చేబదుళ్ల అప్పుల్లో దేశంలోనే ఏపీ టాప్‌ | CAG report on the financial affairs of the states | Sakshi
Sakshi News home page

చేబదుళ్ల అప్పుల్లో దేశంలోనే ఏపీ టాప్‌

Jun 25 2026 4:34 AM | Updated on Jun 25 2026 8:43 AM

CAG report on the financial affairs of the states

అత్యధికంగా రూ.1,72,532 కోట్లు చేబదుళ్ల రూపంలో అప్పు

చేబదుళ్లపై వడ్డీ రూ.303 కోట్లు 

సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో భారీగా వడ్డీ భారం 

ఏడాది పొడవునా అప్పు చేయనిదే పూట గడవని దుస్థితి 

357 రోజులూ అప్పులపైనే మనుగడ

ఇదీ చంద్రబాబు సర్కారు ఆర్థిక నిర్వహణ సామర్థ్యం! 

రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలపై ‘కాగ్‌’ నివేదికలో వెల్లడి  

సాక్షి, అమరావతి: అటు అప్పులపై వడ్డీలు.. చివరకు చేబదుళ్లపైనా వడ్డీలే..! చంద్రబాబు సర్కారు మరో కొత్త చరిత్ర సృష్టించింది. అప్పులపై వడ్డీలు ఎలాగూ తప్పవు. కానీ చేబదుళ్లు అంటే ఎలాంటి వడ్డీ లేకుండా స్వల్పకాల వ్యవధిలో తిరిగి చెల్లించేలా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కల్పించిన వెసులుబాటు! రాబడులు, చెల్లింపుల మధ్య స్పల్ప విరామంలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు రిజర్వు బ్యాంకు ప్రభుత్వాలకు దీని ద్వారా వెసులుబాటు కల్పిస్తుంది. 

అయితే చంద్రబాబు సర్కారు దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం కావడం.. సకాలంలో తీసుకున్న అప్పు తీర్చకపోవడంతో చేబదుళ్లపై ఏకంగా రూ.303 కోట్లు వడ్డీ కట్టాల్సి వచ్చినట్లు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో దిగజారిన ఆర్థిక వ్యవస్థకు ఇది నిదర్శమని ఆర్థికవేత్తలు అభివర్ణిస్తున్నారు.  

చేబదుళ్ల అప్పుల్లో ఏపీ టాప్‌... 
2024–25 ఆర్థిక సంవత్సరంలో చేబదుళ్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్లు ‘కాగ్‌’ నివేదిక వెల్లడించింది. వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సులు, ఓవర్‌ డ్రాఫ్ట్‌లను వినియోగించుకుని సకాలంలో అప్పు చెల్లిస్తే వడ్డీ చెల్లించాల్సిన అవస­రం లేదు. అయితే సకాలంలో అప్పు చెల్లించకుంటే అత్యధిక వడ్డీ కట్టాల్సి వస్తుంది. 

2024 –25­లో దేశంలోనే అత్యధికంగా చేబదుళ్ల అప్పులు చేసిన చంద్రబాబు సర్కారు.. ఆ అప్పును సకాలంలో తీర్చకపోవడంతో ఏకంగా రూ.303 కోట్ల మేర వడ్డీ చెల్లించింది. అంతేకాదు.. 2024–25లో చంద్రబాబు సర్కారు ఆర్బీఐ వద్ద కేవలం ఎనిమిది రోజులు మాత్రమే కనీస నగదు నిల్వలను నిర్వహించింది. మిగతా 357 రోజులూ చేబదుళ్ల రూపంలో అప్పు చేయనిదే పూట గడవలేదు. ఇదీ చంద్రబాబు సర్కారు ఆర్థిక వ్యవహారాల దక్షత! అని ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు.   

»  2024–25లో దేశంలో 16 రాష్ట్రాలు చేబదుళ్ల తరహాలో వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌లు, ఓవర్‌ డ్రాఫ్ట్‌ ద్వారా రూ.6.87 లక్షల కోట్లు వాడుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్‌ ఏకంగా 62 శాతాన్ని వినియోగించుకున్నాయి. దేశంలోనే అత్యధికంగా చేబదుళ్ల రూపంలో రూ.1,72,532 కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్‌ 2024–25లో మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ రూ.1,29,376 కోట్ల చేబదుళ్ల అప్పుతో రెండో స్థానంలో ఉండగా, రాజస్థాన్‌ రూ.1,22,279 కోట్ల చేబదుళ్ల అప్పుతో మూడో స్థానంలో ఉంది.  

» 2024–25లో దేశంలో 11 రాష్ట్రాలు చేబదుళ్ల అప్పులను వినియోగించుకోలేదు. అరుణాచల్‌ ప్రదేశ్, బి­హార్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మ­హారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ చేబదుళ్ల అప్పులను తీసుకోకపోవడం గమనార్హం. 

 

చేబదుళ్లపై వడ్డీ... ఆర్థిక నిర్వహణ వైఫల్యమే 
2024–25లో చంద్రబాబు సర్కారు 71 రోజులు రూ.42,004 కోట్ల మేర స్పెషల్‌ వేస్‌ అండ్‌ మీన్స్‌ వినియోగించుకుంది. రూ.73,897 కోట్ల మేర వేస్‌ అండ్‌ మీన్స్‌ 179 రోజులు వాడుకుంది. అలాగే 107 రోజులు రూ.56,631 కోట్ల మేర ఓవర్‌ డ్రాఫ్ట్‌ను వినియోగించుకుంది. ఈ మొత్తాలను నిర్దేశించిన గడువులోగా తిరిగి చెల్లించకపోవడంతో ఏకంగా రూ.303 కోట్ల మేర వడ్డీ కింద ఆర్బీఐకి కట్టాల్సి వచ్చింది. చేబదుళ్లకే వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి దాపురించిందంటే చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ ఎంత దారుణంగా ఉందో వేరే చెప్పాల్సిన పని లేదని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement