
తలలోకి దూసుకెళ్ళిన బుల్లెట్
సైనిక లాంఛనాలతో స్వగ్రామంలో అంత్యక్రియలు
బాపట్ల టౌన్: జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ హవల్దార్గా విధులు నిర్వర్తిస్తూ బాపట్లకు చెందిన సైనికుడు మృతి చెందారు. బాపట్ల మండలం, కంకటపాలేనికి చెందిన మద్దసాని గోపికృష్ణ(33) బుధవారం రాత్రి సరిహద్దులో విధులు నిర్వర్తిస్తుండగా, తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సైనికుడి మృతిపై విచారణ జరుగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు. అతని పార్థివ దేహాన్ని గురువారం స్వగ్రామానికి తరలించారు.
జిల్లా పోలీస్ అధికారులు, సూర్యలంక ఎయిర్ ఫోర్స్, ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారులు, ఎన్‌సీసీ అధికారులు, ఏపీ మాజీ సైనిక సంక్షేమ సంఘం నాయకులు కంకటపాలేనికి చేరుకొని సైనికుడి పార్థివ దేహానికి పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, మృతునికి భార్య హేమలత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.