ఎక్సైజ్‌ ఆదాయం 7శాతం ఢమాల్‌ | Andhra Pradesh own revenue 7. 6 percent of GSDP | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ ఆదాయం 7శాతం ఢమాల్‌

Feb 10 2026 2:30 AM | Updated on Feb 10 2026 2:30 AM

Andhra Pradesh own revenue 7. 6 percent of GSDP

ప్రభుత్వ ఖజానాకు గండి పడటమే దీనికి కారణమంటున్న ఆర్థిక నిపుణులు

నకిలీ మద్యం, ఇసుక, మైనింగ్‌ ఇలా అన్నింటా టీడీపీ నేతల దోపిడీ.. మరోవైపు ద్రవ్య లోటు రూ.85,269 కోట్లు 

దేశంలో ఏపీలోనే అత్యధికం  

రాష్ట్ర సొంత ఆదాయం జీఎస్‌డీపీలో 7.6 శాతమే 

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ కంటే ఏపీ సొంత ఆదాయం తక్కువ 

జీఎస్‌డీపీలో 35 శాతానికి ఎగబాకిన ఏపీ అప్పులు  

సీఎం సదస్సులో ఆర్థిక శాఖ ప్రజెంటేషన్‌

సాక్షి, అమరావతి: ఎక్సైజ్‌ రాబడి గత ఏడాది కన్నా ఈ ఏడాది 7 శాతం తగ్గిపోయింది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి వి.వినయచంద్‌తో కలసి ఆయన ప్రజెంటేషన్‌ ఇచ్చారు. గతేడాది జనవరి నాటికి ఎక్సైజ్‌ రాబడి రూ.16,032 కోట్లుగా ఉండగా ఈ ఏడాది జనవరి నాటికి రూ.14,963 కోట్లు రాబడి మాత్రమే నమోదైంది.

ఎక్సైజ్‌ మొత్తం రాబడి లక్ష్యం రూ.26,870 కోట్లు కాగా ఇప్పటి వరకు 56 శాతమే సాధించినట్లు తెలిపారు.  ప్రభుత్వ ఖజానాకు గండిపడడమే ఎక్సైజ్‌ ఆదాయం తగ్గిపోవడానికి కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండి కొట్టిన టీడీపీ నేతలు.. నకిలీ మద్యంతో దోపిడీ, విచ్చలవిడిగా బెల్టు షాపులు, చివరకు ప్రకృతి వనరులను కూడా వదలకుండా సిలికా, క్వార్జ్, మైనింగ్‌ దోపిడీతో తమ జేబులు నింపుకోవడమే దీనికి కారణమని అంటున్నారు.  మరోవైపు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో ద్రవ్యలోటు ఉన్నట్లు పీయూష్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్‌ నాటికి ఏపీ అత్యధికంగా రూ.85,269 కోట్లు ద్రవ్య లోటుతో ఉన్నట్లు తెలిపారు.  

మూలధన వ్యయం 10 శాతమే.. 
డిసెంబర్‌ నాటికి రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.60,481 కోట్లకు చేరిందని పీయూష్‌ కుమార్‌ తెలిపారు. మొత్తం వ్యయం రూ.1,97,950 కోట్లు కాగా ఇందులో రెవెన్యూ వ్యయం 90 శాతం, మూలధన వ్యయం కేవలం 10 శాతం మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో 35 శాతానికి చేరినట్లు చెప్పారు. జీఎస్‌డీపీలో రాష్ట్ర సొంత ఆదాయం కేవలం 7.6 శాతమే ఉందన్నారు. ఒడిశా (13.3 శాతం), ఛత్తీస్‌గఢ్‌ (12 శాతం) కంటే తక్కువగా ఉండటంతో కేంద్ర నిధులపై ఏపీ ఎక్కువగా ఆధారపడుతున్నట్లు సూచిస్తోందన్నారు. రాష్ట్ర స్థిర ధరల ఆధారంగా జీఎస్‌డీపీ వృద్ధి 9.88 శాతంగా ఉండగా జీఎస్‌డీపీ రూ.9,52,261 కోట్లుగా నమోదైందని చెప్పారు. 2028–29 నాటికి రూ.29 లక్షల కోట్లు జీఎస్‌డీపీ లక్ష్యం కాగా రూ.27 లక్షల కోట్లు సాధ్యం అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.  

సొంత ఆదాయ లక్ష్యానికీ దూరమే 
రాష్ట్ర సొంత ఆదాయం లక్ష్యం రూ.1,34,208 కోట్లుగా నిర్థారించగా జనవరి నాటికి రూ.83,500 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి వి.వినయ్‌చంద్‌ తెలిపారు. వాణిజ్య పన్నుల ద్వారా ఈ ఏడాది జనవరి నాటికి రూ.42,861 కోట్లు ఆర్జించగా, గత ఏడాది ఇదే సమయానికి రూ.41,385 కోట్లు వసూలయ్యాయి.  కేంద్ర సహాయ పథకాల నిధులు గతేడాదితో పోల్చితే స్వల్పంగా తగ్గి రూ.6,579 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. పన్ను వసూళ్లలో సమర్థత, డిజిటల్‌ మానిటరింగ్‌ వ్యవస్థలు, విభాగాల మధ్య సమన్వయం ద్వారా ఆదాయ వృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement