రాబడి నాస్తి.. అప్పులు జాస్తి | CAG releases key budget indicators for the first two months of the financial year | Sakshi
Sakshi News home page

రాబడి నాస్తి.. అప్పులు జాస్తి

Jun 19 2026 4:44 AM | Updated on Jun 19 2026 4:44 AM

CAG releases key budget indicators for the first two months of the financial year

చంద్రబాబు పాలన తీరిదీ..

ఈ ఆర్థిక సంవత్సరం మే వరకు సొంత రాబడి రూ.19,414 కోట్లు 

అప్పులు రూ.20,663 కోట్లు  

అప్పులో కేపిటల్‌ వ్యయం కేవలం రూ.5,539 కోట్లే 

కేంద్ర గ్రాంట్లు బడ్జెట్‌ అంచనాల్లో కేవలం 2.01 శాతమే 

రెండు నెలల్లోనే రెవెన్యూ లోటు 66.70 శాతం 

ఈ ఆర్థిక ఏడాది తొలి 2 నెలల్లో బడ్జెట్‌ కీలక సూచికలను వెల్లడించిన కాగ్‌

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం తక్కువ.. అప్పులు ఎక్కువ అయ్యాయి. రాష్ట్ర సొంత పన్ను రాబడులను పెంచే ప్రయత్నమే లేకపోవడంతో అప్పుల మీద అప్పులు చేయాల్సి వస్తోంది. మరో పక్క చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా ఇతర రెవెన్యూ రంగాలకు మళ్లించేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) మే నెల వరకు బడ్జెట్‌ కీలక సూచికలే వెల్లడించాయి. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఈ సూచికలను వెల్లడించింది. 

కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా రాబడిని మినహాయించి రాష్ట్ర సొంత పన్ను రాబడులు చూస్తే ఏప్రిల్, మే నెలల్లో రూ.19,414 కోట్లు వచ్చినట్లు కాగ్‌ నివేదిక పేర్కొంది. ఇదే కాలంలో బడ్జెట్‌లో చేసిన అప్పు రూ.20,663 కోట్లుగా తెలిపింది. ఇలా రాబడులు తగ్గిపోయి అప్పులు పెరిగిపోవడమంటే రాష్ట్రం దివాళా దిశగా పయనించడమే తప్ప మరొకటి కాదని స్పష్టం అవుతోంది. మరో పక్క చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చేయడంలేదని కాగ్‌ పేర్కొన్న కేపిటల్‌ వ్యయమే స్పష్టం చేస్తోంది. 

చేసిన అప్పుల్లో కేపిటల్‌ వ్యయం కేవలం రూ.5,539 కోట్లేనని కాగ్‌ పేర్కొంది. అంటే బడ్జెట్‌ ప్రతిపాదన మూల ధన వ్యయంలో మే నెల వరకు రూ.11.38 శాతమే వ్యయంగా ఉంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన అప్పులో ఏప్రిల్, మే నెలల్లోనే 27.24 శాతం అప్పు చేసినట్లు కాగ్‌ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లరూపంలో మే నెల వరకు కేవలం 2.01 శాతమే వచ్చినట్లు తెలిపింది. కేంద్ర గ్రాంట్ల రూపంలో రూ.32,458 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో ప్రతిపాదించగా.. వాస్తవంగా వచ్చింది కేవలం రూ.652 కోట్లే. 

కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో నిధులు రాబట్టలేకపోయింది. మరో పక్క ఆర్థిక ఏడాది రెండు నెలల్లోనే రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయింది. బడ్జెట్‌ ప్రతిపాదనల్లో సంవత్సరం మొత్తానికి రెవెన్యూ లోటును రూ.22,002 కోట్లకు పరిమితం చేస్తామని గొప్పగా చెప్పగా.. మే నెల వరకే బడ్జెట్‌ ప్రతిపాదనల్లో 66.70 శాతం అంటే రూ.14,676 కోట్లకు రెవెన్యూ లోటు చేరినట్లు కాగ్‌ గణాంకాలు స్పష్టం చేశాయి. బడ్జెట్‌ ప్రతిపాదనల ద్రవ్యలోటులో తొలి రెండు నెలల్లోనే 27.24 శాతానికి చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement