇంటింటి చెత్త సేకరణను తూతూ మంత్రంగా మార్చేసిన చంద్రబాబు సర్కారు గత ప్రభుత్వం తీసుకువచ్చిన క్లాప్ వాహనాలనూ డంపింగ్‌యార్డులకు పరిమితం చేసింది. విజయవాడతో పాటు పలు మున్సిపాలిటీల్లో వందల సంఖ్యలో వాహనాలు మూలకు చేరాయి.
100కుపైగా డంపింగ్ యార్డుల్లో చెత్తకు నిప్పు
నిబంధనల ప్రకారం పనులు చేయకపోగా, చెత్త పరిమాణాన్ని తగ్గించి చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంచుకున్న మరో అడ్డదారి చెత్తను తగలబెట్టడం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో దాదాపు 100 పైగా డంపింగ్ యార్డులలో రాత్రికి రాత్రే చెత్త కుప్పలకు నిప్పు పెట్టారు. దీనివల్ల వాతావరణంలోకి పీఎం2.5, పీఎం10, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, డయాక్సిన్లు, బెంజీన్ వంటి అత్యంత క్యాన్సర్ కారక రసాయనాలతో పాటు విషవాయువులు విడుదలయ్యాయి. చుట్టుపక్కల నివసించే ప్రజలు ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతుంటే, మూగజీవాలు ఊపిరాడక మరణిస్తున్నాయి. చెత్త కాలి బూడిదవుతుంటే, ఆ బూడిదను కూడా క్లియర్ చేసినట్లు కాగితాలపై దొంగ లెక్కలు రాసి రూ.కోట్లు స్వాహా చేశారు.

ప్రకాశం జిల్లా కొప్పోలులో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన చెత్త
కడపలో కుమ్మేశారు
కడప నగరంలో లెగసీ చెత్త లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. ఎన్జీటీకి సమర్పించిన మొదటి మూడు అఫిడవిట్లలో 1.08 లక్షల టన్నుల చెత్త ఉందని 100శాతం ప్రాసెస్ చేసేశామని చెప్పారు. మూడు నెలల తర్వాత సమర్పించిన నాల్గవ అఫిడవిట్‌లో లెగసీ చెత్త 8.41 లక్షల టన్నులుందని, అందులో 5.5 లక్షల టన్నుల చెత్త క్లియర్ చేశామని చెప్పారు. లెగసీ చెత్త 100శాతం క్లియర్ అయ్యిందని చెప్పిన తర్వాత 800శాతం చెత్త పెరగడం ఎలా సాధ్యం? పైగా మూడు నెలల వ్యవధిలో 4.5 లక్షల టన్నుల చెత్తను అదనంగా ప్రాసెస్ చేశామనడం ఎలా సాధ్యం? దోపిడీకి ఇది ప్రబల సాక్ష్యం.

ప్రొద్దుటూరులో పిండేశారు
మూడు అఫిడవిట్లలో 2.06 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందని చెప్పి మొత్తం 2.06 లక్షల టన్నులూ క్లియర్ చేసేశామని చూపించారు. తర్వాత మూడు నెలలకు ఏకంగా 5.05లక్షల టన్నుల చెత్త ఉందని అఫిడవిట్‌లో ప్రకటించారు. డంపింగ్ యార్డులో క్లియర్ అయిన చెత్త ఒక్కసారిగా అలా ఎలా పెరిగింది?

కర్నూలులో కొట్టేశారు..
కర్నూలులో 1.5 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందని, మొత్తం క్లియర్ చేసేశామని మూడు అఫిడవిట్లలో చెప్పారు. మూడు నెలల తర్వాత 7.61 లక్షల టన్నుల చెత్త ఉందని చూపించారు. చెత్తను పెంచి క్లియర్ చేసి కొట్టేశారన్నమాట..

అనంతపురంలో అడ్డగోలు లెక్క..
మూడు అఫిడవిట్లలో 3.32 లక్షల టన్నుల చెత్త ఉందని చెప్పారు. మొత్తం క్లియర్ చేసి 12 ఎకరాల డంపింగ్ యార్డ్ స్థలాన్ని కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుందని చెప్పారు. కానీ 2026 జనవరి నాటికి 7.10 లక్షల టన్నుల చెత్త ఉందని అఫిడవిట్ ఇచ్చారు. ఇంతకన్నా అడ్డగోలు లెక్క ఎక్కడైనా ఉంటుందా?

తిరుపతిలోనూ తినేశారు..
మొదటి మూడు అఫిడవిట్లలో 2.04 లక్షల టన్నుల చెత్త ఉందని చెప్పారు. పూర్తిగా తొలగించామని చూపించారు. 12 ఎకరాల డంపింగ్ యార్డును కూడా స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. 4వ అఫిడవిట్‌లో ఏకంగా 6.26 లక్షల టన్నుల చెత్త ఉందని అఫిడవిట్ ఇచ్చారు. అంటే ఎంత తినేశారో అర్థం కావడం లేదూ?

వైజాగ్‌లో దోచేశారు..
మొత్తం 9.6 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందని మూడు అఫిడవిట్లలోనూ చెప్పి మొత్తం క్లియర్ చేసినట్లు చూపించారు. మూడు నెలల తర్వాత 17.84లక్షల టన్నులకు చెత్తను పెంచేశారు. అంటే దోపిడీ ఏ స్థాయిలో చేశారో తెలుస్తూనే ఉంది కదా..?

గత ప్రభుత్వం క్లియర్ చేసిన చెత్తను కూడా కలిపేసి...
మున్సిపాలిటీల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ చెత్తకు గాను గత ప్రభుత్వం 41.10 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేసిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీకి) 2024 జులై 11న సమర్పించిన అఫిడవిట్‌లో చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది.

కానీ 2025 మార్చి 16న 85 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందంటూ మరో అఫిడవిట్ ఇచ్చింది. అందులో 50 లక్షల టన్నులు క్లియర్ చేశామంది. 2025 సెప్టెంబర్ 23న మరో అఫిడవిట్‌లో 84 లక్షల టన్నుల లెగసీ చెత్త ఉందని చెప్పింది. అందులో 82 లక్షల టన్నులు క్లియర్ చేశామంది.
అంతా క్లియర్ చేసేశాం మంత్రి నారాయణ
గత ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వదిలేసింది. స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు చెత్త తొలగింపును 2025 నాటికి పూర్తి చేయమన్నారు. ఇప్పటికే 84లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలగించాం. అక్టోబర్ 2 నాటికి 85 లక్షలు పూర్తి చేస్తాం’ అని శాసన మండలి సాక్షిగా మంత్రి నారాయణ 2025 సెప్టెంబర్ 19న ప్రకటించారు.

నాలుగో అఫిడవిట్‌లో 1.53 కోట్ల టన్నుల చెత్త
ఐదునెలలు తిరక్కుండానే కోట్ల టన్నులకు లెగసీ చెత్త పెరిగిపోయింది. లెగసీ చెత్త 1.53 కోట్ల టన్నులంటూ 2026 ఫిబ్రవరి 13న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్‌లో చంద్రబాబు సర్కార్ పేర్కొంది.
ఐదో అఫిడవిట్‌లో 1.58 కోట్ల టన్నుల చెత్త
మరో నాలుగునెలలయ్యేసరికి లెగసీ చెత్త లెక్క 1.58 కోట్ల టన్నులకు చేరుకుంది. 2026 జులై 31న ఎన్జీటీకి సమర్పించిన మరో అఫిడవిట్‌లో చంద్రబాబు సర్కార్ ఈ కొత్త లెక్క చెప్పింది.

1.05 కోట్ల టన్నుల చెత్త చంద్రబాబు
‘గత ప్రభుత్వం 1.05 కోట్ల మెట్రిక్ టన్నుల చెత్తను పట్టణాల్లో వదిలేసి వెళ్లిపోయింది.’ అని 2026 జనవరి 24న సీఎం చంద్రబాబు చెప్పారు.
ఏమిటీ చెత్త మర్మం?
లెగసీ చెత్త 85 లక్షల టన్నుల్లో గత ప్రభుత్వం 41.10 లక్షల టన్నులు క్లియర్ చేసిందని అఫిడవిట్‌లో చెప్పిన చంద్రబాబు 2026 జనవరి 24 నాటికి 1.05 కోట్ల టన్నుల చెత్త ఉందని ఎందుకు మార్చి చెప్పినట్లు? ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 13న ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్‌లో చెత్త నిల్వలను ఏకంగా 1.53 కోట్ల టన్నులకు ఎందుకు పెంచేసినట్లు? జులై 31 నాటికి ఈ లెక్కను 1.58 కోట్ల టన్నులకు పెంచి మరో అఫిడవిట్ ఎందుకు వేసినట్లు? ఈ ఐదు అఫిడవిట్‌లలోనూ కోట్ల టన్నులు క్లియర్ చేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది. వీటన్నిటి వెనక ఏదో ‘దోపిడీ మర్మం’ ఉందని అర్థం కావడం లేదూ?


