నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి యత్నించాలి
వృద్ధి, తలసరి ఆదాయం లక్ష్యాల సాధన బాధ్యత కలెక్టర్లు, మంత్రులదే
కాలం చెల్లిన, అవసరం లేని చట్టాలు రద్దు చేస్తాం
రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలపై ఆడిట్ చేయాలి
సలహాలు కాదు.. ఏమి చేస్తే ఫలితాలు వస్తాయో చేసి చూపించండి
సంతానోత్పత్తి పెంచేందుకు ప్రోత్సాహకాలు
హాస్టల్ విద్యార్థులకు అనారోగ్య సమస్యలు వస్తే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత
ఎర్ర చందనం విక్రయం ద్వారా రూ.కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశాం
మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఐఏఎస్‌లు అయిపోయాం.. అన్నీ తెలుసనే ధోరణి వీడి నేర్చుకోవడం, తెలుసుకోవడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లు, కార్యదర్శులు, శాఖాధిపతులకు సూచించారు. 2025–26 జీఎస్‌డీపీ వృద్ధి 12.16 శాతం లక్ష్యం అనుకుంటే ఇప్పుడు 9.88 శాతమే వృద్ధి నమోదైందని, అందరూ సరిగా పనిచేస్తే 13 శాతం వృద్ధి రావాలని సీఎం పేర్కొన్నారు. ఎవరు సరిగా పనిచేయడం లేదో తమ వద్ద వివరాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అంచనాలను ఇచ్చామని, ఆ మేరకు వృద్ధి వస్తోందా..? లేదా..? అనేది కలెక్టర్లు దృష్టి సారించడంతోపాటు తెలియకపోతే తెలుసుకోవడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. సోమవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లతో సీఎం సమావేశం నిర్వహించారు.
జీఎస్‌డీపీ వృద్ధి, విద్య, వైద్య, ఆదాయ ఆర్జన తదితర రంగాలపై సమీక్షించారు. జీఎస్‌డీపీ వృద్ధి, తలసరి ఆదాయం లక్ష్యాల సాధన బాధ్యత కలెక్టర్లతోపాటు మంత్రులదేనని సీఎం స్పష్టం చేశారు. లక్ష్యాలు సాధించకపోవడానికి నిర్లక్ష్యం లేదా తెలియకపోవడమే కారణమన్నారు. ఈ ఏడాది లక్ష్యాల్లో వెనుకబడితే వచ్చే ఏడాది కవర్ చేయాలని, లేదంటే ఆ శాఖలు డిఫాల్టర్లు అవుతాయని వివరించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కాలం చెల్లిన, అవసరం లేని చట్టాలు రద్దు చేస్తామన్నారు. కేంద్రం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు.
రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలపై ఆడిట్ చేయాలని చెప్పారు. రాత్రింబవళ్లూ పనిచేయడం కాదని, మనసు పెట్టి పనిచేస్తేనే ఫలితాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు. ‘నాకు సలహాలు ఇవ్వద్దు.. ఏమి చేస్తే ఫలితాలు వస్తాయో అది చేసి చూపించండి’ అని సీఎం సూచించారు. తనతోపాటు కింది స్థాయి వరకు ఉద్యోగులంతా సమష్టిగా పనిచేస్తేనే ఫలితాలు వస్తాయన్నారు. యూరప్ దేశాల్లో వృద్ధులు పెరిగిపోతున్నారని, రాష్ట్రంలో జనాభా తగ్గిపోతోందని, ఈ నేపథ్యంలో సంతానం పెంచేందుకు ప్రోత్సహకాలతో జనాభా నిర్వహణ విధానాన్ని మార్చిలో అసెంబ్లీలో ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి విధానం అమల్లోకి వస్తుందన్నారు.
కుప్పంలోనే 14.9 శాతం మందికి బాల్య దశలోనే గర్భధారణ
రాష్ట్రంలో సిజేరియన్ డెలివరీలను తగ్గించి సాధారణ డెలివరీలు పెరిగేలా అవగాహన కల్పించాలని చంద్రబాబు సూచించారు. బాల్య వివాహాలపైనా సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా కుప్పంలోనే 14.9 శాతం మంది బాల్య దశలోనే గర్భం దాల్చుతున్నారని, ఇవి కూడా జనాభాపై ప్రభావం చూపుతున్నాయని ఓ అధికారి వివరించారు. 71 లక్షల మంది పిల్లల ఆరోగ్య డేటాను ఆన్‌లైన్‌లోకి తీసుకురావాల్సిందిగా సీఎం సూచించారు. హాస్టల్ విద్యార్థులకు తరుచూ అనారోగ్య సమస్యలు వస్తే కలెక్టర్లు, మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదని వెల్లడించారు. పన్నులను పూర్తి స్థాయిలో వసూలు చేయాలని సీఎం పేర్కొన్నారు. అటవీ శాఖ దగ్గర ఉన్న ఎర్ర చందనం అమ్మకం ద్వారా అధిక ఆదాయం వస్తుందని అంచనా వేశామని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు మురిగిపోతే అధికారులే బాధ్యత వహించాలన్నారు. అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ల విషయంలో జిల్లా కలెక్టర్లు తక్షణం కేవైసీ చేపట్టాలన్నారు. 1,04,727 పీడీ ఖాతాల్లో ఉన్న అన్ క్లైమ్డ్ డిపాజిట్ల విలువ రూ.148 కోట్లుగా ఉన్నాయని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి రూ.26,021 కోట్లు వచ్చే అవకాశం ఉందని సీఎం వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్నారు


