రోజుకు 8 మంది రైతు, రైతు కూలీల బలవన్మరణం
2025లో 2,865 మంది ఆత్మహత్య
అన్నివర్గాలూ కలిపి 8,433 మంది బలవన్మరణం
2024 కంటే 4.8శాతం పెరిగిన ఆత్మహత్యలు
భవితపై భరోసా లేకనే..
చంద్రబాబు ప్రభుత్వంలో దుస్థితి ఇదీ
పోలీసు శాఖ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతులకు హాలాహలమే దిక్కవుతోంది. రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల మరణమృదంగం మోగుతోంది. రోజుకు సగటున 8 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే ప్రతి మూడు గంటలకు ఓ రైతు/రైతు కూలీ బతుకు భారమై బలవన్మరణానికి పాల్పడుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. 2025లో రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల దయనీయ స్థితి ఇదీ... రాష్ట్ర పోలీసు శాఖ అధికారికంగా వెల్లడించిన చేదు నిజం ఇదీ. 2025లో రాష్ట్రంలో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు.

గృహిణులూ బలి
బలవన్మరణం పాలైన వారిలో గృహిణులు రెండో స్థానంలో ఉన్నారు. 1,884 మంది గృహిణులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే రాష్ట్రంలో గృహహింస వేధింపులు పెరుగుతున్నాయన్నది స్పష్టమవుతోంది. మహిళా భద్రతపట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే అందుకు కారణమన్నది స్పష్టమవుతోంది. రైతులు, రైతు కూలీలు, గృహిణులతోపాటు ఇతర వర్గాల ప్రజల ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయని పోలీసు శాఖ నివేదిక వెల్లడించింది. 2024లో కంటే 2025లో రాష్ట్రంలో ఆత్మహత్యలు 4.8 శాతం పెరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సమర్పించిన నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ...
⇒ రాష్ట్రంలో 2024లో 8,045 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కాగా 2025లో ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య 8,433కు పెరిగింది.
భవితపై భరోసా లేకనే...
రాష్ట్రంలో భవిష్యత్‌పై భరోసా లేకనే అత్యధికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పోలీసు శాఖ నివేదిక వెల్లడించింది. 2025లో ఆత్మహత్యలు చేసుకున్నవారిలో పురుషులు 6,360మంది, మహిళలు 2,073 మంది ఉన్నారు. బలవన్మరణం పాలైన వారిలో 30 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారు అత్యధికంగా 4,594 మంది ఉన్నారు. భవిష్యత్‌పై భరోసా లేకనే వారు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.


