రుణానికి పూర్తి బాధ్యత మేఘాదే | Sakshi
Sakshi News home page

రుణానికి పూర్తి బాధ్యత మేఘాదే

Published Fri, Nov 24 2023 5:41 AM

Buggana Rajendranath on Arogyashri - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ దోపిడీ గురించి మాట్లాడటం అంటే గజదొంగే దొంగా.. దొంగా అని అరిచినట్లుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ మండిపడ్డారు. మేఘా సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ ఆరోపణను ఆయన ఖండించారు. రుణా­నికి సంబంధించిన పూర్తి బాధ్యత మేఘా సంస్థదేనని, ప్రభుత్వానికి సంబంధం లేదని బుగ్గన గురువారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. చంద్రబాబు కళ్లల్లో పడటం కోసం కొత్తగా వచ్చిన ఓ నాయకుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డా­రు.

మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో రూ.2,000 కోట్లు అప్పు తెచ్చుకుందని అర్థం లేకుండా ఆరోపించారని, అసలు గ్యారెంటీ లెటర్‌ అంటే ఏంటో కనీస అవగాహన లేదన్నారు. ప్రైవేటు సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ అనేది ముమ్మాటికీ అబద్ధమన్నారు. ఇది ప్రభుత్వమిచ్చిన గ్యారెంటీ కాదని, ప్రభుత్వం కేవలం ప్రైవేట్‌ సంస్థకు బకాయిలెన్ని ఉన్నాయి అని వివరాలు ఇవ్వడం జరిగిందన్నారు. అదికూడా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పెద్ద పెద్ద నీటి పారుదల ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇచ్చినదని, పోలవరం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలి­పారు.  

బ్యాంకుకు కట్టవలసిన వడ్డీ ఆ ప్రైవేట్‌ సంస్థకు సంబంధించిన వ్యవహారం మాత్రమేనని తెలిపారు. వడ్డీ, అసలు కట్టే విషయంలో ఎలాంటి ఆలస్యమైనా ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చే­శారు. బ్యాంకులు ఆ ప్రై­వేట్‌ సంస్థ విశ్వసనీయత ఆధారంగానే లోన్లు ఇస్తున్నాయని బుగ్గన పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు పోలవరం విషయంలో చేసిన తప్పులే ప్రస్తుత పరిస్థితులకు కారణమని బుగ్గన విమర్శించారు.  

మీరు పెట్టిన బకాయిలను మేం చెల్లించాం
ఆరోగ్యశ్రీ బిల్లులకు గ్యారెంటీ ఇవ్వరా అని అడుగుతున్నారని, టీడీపీ పాలనలో రూ. 800 కోట్లు పైచిలుకు చివరి 8 నెలల కాలంలో పెండింగ్‌లో పెట్టినప్పుడు చంద్రబాబు గ్యారెంటీ ఇచ్చారా? అని బుగ్గన ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ బకాయిలు చెల్లించి డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సామర్థ్యం పెంచి పేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నామన్నారు.

ఆరోగ్యశ్రీకి టీడీపీ ఐదేళ్ల కాలంలో రూ. 5,177 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఈ నాలుగున్నరేళ్లలోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ. 9,514.84 కోట్లు వెచ్చించిందని, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత టీడీపీకి ఎక్కడదని బుగ్గన అన్నారు. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి ఉన్న రూ. 40,000 కోట్లు పెండింగ్‌ బిల్లులకు గ్యారెంటీ అడిగారా అని నిలదీశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ బిల్లులు చెల్లించిందని తెలిపారు. ఇక ట్యాంకర్లతో అందించిన నీటికి బిల్లుల విషయంలోనూ టీడీపీ ప్రభుత్వం పెట్టిన రూ. 80 కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం రాగానే చెల్లించిందని చెప్పారు.

 
Advertisement
 
Advertisement